పారాయణతో మలినాలు మాయం | IsLam What are the benefits of chanting | Sakshi
Sakshi News home page

పారాయణతో మలినాలు మాయం

Sep 25 2025 11:11 AM | Updated on Sep 25 2025 11:11 AM

 IsLam What are the benefits of chanting

ఒక ఊరిలో ఓ ధార్మిక గురువు ఓ పురాతన మస్జిదులో ప్రవచనం చేస్తూ ఉండేవారు. ఒకరోజు ఒక యువకుడు గురువు దగ్గరికి వెళ్ళి,‘అయ్యా..! ఖురాన్‌ పారాయణ వల్ల హృదయానికి పట్టిన తుప్పు వదిలి పోతుంది. అని చెబుతారు గదా..! అది ఎలా సాధ్యం?’ అని సందేహం వెలిబుచ్చాడు. దానికి ఆ గురువు, ‘అదిగో అక్కడొక బిందె ఉంది. అది తీసుకెళ్ళి, కోనేటిలో నీళ్ళు ముంచుకురా..’ అన్నాడు.‘నేనేదో ధార్మిక సందేహం తీర్చుకుందామని వస్తే.. పని చెప్పాడేమిటి.. ఈ గురువుగారు...’ అనుకుంటూనే, బయటికి వెళ్ళాడు. తీరా చూస్తే అందులో బొగ్గులున్నాయి. అదే విషయం గురువుగారికి చెప్పాడు. ‘అవి  పారబోసి నీళ్ళు తీసుకురా...’ అన్నారు గురువుగారు.

ఆ యువకుడు బిందె తీసుకువెళ్ళి, నీళ్ళు ముంచుకొని వచ్చాడు. కాని దానికి చిల్లి ఉండడం వల్ల నీళ్ళన్నీ దారిలోనే కారిపొయ్యాయి. గురువుగారి దగ్గరికొచ్చేసరికి ఖాళీ బిందె మిగిలింది. గురువుగారు మళ్ళీ నింపుకు రమ్మన్నారు. మళ్ళీ అదే పరిస్థితి. ఈ విధంగా నాలుగైదుసార్లు తిరిగిన తరువాత, గురువుగారు ఇలా చేయడంలో ఏదో మర్మం ఉండి ఉంటుందని గ్రహించిన యువకుడు, ఇక లాభం లేదనుకుని.. ‘అసలు విషయం ఏమిటో చెప్పండి.’ అని వినయంగా ఆయన ముందు కూర్చున్నాడు.

గురువుగారు చిన్నగా నవ్వి, ‘బాబూ.. గమనించావా..? నువ్వు బిందె తీసుకు వెళ్ళినప్పుడు, అది మసి కొట్టుకొని ఉంది. అవునా..?’ అన్నారు. ‘అవును’ అన్నాడు యువకుడు. ‘మరి ఇప్పుడెలా ఉందో చూడు.’ అన్నారు. ‘బొగ్గుల మసంతా పోయి శుభ్రంగా తయారైంది.’ అన్నాడా యువకుడు.

‘శుభ్రత నీటికి ఉన్న గుణ ప్రభావం. నీరు అందులో ఆగకపోయినా, అది మసిని శుభ్రం చేసింది. ఒకటికి నాలుగుసార్లు నువ్వు అలా చేయడం వల్ల కొద్ది కొద్దిగా శుభ్రమవుతూ, చివరికి పూర్తిగా లేకుండానే సోయింది. అలాగే ఖురాన్‌ కూడా పఠిస్తూ ఉంటే, దాని గుణ ప్రభావం కారణంగా మనసులోని మాలిన్యమంతా కొట్టుకుపోయి హృదయం నిర్మలంగా తయారవుతుంది. మంచిని ప్రేమించడం, చెడులకు దూరంగా ఉండడం, సాటివారికి మేలు చేయడం, సమాజ సంక్షేమం కోసం కృషి చేయడం లాంటి మానవీయ గుణాలు జనిస్తాయి’ అన్నారు గురువు.
– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement