ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల రివర్స్‌ ట్రెండ్‌! | KSR Comment: Ap Police Reverse Trend In Kutami Prabhutvam | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల రివర్స్‌ ట్రెండ్‌!

Jul 22 2025 9:34 AM | Updated on Jul 22 2025 1:23 PM

KSR Comment: Ap Police Reverse Trend In Kutami Prabhutvam

పోలీసు వ్యవస్థ ఎక్కడైనా నిజాలు రాబట్టేందుకు ప్రయత్నించాలి. కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తాము సృష్టించిన అబద్ధాలను నిజాలుగా మార్చేందుకు తంటాలు పడుతోంది. కుట్రలు, కుతంత్రాలకు పెట్టింది పేరైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలో, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్ రెడ్‌బుక్‌ పేరుతో బహిరంగంగానే ప్రైవేట్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో పోలీసులు వారి అరాచకాలకు తలూపుతూండటం చూస్తూంటే.. 

‘‘ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. పోలీసు రాజ్యం.. అబద్ధాల రాజ్యం’’ అనే భావన బలపడుతోంది. ఏడాది కాలంగా విపక్ష వైఎస్సార్‌సీపీ నేతలు, సోషల్‌ మీడియా కార్యకర్తలపై సాగుతున్న హింసాకాండ, దౌర్జన్యాలు, కేసుల వేధింపులు రాష్ట్ర చరిత్రలో మొదటిసారి అంటే అతిశయోక్తి కాదు. దేశం మొత్తం అత్యవసర పరిస్థితి విధించినా పోలీసులు ఈ స్థాయి అరాచకాలకు పాల్పడలేదు. అందుకే కాబోలు ఎమర్జెన్సీ తరువాత 1977లో కాంగ్రెస్‌ పార్టీ దేశమంతటా ఘోర పరాజయం చవిచూసినా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం భారీ విజయం నమోదు చేసుకుంది. అప్పట్లో ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై కూడా కొన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చినా, ఎన్నికలపై మాత్రం వాటి ప్రభావం పడలేదు. కానీ.. 

ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో పెడుతున్న కేసుల తీరు చూస్తే పోలీసులు ఇంత ఘోరంగా కూడా పనిచేస్తారా అన్న ప్రశ్న వస్తుంది. 

తాజాగా మద్యం స్కామ్ అంటూ ఒక కట్టుకథ సృష్టించి, దాని చుట్టూ రకరకాల పిట్టకథలు చేర్చి తమకు మద్దతిచ్చే మురికి మీడియాలో ప్రముఖంగా రాయిస్తూ వస్తున్నారు. ఆ మురికి మీడియా పత్రికలు, టీవీలు నిస్సిగ్గుగా అసత్యాలను జనంపై రుద్దే యత్నం చేస్తున్నాయి. ఆ క్రమంలో ఆ మురికిని ఆ మీడియా తనకే అంటించుకుంటోంది. మద్యం స్కామ్‌లో ఆరు నెలలుగా ఈ మురికి మీడియా ఇచ్చిన వార్తలు పరిశీలిస్తే ఒకదానికి మరోదానికి పొంతన కనిపించదు. సిట్ అధికారులతో ఎవరిని అరెస్టు చేయాలని భావిస్తే వారిపై తోచిన పిచ్చి కథనాలు రాస్తారు. ఇదంతా ప్రభుత్వం, మురికి మీడియా కలిసి చేస్తున్న విష ప్రచారమే అని అర్థం అవుతూనే ఉంటుంది. ప్రతిసారి ఎవరు ఈ కేసులో అరెస్టు అయితే అతనే కీలక వ్యక్తి అని పబ్లిసిటీ ఇస్తారు. 

