
సాక్షి, వైఎస్సార్: ఉల్లి ధర దారుణంగా పడిపోతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వెంటనే ఉల్లిరైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, హైదరాబాద్‌లో ఉండే పవన్ కల్యాణ్‌కు ఏపీలో రోడ్ల గురించి ఏం తెలుస్తుంది? అని ఎద్దేవా చేశారు.
ఉల్లి రైతుల కష్టాలపై వైఎస్సార్‌సీపీ నేతలు కడప కలెక్టర్‌ను కలిశారు. ఉల్లికి మద్దతు ధర కల్పించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కలెక్టర్‌ను కోరారు. అనంతరం, ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఉల్లి రైతుల దీన పరిస్థితి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లా కలెక్టర్‌ను కలిశాం. జిల్లాలో ఉల్లి పంటను పరిశీలించాం. ఉల్లి పంట కొనుగోలు కేంద్రాలు మైదుకూరు, కమలాపురంలో ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఉల్లి కొనుగోలు కేంద్రాల్లో ఉల్లి పంటను కొనుగోలు చేయడం లేదు. పంటను అమ్ముకునే పరిస్థితి లేక రైతులు నీటిలో వదిలేస్తున్నారు. ఇప్పటికైనా కనీస మద్ధతు ధరతో కొనుగోలు చేయాలి. కర్నూల్ జిల్లాలో హెక్టార్‌కు 50వేలతో కొనుగోలు చేస్తున్నారు. అలాగే, కడప జిల్లాలో అమలు చేయాలి. ప్రభుత్వం వెంటనే ఉల్లి రైతులను ఆదుకోవాలి.
వైఎస్సార్‌సీపీ నాయకులను ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారు. పులివెందులలో ఒక ఘర్షణలో సంబంధం లేని వ్యక్తులపై అక్రమ కేసులు పెట్టారు. మా పార్టీ నాయకులను వేధించి మనస్థైర్యం దెబ్బతీసేందుకు అక్రమ కేసులు పెడుతున్నారు. నిన్న వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా అడుగడుగునా ఆంక్షలు పెట్టారు. పవన్ కళ్యాణ్‌కు ఏపీలో రోడ్ల పరిస్థితి ఎలా తెలుస్తుంది?. ఆయన హైదరాబాద్‌లో ఉంటారు.. అక్కడి రోడ్ల గురించి తెలుస్తుంది. హైదరాబాద్‌లో రోడ్లు చూసి ఏపీలో రోడ్లు ఇలా ఉంటాయి అనుకున్నాడేమో?. ఆరోగ్యశ్రీ పెండింగ్ నిధులు ఇవ్వకపోవడం వల్ల నెట్ వర్క్ హాస్పిటల్‌లో వైద్యం లేదు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటోంది. కల్తీ మద్యంపై ఆరు నెలల క్రితమే టీడీపీ కార్యకర్త సోషల్ మీడియాలో చెప్పారు.
ప్రభుత్వం మద్దతు ధర రూ.1200 ప్రకటించిన ప్రస్తుతం రూ.500కు ధర పడిపోయింది. జిల్లాలో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పేరుకు మద్దతు ధర ప్రకటించినా అది అమలు కావడం లేదు. దళారులు రైతులను దోచుకుంటున్నారు. గత ప్రభుత్వంలో రూ.5వేలు ధర మేము ఇప్పించాం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉల్లి రైతులను ఆదుకోవాలి. వెంటనే మద్దతు ధర అందేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ..‘దుర్మార్గమైన ప్రభుత్వం ఏపీలో నడుస్తుంది. రైతుల గోడు పట్టించుకోవడం లేదు. కలెక్టర్ కార్యాలయంలో కనీసం అధికారులు అందుబాటులో ఉండటం లేదు. పంట నష్టం లేదు, ఇన్సూరెన్స్ లేదు. మద్దతు ధరతో ఒక్క కేజీ ఉల్లి కొనలేదు. ఉల్లి పంట ఎకరాకు లక్ష పెట్టుబడి అవుతోంది. మద్దతు ధర చెప్పడం తప్ప అమలులో లేదు. మద్ధతు ధరపై జీవో కూడా లేదు. ఇంకో రెండు నెలల పాటు ఉల్లి పంట దిగుబడి ఉంటుంది. రైతులు ఆత్మహత్య చేసుకొనే పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వంలో రైతులను ఆదుకున్నాం.. పంట నష్టం జరిగిన 21 రోజుల్లో నష్టపరిహారం అందించాం’ అని అన్నారు.