అప్పుడే తీర్చేయొద్దు! | Closing loans early results in a loss, sakshi special story | Sakshi
Sakshi News home page

అప్పుడే తీర్చేయొద్దు!

Dec 22 2025 5:43 AM | Updated on Dec 22 2025 5:43 AM

Closing loans early results in a loss, sakshi special story

ఈజీగా వస్తున్నాయి కదా అని రుణాలు తీసుకోవద్దు

తీసుకున్నాక, దాన్ని క్లోజ్‌ చేయటంలో తొందరపాటు వద్దు

తక్కువ వడ్డీ రుణాలను ముందే క్లోజ్‌ చేయటంతో నష్టమే

ఆ మొత్తాన్ని సరైన పద్ధతిలో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి లాభం

ఎక్కువ వడ్డీ రుణాలను మాత్రం త్వరగా తీర్చేస్తేనే మేలు

గృహ రుణాలు, విద్యా రుణాలపై వడ్డీ రేటు తక్కువే

క్రెడిట్‌ కార్డు అప్పులు మాత్రం అస్సలుంచుకోవద్దు  

ఇపుడు ఫోన్‌ తెరిచి మెసేజ్‌లు, వాట్సాప్‌లు చూసినా... మెయిల్‌ తెరిచినా రుణాలిస్తామంటూ రోజూ ఆఫర్ల కొద్దీ ఆఫర్లు. దీంతో పాటు ఫోన్లు. ఫోన్‌ చేసి మరీ... లోన్‌ కావాలా? అని అడిగే ఏజెన్సీలు కోకొల్లలు. ఇలాంటివేమీ లే కున్నా.. జస్ట్‌ యాప్‌ తెరిచి క్లిక్‌ కొడితే మన ఖాతాలోకి డబ్బులిచ్చేసే రుణ యాప్‌లు కూ డా ఉన్నాయి. అదీ ఫిన్‌టెక్‌ మహిమ. నిజానికి ఈ యాప్‌లన్నీ అప్పులిచ్చేది వాటి సొంత డబ్బేమీ కాదు. అవన్నీ ఏదో ఒక ఫైనాన్స్‌ కంపెనీతోనో, బ్యాంకుతోనో జతకట్టి ఉంటాయి. వాటికన్నా కాస్త ఎక్కువ వడ్డీ వేసుకుని... అత్యంత ఈజీగా మీ ఖాతాలోకి వేసేస్తూ ఉంటాయి. తీర్చటం కాస్త ఆలస్యమయినా, తీర్చకపోయినా వీటి వ్యవహారశైలి కూడా చాలా దుర్మార్గంగా ఉంటుంది. అందుకే రుణం తీసుకునేటపుడు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ తీసుకున్నాం? ఎంత వడ్డీకి తీసుకున్నాం? ప్రాసెసింగ్‌ ఛార్జీలెంత? ప్రీపేమెంట్‌ పెనాల్టీ ఎంత? ఇవన్నీ తప్పనిసరిగా చూడాలి.  

సరే! ఇవన్నీ చూశాకే రుణం తీసుకున్నారనుకుందాం. ఇల్లు, కారు, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాల కొనుగోళ్లు, టూర్లు... ఇలా దేనికైనా రుణం తీసుకుని ఉండొచ్చు. కాకపోతే చాలామంది ఈజీగా వస్తున్నాయి కదా అని ప్రతిదానికీ రుణం తీసేసుకోవటం... ఆ తరువాత దాన్ని భారంగా భావించి త్వరగా వదిలించుకునే మార్గాల కోసం వెతకడం చేస్తుంటారు. దేశంలో ముందస్తు రుణ చెల్లింపులు పెరుగుతుండడం దీన్నే సూచి స్తోంది. 1వ తారీఖు వస్తుందంటే మనసులో ఆందోళన పెరగడం... ‘ఈఎంఐ’ కట్టడంలో ఉన్న నొప్పి... వారితో అలా చేయిస్తుంటా యి.  కానీ, అన్ని రుణాలనూ ఇలా ముందు గా తీర్చేయడం ఆర్థికంగా తెలివైన పనేమీ కా దు. రుణాల్లో మనల్ని పిండేసే వాటితో పాటు కొన్ని మనకు లాభాన్నిచ్చేవి కూడా కొన్ని ఉంటాయి. ఆర్థికంగా గుల్ల చేసే రుణాలను వదిలించుకోవడం, చౌక రుణాలతో నాలుగు రాళ్లు వెనుకేసుకోవడం ఎలాగో చూద్దాం...

