ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే ఎందుకు అడ్డుకోవడం లేదు: గడికోట శ్రీకాంత్‌రెడ్డి | Gadikota Srikanth Reddy Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే ఎందుకు అడ్డుకోవడం లేదు: గడికోట శ్రీకాంత్‌రెడ్డి

Oct 1 2025 9:48 PM | Updated on Oct 1 2025 9:53 PM

Gadikota Srikanth Reddy Fires On Chandrababu

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: కర్ణాటక ప్రభుత్వం మరోసారి ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి  సిద్ధమవుతుంటే.. సీఎం చంద్రబాబు కనీసం నోరెత్తకపోవడం దారుణమని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో 1995లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఇదే ఆల్మెట్టీ ఎత్తు పెంచడంతో రాయలసీమకు అన్యాయం జరగ్గా.. మరలా మరోసారి ఎత్తు పెంచాలన్న నిర్ణయంతో రాయలసీమతో పాటు పల్నాడు, ఒంగోలు వంటి ప్రాంతాలు ఏడారిగా మారడం ఖాయమని హెచ్చరించారు.

ఇంత జరుగుతున్నా సీఎం చంద్రబాబు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడంపై తీవ్రంగా ఆక్షేపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ప్రజలు, ప్రజా సంఘాలతో కలిసి ఆందోళనచేస్తామని హెచ్చరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

వ్యవస్థలను నాశనం చేస్తున్న కూటమి ప్రభుత్వం
కూటమి ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో రాష్ట్రం పూర్తిగా వెనుకబాటుకు గురవుతుంది. అన్నిరంగాలను ప్రభుత్వం నాశనం చేస్తుంది. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పరిపాలన చేస్తూ భవిష్యత్ తరాలకు, రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారు. అధికారమే పరమావధిగా అనుభవిస్తూ... ప్రజల రక్షణ, సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్తును పూర్తిగా గాలికొదిలేశారు. ఎంతసేపూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అక్రమ అరెస్టులు, ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపితే తప్పుడు కేసులు నమోదు చేస్తూ.. రాత్రికి రాత్రే అరెస్టులు చేస్తూ కుటుంబాలను వేధిస్తున్నారు.

రౌడీమూకలను ఉపయోగించుకుని బెదిరించడంతో పాటు దాడులు కూడా చేయిస్తున్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియకుండా ఈ రకంగా భయాందోళనలకు గురి చేస్తున్నారు. పాలనను పూర్తిగా మర్చిపోయారు. దుర్మార్గంపై ధర్మం గెలుపునకు ప్రతీకకగా దసరా పండగ జరుపుకుంటారు. అదే విధంగా మళ్లీ ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న అధర్మ పాలన, దుష్ట శక్తులకు తగిన గుణపాఠం చెప్పి మంచి రోజులకు నాంది పలకడం ఖాయం.

రాయలసీమకు నీటి గండం - చంద్రబాబు ద్రోహం
శ్రీశైలం ప్రాజెక్టుపై గాలిమాటలు చెప్పి రాయలసీమను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోంది. తెలుగుగంగ, గాలేరు నగరి ప్రాజెక్టులపై కనీసం ఆలోచన చేయలేదు. రాయలసీమ ప్రజల మనోభావాలను తెలిసిన వ్యక్తిగా దివంగత నేత వైఎస్సార్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత  ఆయన హయాంలో పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, గండికోట, గాలేరు నగరి ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 2004లో అప్పటికే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఈ ప్రాజెక్టులు వేటికీ హామీ ఇవ్వలేదు. దీనికి కారణం చంద్రబాబు నాయుడే. ఇది కాకుండా చంద్రబాబు ఆల్మెట్టీ ప్రాజెక్టు రూపంలో మరో తీవ్రమైన ద్రోహం చేశాడు.

