
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు డబ్బులకు కక్కుర్తి పడి నకిలీ మద్యం తయారు చేసి.. బెల్ట్ షాపుల్లో అమ్మకాలు జరుపుతున్నారంటూ ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నకిలీ మద్యం చిత్తూరు నుంచి విజయవాడ లింక్‌లు పెరిగిపోయాయి.. ఇప్పుడు అవే బట్టబయలయ్యాయి.
‘‘ఎన్నికలకు ముందు 99 రూపాయలు మద్యం అమ్ముతామంటే ఎదో అనుకున్నాం.. ఇలా నకిలీ మద్యం తయారు చేసి అమ్మకాలు చేస్తారు అనుకోలేదు. ఇబ్రహిపట్నంలో ఇప్పుడు నకిలీ మద్యం దొరికింది. టీడీపీకి చెందిన జనార్ధనరావు అనే వ్యక్తికి ఇబ్రహీంపట్నంలో వైన్ షాపు ఉంది. ఇక్కడ నుండే అన్ని బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. నకిలీ మద్యానికి కేరాఫ్ అడ్రస్ టీడీపీ. ఎంపీ మిథున్ రెడ్డి, ధనుంజయ్‌రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారు.. మరి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?. టీడీపీ నాయకుడు జనార్ధన్ రావు వెనుక ఎవరు ఉన్నారో వారి పై చర్యలు తీసుకోవాలి’’ అని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు.