
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో అవినీతి రాజ్యం ఏలుతుందని.. దేశంలోనే అవినీతి చక్రవర్తి చంద్రబాబు అంటూ వైఎస్సార్ కడప జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లక్షల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు ఉన్న ఏకైక సీఎం చంద్రబాబు అని.. బ్రిటిష్ పాలన కంటే దారుణమైన పాలన రాష్ట్రంలో సాగుతుందంటూ దుయ్యబట్టారు. ప్రజలకు మేలు జరగాలన్న ఆలోచనతో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతి జిల్లాల్లో మెడికల్ కాలేజీలు నిర్మించారని.. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని గొప్ప ఆలోచన చేశారని రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు.
‘‘మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం దారుణం. రాబోయే రోజుల్లో వైఎస్సార్‌సీపీ తరపున పోరాడతాం. ప్రజల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం. పేద ప్రజలకు మంచి చేసేందుకు ఎప్పుడూ ముందుంటాం.. ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద విద్యార్థులు మెడికల్ విద్య చదివేందుకు వీలు ఉండదు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశామంటూ విజయోత్సవ సభ పెట్టడం సిగ్గు చేటు. ప్రజలను మభ్య పెట్టడం చంద్రబాబు మానుకోవాలి’’ అని రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు.