తాజాగా వైఎస్సార్‌ కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని అరెస్టు చేశారు. అంతే సూత్రధారి ఈయనే అంటూ వార్తలు ఇచ్చారు. పోలీసుల స్పష్టమైన  ఆధారాలు ఉంటే, ఆ వివరాలను బయటపెట్టవచ్చు కానీ అలాకాకుండా మద్యం ముడుపుల డబ్బుతో బంగారం కొనుగోలు చేశారని ఒకసారి రియల్ ఎస్టేట్‌లో వెచ్చించారని ఇంకోసారి, సినిమాలు తీశారనో, ఎలక్ట్రికల్ వెహికిల్ కర్మాగారం నెలకొల్పాలని భావించారనో, టాంజానియాలో ఇంకేదో పెట్టాలని ప్లాన్ చేశారని, దుబాయిలో ఇంకేదో చేశారని, ఓటర్లకు  పంచడానికి ఈ డబ్బు  వాడారని.. రకరకాల కథనాలు ఇచ్చారు. 

ఇంకోపక్క.. లిక్కర్‌ కేసులో ఎంత విచారిస్తున్నా సాక్ష్యాధారాలు దొరకలేదని, కోట్ల పేజీల డేటా ధ్వంసం చేశారని, అయినా దానిని తిరిగి తీస్తున్నారని.. ఏవేవో మతిమాలిన స్టోరీలన్నింటిని జనం మీద వదిలారు. చివరికి పోలీసులు ఏదో తప్పనిసరి తంతుగా చార్జీషీట్‌ వేశామని అనిపించుకున్నారు. నిందితులను అరెస్టు చేసి తొంభై రోజులు దాటితే ఆటోమాటిక్‌గా డిఫాల్ట్ బెయిల్ వస్తుంది కాబట్టి ,దానిని చెడగొట్టే లక్ష్యంతో ఇలా చేశారన్నది న్యాయవాదుల అభిప్రాయంగా ఉంది. 

తొలుత అప్పటి బెవరేజ్  కార్పొరేషన్ ఎండీ వాసుదేవ రెడ్డి మద్యం స్కామ్ కు సంబంధించిన డాక్యుమెంట్లను ధ్వంసం చేయడానికి తీసుకువెళ్లారని, ఆఫీస్ వద్ద ఎవరో దీనిని చూశారని ఒక తప్పుడు  కేసు పెట్టారు. తదుపరి ఈ స్కామ్ లో  ఆయనను నిందితుడిని చేశారు. తనను తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ వేధిస్తున్నారని ఆయన హైకోర్టుకు కూడా వెళ్లారు. కాని తదుపరి ఏమి జరిగిందో కాని, ఆయన నుంచి బలవంతంగా ఒక స్టేట్మెంట్ తీసుకుని కేసును ముందుకు తీసుకువెళ్లే యత్నం చేశారు. వాసుదెవ రెడ్డితో పాటు సత్యప్రసాద్ అనే మరో ఉద్యోగిని కూడా ఇందుకు వాడుకున్నారు. వాసుదేవ రెడ్డి చివరికి వీరి వేధింపులు తట్టుకోలేక పోలీసులు అడిగిన వాంగ్మూలం ఇచ్చి కేంద్ర ప్రభుత్వ సర్వీస్‌కు వెళ్లిపోయారట. ఇప్పుడు మళ్లీ ఆయనను పట్టుకువచ్చి అప్రూవర్‌గా మార్చాలని యత్నించిన వైనం బయటపడింది. ఇదంతా ఎందుకు చేస్తున్నట్లు? అసలు ఏదైనా స్కామ్ జరిగితే దానికి సంబంధించిన నిర్దిష్ట సాక్ష్యాలు మెటీరియల్ రూపంలో కనిపిస్తాయి. ఈ కేసులో అవేమీ ఉన్నట్లు అనిపించవు. ఉదాహరణకు చంద్రబాబుపై గత ప్రభుత్వంలో వచ్చిన స్కిల్ స్కామ్‌లో కొన్ని ఆధారాలు కనిపించాయి. 

కేబినెట్‌తో సంబంధం లేకుండా చంద్రబాబే నిధులు మంజూరు చేయడం, ఆర్థిక శాఖ అభ్యంతరం చెప్పినా, సీఎం కోరుతున్నారు. కాబట్టి వెంటనే నిధులు విడుదల చేయాలని అప్పటి సీఎస్‌ కోరడం వంటివి జరిగాయి. అలాగే స్కిల్ స్కామ్ నిధులు షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ అయింది ఈడీ విచారణలో వెల్లడైంది. చివరికి డబ్బు పార్టీ బ్యాంక్ ఖాతాలోకి చేరిందని కూడా ఆ కేసు దర్యాప్తు చేసిన సీఐడీ ఆధారసహితంగా తెలిపింది. దానిని ఇంతవరకు  నేరుగా ఖండించలేకపోయారు. ఈడీనే తొలుత కొందరిని అరెస్టు చేసింది. తదుపరి ఏపీ సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసింది. అలాగే 2019లో టీడీపీ ఓటమి తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆదాయపన్ను శాఖ చంద్రబాబు  పీఏ ఇంటిలో సోదాలు చేసి, సుమారు రూ.రెండు వేల కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ప్రకటించింది. కానీ ఆ తరువాతి కాలంలో చంద్రబాబు మేనేజ్మెంట్  స్కిల్ వల్ల ఆ కేసు ముందుకు సాగలేదని అంటారు. అలాగే చంద్రబాబు పై గత ప్రభుత్వం పెట్టిన మద్యం ప్రివిలేజ్ ఫీజ్ రద్దు చేయడం ద్వారా  ప్రభుత్వానికి నష్టం వచ్చినట్లు అప్పట్లో స్పష్టమైన ఆధారాలతో తెలిపింది. 

జగన్ ప్రభుత్వ టైమ్‌లో పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతే  కేసులు పెడితే, చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం కక్షపూరితంగా ఏదో ఒక కేసు పెట్టి, తమకు విధేయులుగా పనిచేసే కొందరు అధికారుల ద్వారా అరెస్టుల పర్వం ఆరంభించిందన్నది వైఎస్సార్‌సీపీ విమర్శ. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చకపోవడంతో ప్రజలలో ఏర్పడిన తీవ్ర అసంతృప్తిని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి ట్రిక్కులను ప్రయోగిస్తున్నారు. అందువల్లే  ప్రస్తుత కూటమి ప్రభుత్వం పెడుతున్న కేసులు లొసుగుల మయంగా కనిపిస్తాయి. తాము చెప్పినట్లు వింటే సరి. లేకుంటే  అరెస్టు తప్పదని భయపెట్టి కొందరిని లొంగదీసుకుంటున్నారన్న భావన ఉంది. 

ఉదాహరణకు విజయసాయి రెడ్డి వైఎస్సార్‌సీపీ సభ్యత్వాన్ని, తన రాజ్యసభ పదవి వదలుకునేలా చేయడం. ఆ తర్వాత మద్యం కేసుకు సంబంధించి ఆయన నుంచి ఒక ప్రకటన తీసుకోవడం, దాని ఆధారంగా కేసు డీల్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. విజయసాయి రెడ్డిని కీలకమైన  నిందితులలో ఒకరిగా తొలుత ప్రచారం చేసినా, ఆ తర్వాత ఆయనను అరెస్టు చేయలేదు. తనపై కేసు ఉండదని అనుకున్నా, పూర్తిగా  కేసు పెట్టకపోతే, కథ సజావుగా సాగదని భావించారేమో తెలియదు కాని, ఆయనను కూడా నిందితుడిగానే చూపించారు. ప్రభుత్వ విధాన నిర్ణయంతో సంబంధం లేని వారిని, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలక అధికారులుగా ఉన్నవారిని కూడా వదలకుండా వారనుకున్న జాబితా ప్రకారం అరెస్టుల పర్వం సాగించారు. సిట్ అధికారులు రూ.3500 కోట్లు అని కాకి లెక్క తయారు చేశారు. దానికి అయినా ఆధారాలు  ఉన్నాయా అంటే అవి లేవు. 

