సాక్షి, అమరావతి: నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని శ్రీలంక తీరంలో తుపాను ముప్పు పొంచి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ తుపానుకు యెమెన్ దేశం ‘దిత్వా’(అక్కడి ప్రసిద్ధ జలాశయం దిత్వా లగూన్ పేరు మీద)గా నామకరణం చేసినట్లు పేర్కొంది. దీని ప్రభావం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానికి ఆనుకొని ఉన్న దక్షిణ కోస్తా తీరాలపై ఉంటుందని తెలిపింది. గడిచిన 6 గంటల్లో 17 కిలోమీటర్ల వేగంతో తుపాను ముందుకు కదులుతోందని వెల్లడించింది. ట్రింకోమలీ(శ్రీలంక)కి 200 కి.మీ, పుదుచ్చేరికి 610 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 700 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది.
కాగా, ఈ తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తా, యానాంలో శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది.
ముందు జాగ్రత్తలు తీసుకోండి
తుపాను నేపథ్యంలో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నందున కలెక్టర్లు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. గురువారం సచివాలయం నుంచి ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాలు, కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ధాన్యం తడవకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులను అప్రమత్తం చేయాలని సూచించారు. తుపాను సమాచారాన్ని ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు.
ధాన్యం తడిచిపోయి.. తక్కువ ధరకు రైతులు బయట విక్రయించినట్లు ఫిర్యాదులు వస్తే సంబంధిత జాయింట్ కలెక్టర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని సీఎస్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడాలని ఆదేశించారు.