1995 నాటికి ఆల్మెట్టీ ప్రాజెక్టు కేవలం 53 టీఎంసీలతో ఉండేది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఎన్టీయే ప్రభుత్వం ఏర్పడింది. ఎన్డీయే కూటమికి ఆ రోజుల్లో చంద్రబాబే చైర్మన్ గా ఉండగా.. మన ఎంపీలతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్న పరిస్థితి ఉంది. ఆ రోజు కర్ణాటక దేవేగౌడ నేతృత్వంలోని ప్రభుత్వం ఆల్మెట్టి ఎత్తును 509 అడుగులు నుంచి 524 పెంచే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించకపోవడంతో.. ప్రజలు, ప్రజాసంఘాలు కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం సరైన వాదనలు వినిపించలేకపోవడంతో.. సుప్రీం కోర్టు 519 అడుగులకు అనుమతి ఇచ్చింది. దీంతో ప్రాజెక్టు సామర్ధ్యం 123 టీఎంసీలకు పెరిగింది. ఆ రకంగా చంద్రబాబు హయాంలోనే రాయలసీమకు అన్యాయం జరిగింది.

మరలా దురదృష్టం కొద్దీ 2024లో కూడా టీడీపీ ఎంపీలతో కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఆల్మెట్టీ డ్యామ్ సామర్ధ్యాన్ని పెంచడానికి మరో రూ.70 వేలు కోట్లు ఖర్చు పెట్టడానికి కర్ణాటక ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తీసుకుంది. ఆల్మెట్టీ ఎత్తును 524 ఎత్తుకు పెంచబోతున్నారు. ప్రస్తుతం ఉన్న 123 టీఎంసీల నీటి సామర్ధ్యం ఉన్న ప్రాజెక్టును 279 టీఎంసీలకు పెంచబోతున్నారు. 154 టీఎంసీల పెంచబోయే ప్రాజెక్టు పనులకు టెండర్ల ప్రక్రియ కూడా మొదలైంది. అయినా మాట వరసకి కూడా చంద్రబాబు వ్యతిరేకించడం లేదు. మాట్లాడ్డం లేదు. ఇది దుర్మార్గం కాదా ? అన్యాయం కాదా?  కేవలం కృష్ణా జలాల మీదే ఆధారపడి ఉన్న రాయలసీమ భవిష్యత్తులో పూర్తిగానూ, నాగార్జున సాగర్  మీద ఆధారపడి ఉన్న పల్నాడు జిల్లా, కృష్ణా జిల్లా, బాపట్ల, ఒంగోలు జిల్లాలు ఎడారి ప్రాంతాలుగా మిగలడం ఖాయం. కంటిన్యూస్ గా కనీసం 6 నెలలు వరద వస్తే తప్ప... నిండే పరిస్థితి లేదు.

మరోసారి ఆల్మట్టి  రూపంలో అన్యాయం
గతంలో ఆల్మట్టి ప్రాజెక్టును 123 టీంఎంసీల నీటి సామర్ధ్యంతో నింపడమే దుర్మార్గం అనుకుంటే... మరలా ఇప్పుడు అదే చంద్రబాబు హయాంలో మరలా 279 టీఎంసీలకు పెంచబోవడం అత్యంత దారుణం. వీటి గురించి పట్టించుకోకుండా బనకచర్ల, సోమశిల అనుసంధానం అని మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నాడు. నిజానికి ఈ ప్రాజెక్టుల మీద చంద్రబాబుకు కనీస చిత్తశుద్ధి, ఆలోచన లేదు. ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు ఉండగా... రూ.83 వేల కోట్లతో బనకచర్ల అని చెబుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సరైన వాదన వినిపించకుండా... బనకచర్ల క్రాస్ ప్రాజెక్టుకు సరైన ప్రతిపాదనలు కూడా లేకుండా ప్రాజెక్టు కట్టేశామన్నంత బిల్డప్ ఇవ్వడంతో తెలంగాణా ప్రభుత్వం 904 టీఎంసీల కృష్ణా వాటర్ వాడుకునేందుకు జీవో జారీ చేశారు. ఇది ఎలా సాధ్యం?

274 టీఎంసీలు ఆల్మెట్టీ ద్వారా కర్ణాటక ప్రభుత్వం, 904 టీఎంసీలు తెలంగాణా ప్రభుత్వం వాడుకుంటే ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం జరుగుతుంది. దీనిమీద ఎందుకు నోరు మెదపడం లేదు? బనకచర్ల డీపీఆర్ కూడా సిద్ధం చేయకుండానే ప్రాజెక్టు పూర్తి చేసినట్లు ప్రచారం చేస్తుంటే.. తెలంగాణా ప్రభుత్వం తమ పని తాను చేసుకుంటూ పోతుంది. తెలంగాణా, కర్ణాటక రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఆల్మెట్టీ గురించే మాట్లాడుతుంది. ఇక్కడ అధికార పార్టీలో ఉంటూ చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడ్డం లేదు.

