
సాక్షి, తాడేపల్లి: మద్యం కేసు రాజకీయ ప్రేరేపితమని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఏపీలో రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు పెడుతున్నట్టు సుప్రీంకోర్టుకు సైతం అర్థమైందన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌ని టార్గెట్ చేసుకుని అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
‘‘చంద్రబాబు రూ.370 కోట్లు లూఠీ చేసినట్టు ఆధారాలతో సహా దొరికారు. ఏలేరు స్కాం నుంచి అనేక కేసులు విచారణ కూడా జరగకుండా స్టేలు తెచ్చుకున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబు 53 రోజులు జైలులో ఉన్నారు. దానిమీద ఒక్కరోజైనా వైఎస్ జగన్‌ని జైల్లో ఉంచాలని చంద్రబాబు తొందర పడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి కక్షసాధింపు పనిలో పడ్డారు. స్కిల్ కేసులో చంద్రబాబే స్వయంగా అక్రమాలకు పాల్పడ్డారు. నిధుల విడుదల అక్రమమని తెలిసినా నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు డ్రా చేశారు. ఆధారాలతో సహా స్కిల్ కేసులో దొరికారు’’ అని పేర్ని నాని గుర్తు చేశారు.
‘‘బ్రీఫ్‌డ్ మీ కేసులో టేపులతో సహా దొరికారు.. కానీ లిక్కర్ కేసులో జగన్‌కు ఏం సంబంధం?. ఆయన ఎక్కడైనా సంతకాలు పెట్టారా?. ఈ కేసులో నిజాయితీగా వ్యవహరించిన వినీత్ బ్రిజిలాల్‌ను తప్పించారు. తమకు వత్తాసు పలికే ఆఫీసర్ ఆధ్వర్యంలో సిట్‌ను వేసి లిక్కర్ కేసు నడుపుతున్నారు. కేసు నిలుస్తుందా? లేదా? అనేది పక్కన పెట్టి జగన్ అరెస్టే లక్ష్యంగా కేసు నడుపుతున్నారు. ఇందుకోసం ఎన్ని పాపాలు, తప్పులు చేయాలో అవన్నీ సిట్‌తో చేయిస్తున్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా జగన్ వెనకడుగు వేయరు
..చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి, లావు శ్రీకృష్ణ దేవరాయలు, అచ్చెన్నాయుడు.. వీరంతా లిక్కర్ కేసు మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు, ఆరోపణలు చేశారు. అనేక కేసుల్లో దొరికిన దొంగ చంద్రబాబు. లక్షా 50 వేల కోట్లు అప్పు చేసి, ఆ డబ్బును ఏం చేశారో చెప్పటం లేదు. రాష్ట్ర ఆదాయాలు భారీగా పడిపోయాయి. సంపద సృష్టి ఇంకెప్పుడు చేస్తారు?. ప్రత్యేక విమానాల్లో విహారాలు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌ల కోసం మూడు హెలికాఫ్టర్లు కొనబోతున్నారు. ప్రజల సొమ్మును ఇష్టానుసారం ఖర్చు చేస్తున్నారు’’ అని పేర్ని నాని నిలదీశారు.
మీరు చేస్తున్న తప్పుడు పనులను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. లిక్కర్ కేసులో ఆధారాలు లేకుండా అరెస్టులు చేస్తున్నారు. టీడీపీ ఆఫీస్ నుంచి వాట్సప్‌లో వచ్చిన ప్రశ్నలను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వంశీ కేసులో కోట్ల రూపాయలను లాయర్లకు ఇస్తున్నారు. ప్రజల డబ్బును టీడీపీ నేతల అవసరాలు, కక్షసాధింపు కోసం ఖర్చు చేస్తున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర డమ్మీ మంత్రి. ఆయన ఇంటి పక్కనే బెల్టుషాపు పెట్టినా చూస్తూ కూర్చున్న చేతగాని మంత్రి’’ అంటూ పేర్ని నాని మండిపడ్డారు.