
సాక్షి, వైఎస్సార్: కడపలో టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు తిరుగుబావుట ఎగురవేశారు. మాధవీ రెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డి ఒంటెద్దు పోకడలు పోతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, ఆయన భర్త శ్రీనివాసులు రెడ్డి వ్యవహారంపై స్థానిక టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీనియర్లు లేరు.. తొక్కా లేదన్న శ్రీనివాసులు రెడ్డి వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ముస్లిం మైనార్టీ నేతలు, కార్యకర్తలు తిరుగుబాటు ఎగురవేశారు. పార్టీకి మొదటి నుంచీ సేవలందించిన వారిని పక్కన పెట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడపలోని పలువురు మైనార్టీ టీడీపీ నేతలు పెద దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాధవీ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలంటూ ప్రార్ధనలు చేశారు. క్రమంలో తిరుగుబాటు వర్గాన్ని కమలాపురం నేత పుత్తా నరసింహారెడ్డి దగ్గరకు తీసుకున్నారు. పార్టీని కాపాడాలంటూ పుత్తా వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
అధికారం వచ్చి ఏడాదిన్నర అయినా పార్టీ సీనియర్లను పట్టించుకోలేదని ఆరోపించారు. దీనికి తోడు అంతా తమ కుటుంబ పెత్తనమేనంటూ బహిరంగ వ్యాఖ్యలు చేయడంపై నిరసన తెలిపారు. ఇంత వరకూ ఒక్క మైనార్టీ నేతకు కూడా నామినేటెడ్ పదవులు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి కడపకు రాక ముందు నుంచీ పార్టీ తరఫున కష్టాలకోర్చి ముందుకు తీసుకెళ్లామని సీనియర్ నాయకులు అన్నారు.

మరోవైపు.. కడపలో టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డి తీరుతో రోజుకో వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీడీపీ శ్రేణులు మాధవీ రెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డి వ్యవహారంపై పచ్చ పార్టీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీలో రోజుకో వర్గం తిరుగుబావుటా ఎగురవేయడంతో ఎమ్మెల్యేపై వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో, టీడీపీలో మరో వర్గం ఏర్పడినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.