
సాక్షి, విజయవాడ: న్యూఆర్‌ఆర్ పేటలో డయేరియా అదుపులోకి రాలేదు. మెడికల్ క్యాంప్‌లకు బాధితులు క్యూ కడుతున్నారు. మెడికల్ క్యాంప్ వద్ద అధికారులు ఆంక్షలు విధించారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 141 మంది డయేరియా బారిన పడినట్లు ప్రభుత్వం ప్రకటించగా.. ప్రస్తుతం 68 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రంగు మారిన నీరు తాగడం వల్లే అనారోగ్యం బారిన పడ్డామంటున్న బాధితులు చెబుతుండగా.. మంచినీటిలో ఎలాంటి సమస్య లేదని ప్రభుత్వం అంటోంది. డయేరియాతో ఇద్దరు చనిపోయారని బాధిత కుటుంబాలు చెబుతుండగా.. డయేరియా మరణాలను చంద్రబాబు సర్కార్ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది.
బుడమేరుకు, డయేరియాకు సంబంధమేంటి? అంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. మెడికల్ క్యాంప్‌లో కాలం చెల్లిన మందులు ఎలా ఇచ్చారు? రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అంటూ ఆయన మండిపడ్డారు. మెడికల్ క్యాంప్‌ను విజిట్ చేసి బాధితులను పరామర్శించాం. మంత్రులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. వినాయక చవితి భోజనాలు తిని డయేరియా వచ్చిందని ఒకరంటారు. బుడమేరు కారణంగా భూ గర్భజలాలు కలుషితమయ్యాయని ఒకరంటారు. విజయవాడ నగరం ఎప్పుడు ఏర్పడింది?. ఇక్కడ పైప్ లైన్ వ్యవస్థ ఎప్పుడు ఏర్పడింది?. మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడి చేతులు దులిపేసుకోవడం బాధాకరం’’ అని అప్పలరాజు పేర్కొన్నారు.
‘‘గత ఐదేళ్లలో ఇలాంటి సంఘటనలు ఒక్కటైనా చూశామా?. వైఎస్ జగన్ సమయానికి అన్ని శాఖలతో సమీక్షలు నిర్వహించి ముందస్తు చర్యలు తీసుకునేవారు. వర్షాకాలం ప్రారంభం ముందు చంద్రబాబు ఏనాడైనా రివ్యూ చేశాడా?. గతేడాది బుడమేరుకు వరదొస్తే చంద్రబాబు ఏం చేశారు?. వరదలు వస్తాయని వాతావరణశాఖ చెబుతుంటే చంద్రబాబు పెన్షన్ల పంపిణీకి వెళ్లాడు. పెన్షన్ పంపిణీ అంతా ఒక సినిమా షూటింగ్. ఇదే నియోజకవర్గంలో వైఎస్ జగన్ నాలుగు యూపీహెచ్‌సీలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటో వెళ్లి చూడండి. చంద్రబాబు ప్రెస్ మీట్లు పెట్టి జనానికి అర్ధం కాని భాష మాట్లాడుతుంటారు’’ అంటూ అప్పలరాజు ఎద్దేవా చేశారు.
..క్యాంటమ్ కంప్యూటర్ అంటాడు. క్యాంటమ్ కంప్యూటర్ తో డయేరియా తగ్గించు. మాట్లాడితే ఏఐ టెక్నాలజీ అంటాడు. రండి ఏఐ టెక్నాలజీతో డయేరియాని కంట్రోల్ చేయండి. ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా?. యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడం చేతకాని ముఖ్యమంత్రి మనకు అవసరమా?. నేపాల్ లో చిక్కుకున్న వారిని తీసుకొచ్చేశామని నిన్న ఓ మంత్రి షో చేశాడు. ఆర్టీజీఎస్‌లో కూర్చున్నామని ఊదరగొట్టాడు. ఇక్కడ డయేరియా బాధితుల మాటేమిటి?. చంద్రబాబుకు ప్రజల ఆస్తులను అమ్మడంలో ఉన్న శ్రద్ధ.. ప్రజల సేఫ్టీపై లేదు. మున్సిపల్ మంత్రికి అమరావతిలో భూములు అమ్మడం పైనే దృష్టి. వైద్య ఆరోగ్య శాఖా మంత్రి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు.
..వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రైవేట్ పరం చేయడంపైన ఉన్న శ్రద్ధ ప్రజల పై లేదు. వైద్యాన్ని ప్రైవేట్ పరం చేస్తే ప్రజలు ఏమైపోవాలి?. వైద్య ఆరోగ్య శాఖ ప్రక్షాళన కావాలి. గతేడాది గుర్ల గ్రామంలో డయేరియాతో 13 మంది చనిపోయారు. అయినా ఈ ప్రభుత్వంలో చలనం రాలేదు. మెడికల్ క్యాంపులో కాలం చెల్లిన మందులు ఎలా ఇస్తారు?. ఇదేనా ప్రజల ఆరోగ్యం పట్ల మీకున్న శ్రద్ధ. స్థానిక ఎమ్మెల్యేకు కలెక్షన్స్ మీద ఉన్న శ్రద్ధ స్థానిక సమస్య పట్ల లేదు. ఇప్పటికే ఇద్దరు చనిపోయారని బాధితులు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం మరణాలను దాచేస్తోంది. తక్షణమే న్యూ ఆర్.ఆర్.పేటను కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించాలి. ఇంటింటికీ ఒక వాటర్ టిన్ సప్లై చేయాలి’’ అని అప్పలరాజు డిమాండ్ చేశారు.