
వేదికను పంచుకోని అన్నదమ్ములు
కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశం
మంచిర్యాల జిల్లా: దసరా వేడుకల వేళ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గురువారం రాత్రి ఆసక్తికర, ఆశ్చర్యకరమైన సన్నివేశం చోటు చేసుకుంది. విజయదశమి వేడుకల్లో భాగంగా సింగరేణి తిలక్ స్టేడియంలో హిందు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రావణాసుర వధ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌తో పాటు ఆయన సోదరుడు స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
రాత్రి 7.15గంటల ప్రాంతంలో మంత్రి వివేక్ స్టేడియంకు రాగా.. ఎమ్మెల్యే వినోద్ పాల్గొనకపోవడం సభికులను ఆశ్చర్యానికి గురి చేసింది. కొంతసేపటి తర్వాత మంత్రి వివేక్ తన ప్రసంగం ముగించి 7.35గంటలకు మందమర్రిలో నిర్వహించే రాంలీల కార్యక్రమానికి హాజరు కావాలంటూ సభికులకు దసరా శుభాకాంక్షలు తెలియజేసి వేదిక దిగి వెళ్లిపోయారు. మంత్రి వెళ్లిపోయిన విషయాన్ని కొందరు సమాచారం ఇవ్వడంతో అరగంట తేడాతో ఆయన సోదరుడు వినోద్ మైదానానికి చేరుకున్నారు.
అప్పటివరకు బాలికల సాంస్కృతిక కార్యక్రమాలతో సభికులు కదలకుండా చూశారు. తమ్ముడు హాజరైన కార్య క్రమానికి అందుబాటులో ఉండి కూడా ఎమ్మెల్యే హాజరు కాకపోగా.. క్యాంపు కార్యాలయానికి వెళ్లి అన్నను తమ్ముడు కలువకపోవడం సభికులు, పుర ప్రజలను విస్మయానికి గురి చేసింది. ఈ సంఘటన తోబుట్టువుల మధ్య నెలకొన్న అసమ్మతికి నిదర్శనమని పలువురు పేర్కొనడం గమనార్హం. ఇద్దరి మధ్య ఎందుకు పొరపొచ్చాలు వచ్చాయో తెలియ దు కానీ ముఖ్య అతిథులుగా హాజరు కావాలి్సన వినోద్, వివేక్ దూరం దూరంగా ఉండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వీరి తీరుపై పురప్రజలు పలు రకాలుగా చర్చించుకోవడం వినిపించింది. ఈ ఘటన కాంగ్రెస్ శ్రేణులను కూడా గందరగోళానికి గురి చేసి చర్చనీయాంశంగా మారింది.