రుణాన్ని ముందుగా తీర్చేయడం ఎందుకు? 
→ రుణ భారం నుంచి బయటపడాలన్న ప్రయత్నం వెనుక ఎన్నో కారణాలుంటాయి. 
→ అత్యవసరమో లేక నచి్చన వస్తువును సొంతం చేసుకోవాలన్న బలహీనత వల్లో రుణం తీసుకుని ఉండొచ్చు. నెలవారీ రుణ చెల్లింపులు మొదలయ్యాక భారంగా అనిపించొచ్చు. ఆదాయం నుంచి ఈఎంఐలకు సర్దుబాటు చేయలేక, రుణాన్ని ముగించాలని భావించొచ్చు.  
→ పెట్టుబడులు గడువు తీరి చేతికి రావొచ్చు. లేదా పనిచేస్తున్న కంపెనీ నుంచి బోనస్‌ బ్యాంక్‌లో జమ కావొచ్చు. వీటితో రుణం భారం తగ్గించుకుందామని అనిపించొచ్చు.  
→ నెలవారీ ఆదాయంలో చాలా వరకు రుణ చెల్లింపులకే ఖర్చు చేసేస్తుంటే.. ఇక ఇతర ఖర్చులకు చాలని పరిస్థితులతో ఇంట్లో ఒత్తిళ్లు తట్టుకోలేక.. రుణాన్ని క్లోజ్‌ చేసే ప్రయత్నాలు మొదలు పెడుతుంటారు.  

రుణంతో కలసి సాగడమే.. 
కొన్ని రుణాలను ముందుగా చెల్లించడం కంటే, వాటిని కొనసాగించుకోవడం ద్వారా రుణ గ్రహీత అదనపు ప్రయోజనం పొందొచ్చు. అది ఎప్పుడంటే.. 
→ రుణంపై వడ్డీ రేటు 9–10 శాతం మించకుండా ఉండాలి. సాధారణంగా గృహ రుణం, వాహన రుణం, విద్యా రుణాలు ఇంత తక్కువ రేటుకు వస్తుంటాయి. ప్రాపర్టీ తనఖాపైనా ఇంతే తక్కువ రేటుకు రుణాలు లభిస్తున్నాయి.  
→ రుణాన్ని తీర్చే బదులు, ఆ మొత్తాన్ని పెట్టుబడి పెడితే.. రుణ రేటు కంటే అధిక రాబడి వచ్చేట్టు ఉండాలి. సాధారణంగా ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌పై రాబడులు 10–15 ఏళ్లు అంతకుమించిన దీర్ఘకాలంలో 12–20 శాతం మధ్య ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 
→ అత్యవసరాల కోసం ఉద్దేశించిన నిధిని తీసుకెళ్లి రుణానికి కట్టేయడం వివేకం అనిపించుకోదు. ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోతేనో లేదా వైద్య అత్యవసరం ఏర్పడితేనో నిధుల కోసం మళ్లీ అప్పు చేయాల్సి వస్తుంది. కనుక అత్యవసర నిధిని రుణాల కోసం ఉపయోగించొద్దు.  
→ నెలవారీ రుణ చెల్లింపులు ఆదాయంలో 30% లోపే ఉన్నప్పుడు దాన్ని ముందుగా తీర్చడం కంటే.. మిగులు ఆదాయాన్ని పెట్టుబడులకు మళ్లించుకునే మార్గాలను చూడొచ్చు.  
→ పన్ను ఆదా ప్రయోజనాలున్న రుణాలను వదిలించుకోవడం కంటే కొనసాగించడం ద్వారా ప్రయోజనం పొందొచ్చు. ఉదాహరణకు గృహ రుణం. పాత పన్ను విధానంలో సెక్షన్‌ 80సీ కింద ఇంటి రుణం కోసం చేసే చెల్లింపుల్లో అసలు రూ.1.50 లక్షల వరకు, సెక్షన్‌ 24 కింద వడ్డీ రూ.2 లక్షలపైనా పన్ను మినహాయింపు పొందొచ్చు. పన్ను ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని చూస్తే ఇంటి రుణంపై 8.3% వడ్డీ రేటు చెల్లిస్తున్నప్పటికీ.. నికరంగా పడే భారం 6.5–7% మించదు. పైగా ముందస్తు చెల్లింపుల ను ఈక్విటీ, బంగారంలోకి పెట్టుబడిగా మళ్లించి మెరుగైన రాబడులూ సొంతం చేసుకోవచ్చు.

