
సాక్షి, విజయవాడ: న్యూ రాజరాజేశ్వరిపేటలో వైఎస్సార్‌సీపీ నిజ నిర్థారణ కమిటీ ఆదివారం ఉదయం పర్యటించింది. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన వైఎస్సార్‌సీపీ నేతలు.. బాధితులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ పర్యటనలో మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్‌రావు, సత్తెనపల్లి ఇంచార్జ్ డాక్టర్ సుధీర్ భార్గవ్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు అవుతు శైలజా రెడ్డి, బెల్లం దుర్గ, వైఎస్సార్‌సీపీ నేతలు పోతిన మహేష్, షేక్ ఆసిఫ్ ఉన్నారు

బాధితుల ఇళ్లకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమను సరిగా పట్టించుకోలేదని వైఎస్సార్‌సీపీ నేతల వద్ద డయేరియా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ క్యాంప్‌ల వద్ద సరైన వైద్యం అందడం లేదని.. ఆర్ఎంపీలు వద్ద వైద్యం చేయించుకున్నామని తెలిపారు. తమకు వైద్యం చేసిన ఆర్ఎంపీ వైద్యులపై కేసులు పెడతామని బెదిరించారంటూ బాధితులు తెలిపారు. రంగు మారిన నీటిని తాగుతున్నామంటూ బాధితులు.. వైఎస్సార్‌సీపీ నేతలకు వాటర్ బాటిల్స్ చూపించారు.
మొండితోక జగన్మోహన్‌రావు మాట్లాడుతూ.. గతేడాది ఇదే రోజుల్లో డయేరియా ప్రబలిన మాట వాస్తవమా కాదా?. గత ప్రభుత్వంలో మేం అందరికీ సురక్షిత మైన నీరును అందించాం. ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించాం. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది. విజయవాడ వంటి నగరంలోనే పరిస్థితి ఇంత దారుణమా?. ఇంత వ్యవస్థ పెట్టుకుని ప్రభుత్వం ఏం చేస్తోంది?. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేశారు. ప్రజారోగ్యం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి ఇదొక ఉదాహరణ. ఇక్కడ డయేరియా వస్తే బాధితులు తమ సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు.
మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఐదు రోజుల నుంచి ప్రజలు డయేరియాతో బాధపడుతున్నారు. మా నాయకుడు వైఎస్ జగన్ ఆదేశాలతో మేం న్యూ ఆర్.ఆర్ పేటలో పర్యటించాం. ఈ చెవిటి, గుడ్డి ప్రభుత్వానికి వాస్తవాలు చెప్పేందుకే మేం వచ్చాం. ఐదు రోజులైనా ప్రభుత్వం కారణాలను బయటపెట్టడం లేదు.
ఈ ప్రభుత్వంపైన నమ్మకం లేకే బాధితులు ప్రైవేట్ ఆసుపత్రికి వెళుతున్నారు. ఎందుకు ఈ ప్రభుత్వం అచేతనంగా ఉండిపోయింది? ఎందుకు డోర్ టు డోర్ సర్వే చేయలేకపోయారు. మీరు డోర్ టు డోర్ సర్వే చేయలేకపోయారు కాబట్టి ఈ ఉదయం ఓమహిళ చనిపోయింది. కొద్ది రోజుల్లో దసరా మహోత్సవాలు వస్తున్నాయి. 20 వేల మంది ఉన్న ప్రాంతంలోనే డయేరియాను అదుపు చేయలేకపోయారు.
దసరా ఉత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఇంకేం సౌకర్యాలు కల్పిస్తారు. ఆరోగ్యశాఖ మంత్రి ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కావడం లేదు. బుడమేరు వల్ల భూగర్భ జలాలు కలుషితమయ్యాయని మంత్రి చెప్పడం సిగ్గుచేటు. మరణాలను కప్పిపెట్టే ప్రయత్నం చేయడం సరికాదు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించాలి. అధికారులు గోబెల్స్ ప్రచారం చేయడం సరికాదు. వినాయకుడి భోజనాలు తినడం వల్ల డయేరియా వచ్చిందంటున్నారు. ఖాళీ వాటర్ టిన్లు ఇస్తే మంచినీళ్లు ఎవరిస్తారు?.
మెడికల్ క్యాంప్‌లో బాధితులను పరామర్శించడానికి వస్తే పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు. అరెస్టులు చేస్తామని బెదిరిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి రేపు సాయంత్రం వరకూ డెడ్ లైన్ పెడుతున్నాం. రేపు సాయంత్రానికల్లా డయేరియా కారణాలను వెల్లడించాలి. ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళతాం. బాధ్యత లేకుండా వ్యవహరించిన మంత్రులను బర్తరఫ్ చేయాలి

