
జగన్ మళ్లీ అధికారంలోకి ఎలా వస్తాడో చూస్తా అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్! రాజకీయాల్లో సవాళ్లు, ప్రతిసవాళ్లూ మామూలే కానీ.. పవన్ కల్యాణ్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్‌ల ఈ మాటల వెనుక ఏదో నిగూఢ అర్థం ఉన్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే.. 2024 నాటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి గెలిచిన తీరుపై ఇప్పటికీ చాలా సందేహాలు ఉన్నాయి.
టీడీపీ ఆర్భాటంగా ప్రకటించి అమలు చేయని సూపర్ సిక్స్ వాగ్ధానాల ప్రభావం కొంత ఉంటే ఉండవచ్చునేమో కానీ.. వైఎస్సార్‌సీపీకి అనూహ్యంగా తగ్గిన సీట్లు ఈవీఎంల మహిమ వల్లేనని సామాన్యులతోపాటు మేధావులూ బహిరంగంగానే ప్రకటించారు. కూటమి నేతల మాటలిప్పుడు ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నట్లుగా ఉన్నాయి.
ఏడాది కూటమి పాలనలో జరిగిన పరిణామాలు, కూటమి నేతల దాష్టీకాలు, పోలీసులను అడ్డంపెట్టుకుని తమను వేధిస్తున్న తీరుపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు చాలా ఆగ్రహంతో ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ కొన్నేళ్లు ఓపిక పడితే మళ్లీ అధికారం మనదే అని భరోసా కూడా ఇస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే జగన్‌కు రాష్ట్రం నలుమూలల్లోనూ ప్రజాదరణ వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఒకరకమైన పట్టుదలతో ఉంటే.. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు ఎక్కడ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తాడో అన్న భయం పట్టుకుంది.
మరోవైపు చంద్రబాబు నాయుడు ఈ మధ్యే ఒక సమావేశంలో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ మళ్లీ గెలిచే పరిస్థితిలోకి వచ్చిందన్న అర్థంతో మాట్లాడారు. అలాగే జగన్‌ను ఒక భూతంలా అభివర్ణిస్తూ అనుచిత వ్యాఖ్యలూ చేశారు. మంత్రి లోకేశ్ కూడా పలు సందర్భాల్లో జగన్ మళ్లీ వస్తే ఏమిటని పెట్టుబడిదారులు ప్రశ్నిస్తున్నారని.. చెబతూండటం ప్రస్తావనార్హం. ఈ వ్యాఖ్యలన్నింటి ద్వారా స్పష్టమయ్యే విషయం ఒక్కటే.. ఓటమి ఎదురుదెబ్బ నుంచి జగన్ బాగా పుంజుకున్నట్లే అని! ప్రజాదరణ బాగా పెరిగిందీ అని!
దీనికి కారణం ఏమిటో కూడా కూటమి నేతలకు బాగానే తెలుసు. ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయకుండా ప్రజలను మభ్య పెడుతూండటంతో ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. కూటమి నేతలు మాత్రం ఈ మాట చెప్పకుండా, జగన్ మళ్లీ అధికారంలోకి రాకుండా అప్రమత్తంగా ఉంటామని అంటున్రాను. తాజాగా పవన్ కల్యాణ్ కూడా సరిగ్గా ఆ దారిలోనే మార్కాపురం సభలో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ వారు మళ్లీ అధికారంలోకి ఎలా వస్తారో తామూ చూస్తామని అన్నారు. అధికారంలో ఉన్న వారు తాము తిరిగి అధికారంలోకి వచ్చేలా పాలన చేస్తున్నామని, మానిఫెస్టోలోని అంశాలను అమలు చేస్తున్నామని చెప్పగలగాలి. ఏడాది సమయంలో ఏమి సాధించారో చెప్పాలి. కాని ఈ ముగ్గురు నేతలు పెద్దగా వాటి జోలికి వెళ్లడం లేదు. పవన్ కూడా జగన్ టైమ్ లో అభివృద్ది జరగలేదని విమర్శించారు. పవన్‌కు నిజంగా అభివృద్దిపై శ్రద్ద ఉంటే మార్కాపురంలో జగన్ హయాంలో చేపట్టిన వైద్యకళాశాల భవనాలను చూసి ఉండాల్సింది.
కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ భవనాల నిర్మాణం ఎందుకు ఆగిందో చెప్పి ఉండాలి.అంతేకాదు. వెలిగొండ ప్రాజెక్టును ఏడాది కాలంగా ఎందుకు పూర్తి చేయలేదు? నిర్వాసితులకు ఎందుకు పరిహారం ఇవ్వలేదు? వీటిపై మాట్లాడకుండా, వైఎస్సార్‌సీపీ వారు అనని మాటలను వారికి అంటకట్టి సినిమా డైలాగులు చెబితే ప్రజలకు ఏమి ప్రయోజనం? పవన్ తరచు సినిమా షూటింగ్‌లలో పాల్గొంటున్నారట. కొత్త సినిమా ప్రచారం గురించి అప్పడప్పుడు కొన్ని సభలు పెట్టుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కుత్తుకలు కోస్తామని, గూండాగిరి చేస్తామని వైఎస్సార్‌సీపీ నేతలు బెదిరిస్తున్నారని, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని పవన్ చెబుతున్నారు. అబద్దాలు చెప్పడంలో టీడీపీ రికార్డును దాటిపోవాలని పవన్ అనుకుంటే ఎవరం ఏమీ చేయలేం. ఈ ఏడాదిలో కూటమికి చెందిన వారు ఎన్ని దాడులు చేశారు? వైఎస్సార్‌సీపీ వారు ఎంతమంది హత్యలు, దాడులకు గురయ్యారు? తప్పుడు కేసులలో పెట్టి ఎందరిని అరెస్టు చేశారు? అన్నవి పవన్ కు తెలియదా!
అయినా.. అధికారంలో ఉన్నప్పుడు అంతా హాపీ అనుకుంటూ పవన్ అనుకోవచ్చు. రాజకీయ విమర్శల వరకు ఓకే. కాని వైఎస్సార్‌సీపీ వారు అధికారంలోకి ఎలా వస్తారో చూస్తామని అనడంలోనే అనుమానం కలుగుతుంది. బహుశా గత ఎన్నికలలో మాదిరిగానే వచ్చే ఎన్నికల్లోనూ ఈవీఎంలు తమని గట్టెక్కిస్తాయన్న ధీమానా? ఒక రకంగా ఇది పవన్ కల్యాణ్ బెదిరింపుగానే చూడాలి. రఫ్పా, రఫ్పా అనే డైలాగుకు వక్రభాష్యం చెబుతున్న పవన్ కల్యాణ్ తాను విపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా దౌర్జన్య పూరితంగా మాట్లాడింది.. అభ్యంతరకరంగా మాట్లాడింది గుర్తు లేకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో 30 వేల మంది మహిళలు కిడ్నాప్ అయ్యారని పవన్ చేసిన ఆరోపణపై ఇంతవరకు ఎందుకు నోరు విప్పడం లేదు? ఈ సంవత్సరంలో మహిళలపై జరిగిన అత్యాచారాల ఘటనలపై పవన్ ఎన్నడైనా స్పందించారా? ఏమీ చేయక పోయినా, ప్రభుత్వం ఎంత అరాచకంగా ఉన్నా గెలవగలమని వారు భావిస్తున్నారంటే ఈవీఎంల మానిప్యులేషన్ తమ చేతిలో ఉందన్న అభిప్రాయమే కారణమా?.
కొద్ది రోజుల క్రితం వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నేతలు వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లు ఈవీఎంల అక్రమాలు, ఓట్ల పోలింగ్‌లో జరిగిన అవకతవకలను ఆధార సహితంగా ఎన్నికల కమిషన్‌కు వివరించి వచ్చారు. వారి లెక్కల ప్రకారం పోలింగ్ శాతంలో తేడా వల్ల 87 శాసనసభ నియోజకవర్గాలలో గెలుపు, ఓటములను నిర్దేశితమయ్యాయి. పోలింగ్ ముగిసే టైమ్ కు ఉన్న ఓట్ల శాతం, తదుపరి నమోదైన ఓట్ల శాతానికి ఉన్న తేడా ఏకంగా 12.54 శాతం ఉన్న సంగతిని వారు తెలియ చేశారు. హిందుపూర్, రాయచోటి వంటి నియోజకవర్గాలలో ఓటింగ్ సరళి వ్యత్యాసాలను వివరించారు. అనూహ్యమైన రీతిలో ఓటర్ల సంఖ్య పెరిగింది. ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్ మార్పులు, ఎన్నికల అధికారులు వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించకుండా దాటవేసి, దగ్దం చేసిన తీరు మొదలైనవి చూసిన వారందరికి ఏదో మోసం జరిగి ఉంటుందన్న భావన ఏర్పడింది.
ఎక్స్ అధిపతి ఎలన్ మస్క వంటి వారు కూడా ఈవీఎంలను టాంపర్ చేయవచ్చని చెప్పడం కూడా గమనించాలి. ఎవరో ఎందుకు. టీడీపీ ఓటమి పాలైన ప్రతి సందర్భంలోను చంద్రబాబు నాయుడు ఈవీఎంలను తప్పుపట్టారు. వాటి ద్వారా మోసం చేయవచ్చని గతంలో ఆయన స్వయంగా ప్రదర్శనలు చేయించారు.ఇప్పుడు ఆయన మాట్లాడకపోతుండవచ్చు. అది వేరే సంగతి.ఒంగోలు లో వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కించాలని అప్పట్లో వైఎస్సార్‌సీపీలో ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లు చేసిన ప్రయత్నాలను ఎన్నికల సంఘం, అధికారులు అంగీకరించకుండా డ్రామా నడపడం, వీవీప్యాట్ స్లిప్ లను పది, పదిహేను రోజుల్లోనే దగ్దం చేయడం వంటివి పలు సందేహాలకు అవకాశం ఇచ్చాయి. కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు కూడా ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నించాయి. సీపీఎం నేత వి.శ్రీనివాసరావు కూడా ఏపీలో 40 శాతం ఓట్లు వచ్చిన పార్టీకి 11 సీట్లు మాత్రమే రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, లోకేశ్‌లతో పాటు, తాజాగా పవన్ కల్యాణ్ వైఎస్సార్‌సీపీ ఎలా గెలుస్తుందో తామూ చూస్తామంటూ చేసిన ప్రకటనలపై కూడా సందేహాలు కలుగుతాయి.
ఈవీఓంల మహిమను తక్కువ అంచనా వేయడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. అందుకే బాలెట్ పత్రాలనే వాడాలని వైఎస్సార్‌సీపీతో సహా పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకు ఎన్నికల సంఘం అంగీకరించకపోతే ప్రజలలో ఈవీఎంలపై అనుమానాలు మరింతగా బలపడతాయి. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.