ఇలాంటపుడు తీర్చేయటమే బెటర్‌...
→ నెలవారీ సంపాదనలో ఈఎంఐలు 45 శాతం మించినట్టయితే, ఆయా రుణాలను త్వరగా చెల్లించే మార్గాలను చూడొచ్చు.   
→ పదవీ విరమణకు చేరువవుతుంటే (మరికొన్నేళ్లే ఉంటే)... అప్పుడు వీలైనంత త్వరగా ఆ రుణాల నుంచి బయటకు రావాలి.  
→ రుణాల్లో అధిక వడ్డీ రేటుతో ఉన్న వాటిని త్వరగా వదిలించుకోవాలి. ఉదాహరణకు క్రెడిట్‌ కార్డులపై 36– 44 శాతం వరకు వడ్డీ పడుతుంది. ఆ తర్వాత వ్యక్తిగత రుణాలపైనా 15 శాతం వరకు వడ్డీ ఉంటుంది. ఇలాంటి వాటిని ముందుగా చెల్లించడం వల్ల లాభమే కానీ, నష్టం ఉండదు.  
→ కొన్ని వాహన రుణాలపై వడ్డీ రేటు 12 శాతం వరకు ఉంటుంది. ఇలాంటివీ ముందుగా తీర్చేయొచ్చు.  
→ గృహ, విద్యా రుణం తప్ప మిగిలిన రుణాలపై ఎలాంటి పన్ను ప్రయోజనాల్లేవు. కనుక అధిక రేటుతో ఉంటే త్వరగా బయటకు వచ్చేయడం లాభమే. 
→ కొందరు ఈక్విటీ పెట్టుబడులపై మెరుగైన రాబడి వచి్చనప్పటికీ.. పెట్టుబడి కంటే రుణాన్ని ముగించేందుకే మొగ్గు చూపుతుంటారు. అధిక రాబడి కోసం పెట్టుబడులపై రిస్క్‌ తీసుకోవడం వారికి నచ్చదు. పైగా రుణాన్ని ఎక్కువ కాలం పాటు కొనసాగించేందుకు ఇష్టంలేని వారికి సైతం రుణభారం దింపుకోవడమే మెరుగైన మార్గం అవుతుంది. 
→ ఏది ఏమైనా మెరుగైన రాబడులు ఇస్తున్ను పెట్టుబడులను ముందస్తు రుణ ముగింపునకు వినియోగించడం వివేకం అనిపించుకోదు.

ఆదా మామూలుగా లేదుగా..! 
→ రూ.20 లక్షల గృహ రుణాన్ని 15 ఏళ్ల టర్మ్‌తో తీసుకున్నారు. వడ్డీ రేటు 8.3%.  
→ ఇందులో రూ.5 లక్షలను ముందుగా చెల్లించినట్టయితే 15 ఏళ్ల కాలంలో మొత్తం మీద రూ.3.2 లక్షలు వడ్డీ రూపంలో ఆదా అవుతుంది. 
→ రూ.5 లక్షలను ముందస్తు రుణం చెల్లింపులకు వినియోగించకుండా, 12 శాతం రాబడినిచ్చే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే ఏమవుతుంది? 
→ 15 ఏళ్ల కాలంలో రూ.27.36 లక్షలు సమకూరుతుంది.  
→ ముందస్తు రుణ చెల్లింపులకు బదులు.. ఇన్వెస్ట్‌ చేయడం వల్ల రూ.24 లక్షలు సమకూర్చుకోవచ్చని ఈ ఉదాహరణ తెలియజేస్తోంది.  
→ పెట్టుబడులపై రాబడి, రుణం రేటు కంటే అధికంగా ఉంటే అలాంటప్పుడు ముందస్తు చెల్లింపులతో వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు.  

వీటిని గమనించాలి.. 
అధిక రేటుతో తీసుకున్న రుణాలను ముందుగా తీర్చేయడం లాభమే. కానీ, గడువు కంటే ముందుగానే వాటిని ముగించేందుకు బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు ఉచితంగా అనుమతించకపోవచ్చు. ఫోర్‌క్లోజర్‌ చార్జీలంటూ చాలా సంస్థలు రుణ గ్రహీతల నుంచి వసూలు చేస్తున్నాయి. రుణాన్ని గడువులోపు తీర్చేస్తుంటే.. అప్పటికి మిగిలిన బకాయిపై 2–5 శాతం వరకు ఈ రూపంలో చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ తదితర కొన్ని బ్యాంక్‌లు అయితే వ్యక్తిగత రుణాలను ముందుగా తీర్చేస్తుంటే ఎలాంటి చార్జీలు విధించడం లేదు. కనుక ఇలాంటి చార్జీల్లేని చోటే రుణాలు తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. దీనివల్ల తర్వాతి కాలంలో వీలైనంత ముందుగానే గుడ్‌బై చెప్పేయొచ్చు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement