
కేజీహెచ్(విశాఖ): పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గురుకుల బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థులు పచ్చ కామెర్ల బారిన పడితే ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టింకోరా? అని నిలదీశారు వైఎస్సార్‌సీపీ నేత సీదిరి అప్పలరాజు. ఇందులో ఇద్దురు విద్యార్థినులు చనిపోయినా చంద్రబాబు గానీ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం కానీ కనీసం పట్టించుకోలేదన్నారు.
ఈరోజు(బుధవారం, అక్టోబర్ 8వ తేదీ) విద్యార్థులను పరామర్శించడానికి విశాఖ కేజీహెచ్‌కు వెళ్లిన సీదిరి అప్పలరాజు.. మీడియాతో మాట్లాడారు. ‘ గిరిజన విద్యార్థులు చనిపోతే సీఎం చంద్రబాబు పట్టించుకోరా?,గిరిజన విద్యార్థుల ఆరోగ్యం ప్రభుత్వానికి పట్టదా?, పవన్‌కు జలుబు చేస్తే సీఎం చంద్రబాబు పరామర్శిస్తారు. గిరిజన విద్యార్థుల మరణాలు.. ప్రభుత్వ హత్యలే. గతంలె నాడు-నేడు ద్వారా విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలు కల్పించాం’ అని సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు.
కాగా, పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గురుకుల బాలికల పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థినులు పచ్చకామెర్ల బారిన పడిన విషయం తెలిసిందే. వీరిలో తొమ్మిదో తరగతి విద్యార్థిని తోయిక కల్పన, 10వ తరగతికి చెందిన పువ్వల అంజలి పచ్చకామెర్లతో మృత్యువాత పడ్డారు. మంగళవారం మరో ఏడుగురు విద్యార్థినులు ఆస్పత్రిలో చేరడంతో.. ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 50కి చేరుకుంది. ప్రాథమిక చికిత్స కోసం కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో 15 మంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. కేజీహెచ్ ఆస్పత్రి నుంచి రికవరీ అయిన కొంతమందిని డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. పాఠశాలలో మంచి నీటి వసతులు, మరుగుదొడ్లు, మరియు పోషకాహారం సరిగా లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
