సాక్షి, వైఎస్సార్ జిల్లా: బెంగుళూరు-హైదరాబాద్ జాతీయరహదారిపై జరిగిన బస్సు దహనం ఘటన ప్రమాదం కాదని ఇది ముమ్మూటికీ ప్రభుత్వ హత్యలేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రొద్దుటూరులోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇరవై నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని.. ఈ ఘటనలో సీఎం చంద్రబాబే ప్రథమ ముద్దాయని రాచమల్లు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో విచ్చలవిడిగా ఏరులై పారుతున్న మద్యమే.. ఈ ప్రమాదానికి కారణమని ఆయన తేల్చి చెప్పారు. ప్రమాదం జరగడాని కంటే ముందు జాతీయ రహదారి సమీపంలోని బెల్టుషాపులో మద్యం కొనుగోలు చేసిన బైకిస్టే.. మద్యం మత్తులో ఇంత పెద్ద ప్రమాదానికి కారణమయ్యారని వెల్లడించారు. దీనికి ప్రభుత్వం, అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆదాయమే లక్ష్యంగా రాష్ట్రంలో ఏటీఎం(ఎనీ టైం మందు) తరహాలో మద్యం అమ్మకాలు చేస్తూ ప్రభుత్వమే ప్రజల ప్రాణాలను హరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే..
బెంగుళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై బస్సు దహనం ఘటన దురదృష్టవశాత్తూ జరిగిన ప్రమాదం కాదు.. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం, స్వార్థంతో జరిగిన హత్యలివి. ఈ హత్యల్లో మొదటి ముద్దాయి ముఖ్యమంత్రి చంద్రబాబే అయితే, ఎక్సైజ్ శాఖ మంత్రి రెండో ముద్దాయి, జాతీయ రహదారిపై మద్యం అమ్ముతున్న బెల్టుషాపు నిర్వాహకుడు మూడో ముద్దాయి కాగా.. బెల్టుషాపు లేకుండా చేయాల్సిన ఎక్సైజ్ అధికారి నాలుగో ముద్దాయి కాగా ఐదో ముద్దాయి రవాణాశాఖ అధికారులు, ఆరో ముద్దాయి బస్సు ఓనరు, ఏడో ముద్దాయి డ్రైవరు, ఎనిమిదో ముద్దాయి బైక్ డ్రైవర్ వీరందరూ కలిసి వీరి ఉసురు పోసుకున్నారు. జాతీయ రహదారిమీద తిరగడానికి కావాల్సిన ఫిట్ నెస్ సహా ఏ అనుమతలూ లేకుండానే ఆ బస్సు తిరుగుతోంది. అధికారుల ఉదాసీనతకు నిదర్శనం ఇది.
ఆదాయమే లక్ష్యంగా ఏటీఎం- ఎనీటైం మందు..
రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. ఇదే విషయాన్ని మేం ప్రతిరోజూ నెత్తీనోరూ మొత్తుకుని చెబుతున్నా పట్టించుకున్నపాపాన పోలేదు. రాష్ట్రంలో ఇప్పుడు రోజులో ఇరవై నాలుగు గంటలూ, వారానికి ఏడు రోజులూ ఎనీ టైమ్ మందు( ఏటీమ్) అందుబాటులో ఉంటుంది. బడి, గుడి, వీధి సందు, జాతీయ రహదారి, గ్రామీణ రోడ్లు అక్కడా ఇక్కడా అని లేదు.. కూటమి పాలనలో ఇప్పుడు ఎక్కడైనా మద్యం అందుబాటులో ఉంటుంది. తాగొచ్చు, తాగి ప్రమాదాలు చేసి మనుషులను చంపొచ్చు.. ఏం జరిగినా ప్రభుత్వానికి మాత్రం ఆదాయమే ముఖ్యం. నకిలీ మద్యం అమ్మి వేల కోట్లు సంపాదించడం, ఆ డబ్బును ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలవడమే వారి లక్ష్యం. తనకు అధికారం, తన మనుషులకు వేల కోట్ల డబ్బు సంపాదనే చంద్రబాబు పాలసీ.
రవాణాశాఖ అధికారులు ప్రైవేటు బస్సులకు సంబంధించిన అనుమతులు, ఫిట్ నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్‌లు పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత బస్సులు రోడ్డెక్కేలా అనుమతులు ఇవ్వాలి. అన్ని అనుమతులు, పేపర్లు లేకుండా రాష్ట్రంలో ఏ ప్రైవేటు బస్సు అయినా రోడ్డెక్కి జరగరానిది జరిగితే అది ప్రమాదం కాదు.. నిస్సందేహంగా హత్యగానే భావిస్తాం. హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారిపై జరిగినది ప్రమాదం కాదు, ఇది ముమ్మూటికీ హత్యే. దీన్ని నేను డిజిటల్ బుక్ లో ఎంటర్ చేస్తాను.
ఇకపై ప్రొద్దుటూరు రోడ్లపై అనుమతులు లేకుండా వచ్చిన వాహనాల వల్ల ప్రమాదం జరిగినా దాన్ని హత్యగానే ఈ జాతీయ రహదారిపై ఏ ప్రమాదం జరిగినా హత్యగానే భావించి డిజిటల్ బుక్ లో నమోదు చేస్తాను. వైయస్.జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీటిని హత్యలుగానే భావించి కేసులు నమోదు చేస్తాం. కూటమి ప్రభుత్వానికి మనుషులు ప్రాణాలంటే లెక్కలేకుండా పోయింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు నిద్రలోనే గాల్లో కలిసిపోయాయి. బెల్టుషాపుల్లో తాగిన మద్యం, అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణం. మీరు, మీ కుటుంబాలు మాత్రం బాగుండాలి. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు స్పెషల్ ప్లైట్లు, హెలికాప్టర్ లలో తిరుగుతారు. ప్రజలు మాత్రం కాలి బూడిదన్నా కావాలి, లేదంటే మీరు తయారు చేసిన నకిలీ మద్యం తాగి అన్నా చావాలి. కనికరం లేని దుర్మార్గ ప్రభుత్వమిది.

రాష్ట్రంలో మద్యం పాలసీ సక్రమంగా లేదని మేం ఎన్నిసార్లు చెప్పినా.. ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ఉంది. నకిలీ మద్యం, విపరీతంగా బెల్టు షాపులుతో ప్రజలు ప్రాణాలను హరిస్తున్నారు. బెంగుళూరు, హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగినది ప్రమాదం కాదు. అమాయకులైన 20 మందిని ప్రభుత్వమే పొట్టన పెట్టుకుంది. బెల్టుషాపుల్లో విచ్చలవిడి మద్యం అమ్మకాలే ఈ ప్రమాదానికి కారణం. ఈ ప్రమాద ఘటనలో మొదటి ముద్దాయి చంద్రబాబు సహా అందరూ నిందితులే.. వీరి నేరాన్ని డిజిటల్ బుక్‌లో ఎంటర్ చేయనున్నట్టు రాచమల్లు తెలిపారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరందరికీ శిక్ష పడేలా చేయడం ఖాయమని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.


