సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: మంత్రి నారా లోకేష్ ఆదేశాలతోనే తన ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు మాజీ మంత్రి జోగి రమేష్. తనపై ఎటువంటి దాడి జరిగినా లోకేష్‌దే బాధ్యత అని చెప్పుకొచ్చారు. తన ఇంటిపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై దాడే అని అన్నారు. తనను మట్టుబెట్టాలనే ఆలోచనే లేకపోతే దాడి ఎందుకు చేస్తారు? అని ప్రశ్నించారు. 83 రోజులు జైలులో పెట్టినా కడుపు చల్లబడలేదా చంద్రబాబు అని మండిపడ్డారు.
తన ఇంటిపై టీడీపీ నేతల దాడి అనంతరం మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రేరేపిత కుట్రతోనే మా ఇంటిపై దాడి చేశారు. తప్పుడు కేసులో అకారణంగా నన్ను, నా తమ్ముడిని 83 రోజులు జైలులో పెట్టారు. మమ్మల్ని వేధించి, హింసించి రక్షసానందం పొందుతున్నారా?. ప్రజా వ్యతిరేక విధానాలపై నా గొంతుక వినిపించడం తప్పా?. మీరు బూతులు మాట్లాడితే తప్పు లేదు కానీ.. మేం ప్రశ్నిస్తే తప్పా?. మా ఇంటిపై జరిగిన దాడి బడుగు బలహీన వర్గాలపై జరిగిన దాడి అని ఘాటు విమర్శలు చేశారు.
ఎంపీ కేశినేని చిన్ని నేతృత్వంలోనే గంజాయి, బ్లేడ్ బ్యాచ్ దాడికి దిగింది. నన్ను, నాకుటుంబాన్ని నాశనం చేయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారా?. మీ బుర్రలు పాడు కాకపోతే మా ఇంటిపైకి దాడులు చేయిస్తారా?. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మరీ గూండాలను రప్పించారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఎంపీ కేశినేని చిన్ని నేతృత్వంలోనే మా ఇంటిపై దాడి చేశారు. పోలీసు అధికారులు, టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే మా ఇంటిపై కుట్ర జరిగింది. టీడీపీ గూండాలకు పోలీసులే రక్షణ ఇచ్చారు. పోలీసుల చేతుల్లో కనీసం లాఠీలు కూడా లేవు. పోలీసుల సమక్షంలోనే.. పోలీసుల సాక్షిగా మా ఇంటిపై దాడి జరిగింది.

కూటమి ప్రభుత్వాన్ని ప్రజలే శిక్షిస్తారు. లోకేష్ నీ రెడ్‌బుక్ తీసి మడిచిపెట్టుకో. నాపై ఎటువంటి దాడి జరిగినా లోకేష్‌దే బాధ్యత. నేను నిన్న మాట్లాడినందుకు మళ్లీ నాపై కేసులు పెట్టారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలవలేదని సెంట్రల్ ల్యాబ్‌లే నిర్ధారించాయి. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని అన్నారు. నాకు అండగా జగనన్న, వైఎస్సార్‌సీపీ సైన్యం ఉంది. ఏడాదిన్నర కాలంలోనే ప్రభుత్వం అసమర్ధత బయటపడింది. జోగి రమేష్ ఎక్కడికీ పారిపోడు.. ఇక్కడే ఉంటాడు. విద్యార్ధి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నా. తప్పుడు కేసులకు, అరెస్టులకు భయపడేది లేదు. నా ఇల్లు తగలబెట్టి లోకేష్ దగ్గర మార్కులు కొట్టేద్దామని కొంతమంది సంబరపడుతున్నారు. గుర్తుంచుకోండి.. ఎవరినీ విడిచిపెట్టేది లేదు. నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరమో.. నీ ఇంటికి నా ఇల్లు కూడా అంతేదూరమని లోకేష్ గుర్తుంచుకోవాలి’ అని హెచ్చరించారు.


