రక్షణ కల్పించాలంటూ వేడుకుంటున్న బాధితురాలు
నెల్లూరు జిల్లా కావలిలో ఘటన
కావలి(అల్లూరు): టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్‌చౌదరి తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళ వాపోయింది. ఆయన నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని కోరింది. నెల్లూరు జిల్లా కావలికి చెందిన గీతాంజలి తన తల్లి కామాక్షి, బిడ్డతో కలిసి గురువారం మీడియాతో మాట్లాడారు. దగదర్తి మండలం మనుబోలుపాడుకు చెందిన చేజర్ల మహేష్ రెడ్డితో తనకు 2016లో వివాహమైందని చెప్పారు. హైదరాబాద్‌లో భర్తతో కలిసి ఉంటున్న తమ మధ్య రవికుమార్ చౌదరి గొడవలు పెట్టాడని ఆరోపించారు. భర్త లేని సమయంలో ఇంటికి వచ్చి తనను వేధించేవాడని వాపోయారు.
రవికుమార్‌చౌదరికి చెందిన అతిథిగృహంలో భర్త ముందే తనపై దాడి చేయించాడని కన్నీరు పెట్టుకున్నారు. దీంతో తన భర్తపైనా, రవికుమార్‌చౌదరిపైనా కావలి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కోర్టులో కేసు నడుస్తోందని తెలిపారు. ఆ తర్వాత కావలి కోర్టుకు వెళ్లి.. బయట కొస్తుండగా తనతో పాటు తన తల్లిపై భర్త మహేష్‌రెడ్డి, మరికొందరు దాడి చేశారని చెప్పారు. దీనిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. రవికుమార్‌చౌదరి తన భర్తను కూడా దగ్గరే పెట్టుకొని తమ కాపురాన్ని నాశనం చేశాడని వాపోయారు.
అధికారం అండతో.. చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని తెలిపారు. ఇంటి చుట్టూ రెక్కీ నిర్వహిస్తున్నారని.. తమను రక్షించాలని వేడుకున్నారు.