గతంలో 75 శాతం డిఫెండబులిటీ పేరుతో ఎగువ రాష్ట్రాలకు మేలు చేస్తూ.. దిగువ రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా ఓ నిబంధన పెట్టారు. దానిపైన కూడా పోరాటం చేయాలి. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిర్మించకూడదు.. దిగువ ప్రాంతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్న వాదన వినిపించడం లేదు. ఆల్మెట్టీ 274 టీఎంసీల సామర్ధ్యంతో విస్తరిస్తే.. జూరాల, నారాయణపూర్ దాటి ఏపీకి ఎప్పుడు నీళ్లొస్తాయి? మరోవైపు జూరాల దగ్గర నెట్టంపాడు, బీమా, కోయిల్ సాగర్ వంటి అనేక ప్రాజెక్టులను తెలంగాణా ప్రభుత్వం  లిఫ్ట్ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో రాయలసీమ భవిష్యత్తు ఏంటి అన్న దానిపై చంద్రబాబు ప్రభుత్వం కనీసం  కనీస చిత్తశుద్ధి కూడా లేకుండా వ్యవహరిస్తోంది.

గతంలోరాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్  ప్రారంభించి దాదాపు పూర్తిచేస్తే...దానికి పర్యావరణ అనుమతులు లేవని చెబుతున్నారు. కేంద్రంలో మీ బలంతో ప్రభుత్వం నడుస్తుంటే.. ఎందుకు సాధించలేకపోతున్నారు ? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తో సహా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయడం లేదు ? జీ ఎన్ ఎస్ ఎస్ నుంచి హెచ్ ఎన్ ఎస్ ఎస్ కు కలిపే అద్భుతమైన ప్రాజెక్టును పక్కన పెట్టారు. రాయలసీమ ప్రాజెక్టులపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు, ప్రాజెక్టులపై అవగాహన లేదు కేవలం కల్లిబొల్లి మాటలు చెబుతున్నాడు.  దాదాపుగా 17 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసి రాయలసీమ ప్రాంతానికి ఏం చేశావు చంద్రబాబూ?

రాయలసీమ అభివృద్ధి వైఎస్సార్ హయాంలోనే..
రాయలసీమ ప్రాంతానికి మెడికల్ కాలేజీలు వచ్చాయంటే వైయస్సార్, వైయస్.జగన్ హయాంలో మాత్రమే. పోతిరెడ్డి పాటు కూడా వైయస్సార్ టైంలోనే వచ్చింది. ఎప్పటి నుంచో కలలు కంటున్న నంద్యాల, అన్నమయ్య, తిరుపతి జిల్లాలు ఏర్పాటు చేసిన ఘనత కూడా వైయస్.జగన్ కే దక్కుతుంది. మరోవైపు శ్రీ సిటీని వైఎస్సార్‌ ఏర్పాటు చేస్తే ఆయన ఆలోచనలకు అనుగుణంగా వైఎస్‌ జగన్ హయాంలో కొప్పర్తి, ఓర్వకల్లు సెజ్ లు ఏర్పాటు చేశారు. పరిశ్రమలు, ఇరిగేషన్ అభివృద్ధి అంతా రాయలసీమలో వైఎస్సార్‌, వైఎస్‌ జగన్ హయాంలో వచ్చినవి మాత్రమే. మీ హయాంలో అభివృద్ధి లేకపోగా.. అన్యాయం జరుగుతుంటే కూడా నోరు విప్పి మాట్లాడకపోవడం దారుణం.

