
సాక్షి, కడప: కూటమి ప్రభుత్వం చేసే అరెస్ట్‌లు కుట్రలో భాగమేనని వైఎస్సార్‌సీపీ నేత రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. మద్యం పాలసీతో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు సంబంధమే లేదన్నారు. కక్ష సాధింపుల్లో భాగంగానే వారిని అరెస్ట్ చేశారన్నారు.
ఏ సాక్ష్యాలు, ఆధారాలతో అరెస్ట్ చేశారో ప్రభుత్వం చెప్పగలదా? అంటూ రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి నిలదీశారు. ‘‘సత్యప్రసాద్ అనే చిన్న ఉద్యోగిని బెదిరించారు. అతని బెదిరించి వారికి కావాల్సిన స్టేట్‌మెంట్ ఇప్పించుకున్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను బెదిరిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్‌లు ధైర్యంగా పనిచేయగలుగుతున్నారా?. ఐఏఎస్, ఐపీఎస్‌లు జైళ్లకు పోవాల్సిందేనా?’’ అంటూ రాచమల్లు దుయ్యబట్టారు.
‘‘కొన్ని బ్రాండ్‌లే అమ్మారు.. అన్ని బ్రాండ్‌లు అమ్మలేదని ఆరోపణ.. కూటమి ప్రభుత్వం ఆరోపణలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. కూటమి ప్రభుత్వం చర్యలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. ఎవరిని జైలుకు పంపాలని ఉద్దేశంతో అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారు?. రూ.3,200 కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందో ఆధారాలతో చెప్పగలరా?. చంద్రబాబు మద్యం పాలసీ అత్త నీతులు చెప్పినట్లుంది. ఎన్నికలకు ముందు మద్యం ధరలు తగ్గిస్తామన్నారు.. తగ్గించారా?’’ అంటూ రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రశ్నించారు.
