తలాక్ ఏ హసన్‌పై సుప్రీం
విస్తృత ధర్మాసనానికి నివేదన
న్యూఢిల్లీ: ఇస్లాం మతాచారం ప్రకారం భర్త నెలకోసారి చొప్పున తలాక్ చెబుతూ మూడు నెలల వ్యవధిలో భార్యకు విడాకులిచ్చే తలాక్ ఏ హసన్ పద్ధతిని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. దాని రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి నివేదించింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం బుధవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఇలాంటి విడాకుల పద్ధతిని నాగరిక సమాజం అంగీకరించడం సహేతుకమేనా అంటూ పలు కీలక ప్రశ్నలు సంధించింది. ఇస్లాంలో ఎన్ని విడా కుల పద్ధతులు ఉన్నదీ లిఖితపూర్వకంగా తమకు కూలంకషంగా వివరించాల్సిందిగా ఇరు పక్షాలకూ జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. ‘మేమేదో ఒక ప్రబలమైన మతాచారాన్ని రద్దు చేయబో తున్నామని భావించరాదు. కానీ సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే తలాక్ ఏ హసన్ వంటి దురాచారాలను సరిదిద్దేందుకు కోర్టులు తప్పక జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది‘ అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ఇదేం దుస్థితి?
తలక్ ఏ హసన్ బాధితురాలైన బేనజీర్ హీనా అనే ఢిల్లీకి చెందిన పాత్రికేయురాలు ఈ సందర్భంగా తన వాదనను స్వయంగా ధర్మాసనానికి వినిపించారు. ‘ఈ పద్ధతిలో భర్త నేరుగా భార్యకు తలాక్ చెప్పే పని కూడా లేదు. ఆయన తరఫు లాయర్, లేదా మరే ఇతర వ్యక్తి అయినా భార్యకు నెలకోసారి తలాక్ చెప్పవచ్చు. దేశ రాజధానిలోనే ఇలాంటి పరిస్థితి ఉందంటే ఇక మారుమూల ప్రాంతాలకు చెందిన ముస్లిం మహిళలు ఇలాంటి దురాచారాలకు ఇంకెంతగా బలవుతున్నదీ అర్థం చేసుకోవచ్చు‘ అని ఆవేదన వెలిబుచ్చారు.
ఆమె మాజీ భర్త తరఫు లాయర్ తలాక్ ఏ హసన్ ను సమర్థిస్తూ వాదనలు వినిపించబోగా జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఏ విధంగా చూసినా ఇదసలు మహిళల గౌరవాన్ని కాపాడే చర్యేనా? 2025లో కూడా ఇలాంటి వాటిని అనుమతించడం ఏ మేరకు సబబు? వీటిని మీరెలా సమర్థిస్తారు?‘ అని ప్రశ్నించారు. ‘తలాక్ కోసం లాయర్ ను సంప్రదించగలిగిన వ్యక్తి, అదే విషయమై నేరుగా భార్యతో మాట్లాడేందుకు ఇబ్బందేమిటన్నది అర్థం కావడం లేదు. ఇకముందు బహుశా లాయర్లే విడాకులు ఇచ్చేస్తారు కాబోలు!‘ అంటూ దుయ్యబట్టారు.
‘తన హక్కుల కోసం కోర్టు మెట్లెక్కిన హీనా ధైర్యానికి సెల్యూట్. తనో జర్నలిస్టు గనుక ఇక్కడిదాకా రాగలిగింది. అంతటి అవగాహన, వెసులుబాటు లేని పేద, అణగారిన ముస్లిం మహిళల పరిస్థితి ఏమిటి? ఇలాంటి అన్యాయపు మతాచారాలకు మౌనంగా బలి కావాల్సిందేనా?‘ అంటూ ఆవేదన వెలి బుచ్చారు. తర్వాతి విచారణకు మాజీ భర్త హాజర య్యేలా చూడాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ఇస్లాంలో అత్యంత ప్రబలంగా ఉన్న ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని 2917లో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇవ్వడం తెలిసిందే.


