
సాక్షి, తాడేపల్లి: డ్వాక్రా మహిళల పొదుపు నిధులపై కూడా చంద్రబాబు సర్కార్ కన్నేయడం దారుణమని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ ఉచితంగా కళ్యాణమస్తు, షాదీ తోఫా కింద ఇచ్చిన లబ్ధిని నేడు కూటమి ప్రభుత్వం వడ్డీతో కూడిన రుణంగా ఇస్తామనడం దుర్మార్గం కాదా అంటూ మండిపడ్డారు.
మహిళల పొదుపు సొమ్మును పథకాల పేరుతో మళ్ళించి, తమ ఘనతగా ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. ఒక వైపు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకుండా, వడ్డీతో కూడిన విద్యాలక్ష్మి రుణాలను ఇస్తామనడం ఈ ప్రభుత్వ దివాలాకోరుతనానికి నిదర్శనమని అన్నారు. వీటిని పథకాలు అని చెప్పుకోవడానికి సీఎం చంద్రబాబు సిగ్గపడాలని, ఇవి మహిళలకు చేస్తున్న ఢోకా కాదా అని నిలదీశారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..
డ్వాక్రా మహిళలు తాము పొదుపు చేసుకున్న సొమ్మును 'స్త్రీనిధి' సంస్థ ద్వారా దాచుకుంటారు. ఈ స్త్రీనిధి సంస్థ కూడా ఇతర బ్యాంకుల నుంచి ఏడు శాతం కింద డబ్బును వడ్డీకి తీసుకువచ్చి, వాటిని డ్వాక్రా సంఘాలకు రుణంగా ఇస్తుంది. ఇలా డ్వాక్రా సంఘాలకు ఆర్థిక చేయూతను అందించేందుకు, వాటి ఆర్థిక అవసరాలను స్త్రీనిధి సంస్థ సమకూరుస్తుంటుంది. మహిళల పొదుపుసొమ్ము కూడా ఈ స్త్రీనిధి లోనే జమ అవుతూ ఉంటుంది. ఇటువంటి సంస్థ నుంచి కూటమి ప్రభుత్వం త్వరలో అమలు చేస్తామని చెబుతున్న ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాల పేరుతో ఏకంగా రూ.1000 కోట్లు సేకరిస్తోంది.
ఈ సేకరించిన డబ్బును కూడా ఆయా పథకాల లబ్ధిదారులకు నాలుగు శాతం వడ్డీతో కూడిన రుణాలుగా ఇస్తామని చెబుతోంది. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం షాదీ తోఫా, కళ్యాణమస్తు పథకాల కోసం అయిదేళ్ల కాలంలో రూ.427 కోట్లు ఖర్చు చేసింది. ఈ సొమ్మును కూడా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయడం ద్వారా వారికి అండగా నిలిచింది. నేడు చంద్రబాబు ఈ పథకాలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని వడ్డీతో కూడిన రుణంగా మార్చేయడం అత్యంత దుర్మార్గం.
ఇదేనా మహిళలకు ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి? పైగా డ్వాక్రా పొదుపు నిధులతో ఆర్థికంగా పరిపుష్టం అయిన స్త్రీనిధి నుంచి సొమ్మును తీసుకోవడం వల్ల రానున్న రోజుల్లో ఆ సంస్థ పరిస్థితి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. చివరికి స్త్రీనిధి మనుగడే ప్రశ్నార్థకం కూడా అవుతుంది. మహిళలకు మంచి చేయాల్సింది పోయి, వారి పొదుపు సొమ్మును కూడా గల్లంతు చేసే పనిలో చంద్రబాబు సర్కార్ తలమునకలు అవుతోంది.
గత ప్రభుత్వంలో సున్నా వడ్డీ కింద రూ.4969 కోట్లు లబ్ధి
2014-19 మధ్య అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు రూ.25,571 కోట్లు రుణమాఫీ చేస్తానని చెప్పి, దారుణంగా మోసం చేసింది. వైఎస్ జగన్ అధికారం లోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో 3,86,82,882 మంది డ్వాక్రా గ్రూప్ లబ్ధిదారులకు దాదాపు రూ.4,969 కోట్లు సున్నావడ్డీ పథకం కింద లబ్ధి చేకూర్చారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో సున్నావడ్డీ కింద వేయాల్సిన సొమ్మును జమ చేసేందుకు సిద్ధమైనా, ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయింది. ఎన్నికలు అయిపోయిన తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ మొత్తాన్ని డ్వాక్రా గ్రూపులకు జమ చేయాల్సి ఉన్నా, నేటికీ దానిని పట్టించుకున్న పాపాన పోలేదు.
ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో చేయూత, ఆసరా, భరోసా, తోడు ఇలా అనేక పథకాలను మహిళల కోసం అమలు చేశారు. రేషన్ కార్డుల్లోనూ ఇంటి యజమానిగా మహిళల పేరు, పేదలకు ఇచ్చిన ఇళ్ళస్థలాలు కూడా మహిళల పేరు మీదే ఇచ్చారు. నేడు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు మహిళలను నమ్మించి మోసం చేస్తున్నారు. సున్నావడ్డీ, కళ్యాణమస్తు వంటి పథకాలను ఎగ్గొట్టారు.
గత ఎన్నికలకు ముందు కూడా సూపర్ సిక్స్ పేరుతో ఆకర్షణీయమైన పథకాలను ప్రకటించి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చారు. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే, అంతమందికీ రూ.18వేలు చొప్పున స్త్రీ నిధి కింద ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇంత వరకు ఈ పథకాన్ని అమలు చేయలేదు. 19-59 ఏళ్ళ వయస్సు ఉన్న మహిళలకు ప్రతినెలా రూ.1500 చొప్పున ఇస్తామని చెప్పారు. దీని ఊసే లేదు.