అసలు డిస్టిలరీల నుంచి ముడుపులు తీసుకుంటే వారు కదా ఫిర్యాదు చేయవలసింది. వారెవరూ మాట్లాడకపోతే దారినపోయే దానయ్య ఎవరో కంప్లెయింట్ చేస్తే దానిని రెవెన్యూ సెక్రటరీ ముఖేష్‌ మీనా ఎంటర్‌టైన్‌ చేయడం ఏమిటి? ఆ వెంటనే బెవరేజన్ కార్పొరేషన్‌లో సమచారం సేకరించినట్లు, దర్యాప్తు చేయడానికి సిట్ వేసినట్లు.. ఇలా ఎంతో కథ నడిపించారు. చంద్రబాబు టైమ్‌లో ప్రైవేటు రంగంలో మద్యం వ్యాపారం జరిగితే జగన్ హయాంలో ప్రభుత్వమే షాపులను నిర్వహించింది. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. అదే సమయంలో మద్యం వినియోగం తగ్గింది. అయినా స్కామ్ జరిగిందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసును  జగన్ మెడకు చుట్టాలని విశ్వయత్నం చేస్తున్నారు. బిగ్ బాస్ అంటూ మురికి పత్రికలు విష ప్రచారం ఆరంభించాయి.  

1999-2004 మధ్య ఒక స్కామ్ లో బిగ్‌బాస్‌కు మూడు కోట్లు చెల్లించామంటూ రాసిన లేఖ కలకలం రేపింది. అప్పట్లో చంద్రబాబు సీఎంగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే అంతకుముందు 1985 ప్రాంతంలో చంద్రబాబుకు, ఒక సారాయి బాట్లింగ్ కంపెనీ యజమానికి ఉన్న సంబంధంపై ఆయన తొడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒక పుస్తకంలో  రాశారు. తెలంగాణలో ఎమ్మెల్సీ  ఎన్నికలలో ఓట్లు కొనుగోలు చేసేందుకు  చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన యత్నంలో దొరికిపోయిన సంగతి తెలిసిందే అని వైఎస్సార్‌సీపీ నేతలు గుర్తు చేస్తుంటారు. ఆ చార్జీషీట్‌లో చంద్రబాబు ప్రస్తావన ముప్పై సార్లకు పైగా ఉంది. అయినా ఆయనను నిందితుడిగా చేర్చలేదు. అప్పుడు చంద్రబాబు బిగ్ బాస్ అని మురికి మీడియా ఒప్పుకుంటుందా? అసలు ఎన్నికలను ఖరీదైన వ్యవహారంగా మార్చింది, 

ఓట్లకు ఎలా డబ్బు ఇవ్వవచ్చన్నది నేర్పింది చంద్రబాబు అని ఆయన ప్రత్యర్థులు ఏకగ్రీవంగా చెబుతుంటారు. ఈ నేపథ్యంలో మద్యం స్కామ్‌లో తేలేది ఏమీ ఉండదని, కాని కేసు పేరుతో వైసీపీ నేతలను, కొందరు రిటైర్డ్ అధికారులను వేధించి వికృతానందం పొందడం తప్ప అని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. స్థూలంగా చూస్తే ప్రజల దృష్టిలో   ఇదంతా ఒక రాజకీయ కక్ష కేసుగా మాత్రమే  నమోదు అవుతుంది. చంద్రబాబు, లోకేశ్‌లు ఇలాగే  రెడ్ బుక్ పాలన కొనసాగిస్తే, భవిష్యత్తులో వారితోసహా టీడీపీ నేతలు కూడా భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చన్నది ఎక్కువ మంది  అభిప్రాయంగా ఉంది.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement