సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి నేతలు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక మాఫియాన్ని నడుపుతున్నారా?. రాష్ట్రంలో రాజకీయ రక్తపాతాన్ని పారిస్తున్నారు. రెడ్‌బుక్ పేరుతో తీవ్రమైన దారుణాలకు పాల్పడుతున్నారు. ఏపీలో కేవలం కక్ష సాధింపు రాజకీయాలు నడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘హనీట్రాప్ చేసిన ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఫిర్యాదుతో పీఎస్ఆర్ ఆంజనేయుల్ని జైల్లో పెట్టారు. అక్రమాలు బయట పెట్టిన ఐపీఎస్ అధికారి సంజయ్ ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. రెడ్‌బుక్ వైఎస్సార్‌సీపీ నేతలపైనే కాదు.. అధికారులపై కూడా ప్రయోగించి వేధిస్తున్నారు’’ అని చంద్రశేఖర్ ధ్వజమెత్తారు.
‘‘కూటమి నేతలు.. భారీగా భూ దోపిడీ, ఇసుక, మైనింగ్ స్కాంలు చేస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. ఏపీలో ఉంది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు.. ట్రబుల్ ఇంజిన్ సర్కార్. కూటమి పాలనలో రాష్ట్రంలో అన్ని అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయి. కూటమి నేతలు ప్రైవేటీకరణ పేరుతో దోపిడీ చేస్తున్నారు. కూటమి నేతల దోపిడీని వైఎస్సార్‌సీపీ బయటపెడుతోంది. కూటమి నేతలు టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీష్‌ను మానసికంగా వేధించారు. సతీష్ మరణానికి కూటమి ప్రభుత్వమే కారణం. సతీష్ మృతిపై ఎల్లో మీడియా కట్టుకథలు చెబుతోంది.
..ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే, పోస్టుమార్టం జరగక ముందే హత్య అని టీడీపీ నేతలు ఎలా చెప్పారు?. గొడ్డలి వేటు గాయాలతోనే సతీష్ రైలు ఎక్కాడా?. రక్తపు మరకలు ఎవరూ చూడలేదా?. హత్య జరుగుతుంటే జనం ఎవరూ చూడలేదా?. కట్టుకథలను టీడీపీ నేతలు ఎందుకు ప్రచారం చేస్తున్నారు?. సతీష్ వీపు మీద గొడ్డలి వేటు ఉన్నట్టు ఎల్లో మీడియా ఎలా ప్రచారం చేసింది?’’ అంటూ చంద్రశేఖర్ దుయ్యబట్టారు.

..చేసిన అభివృద్ధి ఏమీ లేకపోయినా చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం మాత్రం చేసుకుంటుంది. జగన్ తెచ్చిన ప్రాజెక్టులకు టీడీపీ స్టిక్కర్లు వేస్తున్నారు. గోమాంసం విచ్చలవిడిగా ఎగుమతి అవుతుంటే పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మహిళలపై జనసేన నేతలే అఘాయిత్యాలకు పాల్పడుతుంటే పవన్ చోద్యం చూస్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులను చంద్రబాబు దారుణంగా అవమానించారు. ప్రజల సొమ్ముతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్‌లలో తిరుగుతూ విలాసాలు చేస్తున్నారు. ప్రయివేటు వ్యక్తుల భూములను హెలికాప్టర్ నుండి చిత్రీకరించే పవన్‌కి కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఆక్రమణ ఇల్లు కనపడలేదా?’’ అంటూ చంద్రశేఖర్ నిలదీశారు.