ప్రజా ధనంతో విలాసాలు
ఢిల్లీకు వారానికొకసారి తండ్రీకొడుకులు వెళ్లి షో చేస్తూ.. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారే తప్ప... రాష్ట్ర ప్రజలకు పైసా ఉపయోగం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి స్ధాయిలో చంద్రబాబు ఏడాదిన్నరలోనే 71 సార్లు విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్తే... 77-80 దఫాలు డిప్యూటీసీఎం, లోకేష్ లు ఇదే మాదిరిగా ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలీకాప్టర్ లలోనూ చక్కెర్లు కొడుతున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ రాష్ట్రంలో లేకుండా హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. కరోనా సమయంలో హైదరాబాద్‌లో ఇళ్ళకే పరిమితం అయ్యారు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ.. ప్రజా సేవ గురించి, ప్రజల గురించి మాట్లాడుతున్నారు. అధికారంలో ఉండి విజయవాడలో ఉండి పరిపాలన చేయకుండా 70 దఫాలుకుపైగా హైదరాబాదకు ప్రత్యేక విమానాల్లో షికార్లు చేస్తున్నారు.

అన్ని వర్గాల ప్రజలకూ బాబు మొండిచేయి
16 నెలల పాలనలో ఇప్పటికే మహిళలకు, రైతులకు, యువతకు, నిరుద్యోగులకు అన్యాయం చేశారు. ఏ పంటకూ రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కింద రెండేళ్లకు దాదాపు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం రూ.5 వేలు ఇచ్చి అంతా ఇచ్చామని చేతులు దులుపుకున్నారు. పంటకు గిట్టుబాటు ధర ఉండడం లేదు.. వేసుకున్న పంటకు యూరియా కూడా ఇవ్వలేని అసమర్థ స్ధితిలో ఈ ప్రభుత్వం  ఉంది. వైఎస్‌ జగన్ ప్రభుత్వంలో మూడు విడతలుగా డ్వాక్రా రుణాలు మాఫీ చేశారు.

మరో వైపు సున్నావడ్డీకి రుణాలు, చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం వల్ల మహిళలకు మేలు జరిగించే కార్యక్రమం చేశారు. ఇవాళ నెలకు రూ.1500 చొప్పున 18 ఏళ్లు దాటిన మహిళలకు ఇస్తామన్నది కూడా ఇవ్వడం లేదు. యువతను సర్వనాశనం చేస్తూ.. గంజాయితో కాలేజీలు, స్కూల్లు విచ్చలవిడిగా తయారైన పరిస్ధితి నెలకొంది. నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగులకిచ్చిన హామీలుపై పట్టించుకున్న దాఖలాలు లేవు. పొలిటికల్ గేమ్ కోసం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా సస్పెండ్ చేస్తూ.. పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తూ దుర్మార్గమైన పాలన చేస్తున్నారు.

గతంలో రూ.10 లక్షల కోట్లు అప్పులు అంటూ తప్పుడు ప్రచారం చేశారు. గతంలో వైయస్.జగన్ హాయంలో  ఐదేళ్లలో కేవలం రూ.3 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేస్తే...  ఏడాదిన్నర కాలంలో రూ.2 లక్షల కోట్లు అప్పు చేసి ప్రజా సంక్షేమం కూడా చేయడం లేదు. చేసిన అప్పు ఏం చేస్తున్నట్టు ? సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? వివేకానందరెడ్డి హత్యలో మా పార్టీపై నిందలు మోపుతున్నారు. అధికారంలో  ఉండి కూడా ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఎవరు అడ్డుపడుతున్నారు? కేవలం ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు.  లిక్కర్ కేసుపై నోటికొచ్చినట్లు తప్పుడు ప్రచారం చేశారు. ఎంపీ  మిధున్ రెడ్డి కేసులు ఇది చాలా స్పష్టంగా వెల్లడైంది.  వైయస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధించడం మినహా మీరు చేసిందేమీ లేదు.

రాయలసీమ ప్రాంత వాసులుగా.. ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. వినకపోతే ఆందోళనకు కూడా సిద్ధం. దుర్మార్గంగా వ్యవహరించి రాయలసీమకు అన్యాయం చేయవద్దు.  ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వం తక్షణమే ఆల్మెట్టీ టెండర్లు రద్దయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్న తన భాగస్వామ్య ప్రభుత్వాన్ని ఒప్పించాలని గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేసారు. భవిష్యత్తులో శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన మరే ప్రాజెక్టు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తేల్చి చెప్పారు.  రైతుల ప్రయోజనాల కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దేనికైనా సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సరైన వివరణ ప్రజలు ఇవ్వాలని లేని పక్షంలో ఆల్మెట్టీపై ప్రజా సంఘాలు, తటస్ఠ వ్యక్తులు, రైతులు, రైతు సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement