ఇస్రో అద్భుతం: అంతరిక్షం నుంచే నేరుగా 5జీ! | Here are Benefits of ISROs LVM3‑M6 mission | Sakshi
Sakshi News home page

ఇస్రో అద్భుతం: అంతరిక్షం నుంచే నేరుగా 5జీ!

Dec 24 2025 2:04 PM | Updated on Dec 24 2025 2:46 PM

Here are Benefits of ISROs LVM3‑M6 mission

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ ఈరోజు (2025, డిసెంబర్‌ 24) ప్రయోగించిన ‘బ్లూబర్డ్ బ్లాక్-2’ ఉపగ్రహం టెలికాం రంగంలో ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. సాధారణంగా  మనం వాడే ఇంటర్నెట్ కోసం ప్రత్యేకమైన డిష్‌లు లేదా శాటిలైట్ ఫోన్‌లు అవసరమవుతాయి. కానీ, ‘బ్లూబర్డ్ బ్లాక్-2’ సాంకేతికతతో ఎటువంటి అదనపు పరికరాలు లేకుండానే మన సాధారణ 4జీ/5జీ స్మార్ట్‌ఫోన్‌లకు నేరుగా బ్రాడ్‌బ్యాండ్ సిగ్నల్స్ అందుతాయి. ఇది మొబైల్ కనెక్టివిటీలో ఒక అద్భుతమైన మార్పును తీసుకురానుంది.  

మారుమూల ప్రాంతాలకు డిజిటల్ వెలుగులు
భారతదేశంలోని పలు గ్రామీణ, అటవీ, కొండ ప్రాంతాల్లో ఇప్పటికీ మొబైల్ టవర్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్లూబర్డ్ బ్లాక్-2 ఈ ‘డిజిటల్ డివైడ్’ను శాశ్వతంగా పరిష్కరించనుంది. భౌగోళిక అడ్డంకులు ఏమి ఉన్నా, అంతరిక్షం నుండి వచ్చే సిగ్నల్స్ ప్రతి మారుమూల గ్రామానికి చేరువవుతాయి. దీనివల్ల ఆ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఆన్‌లైన్ విద్య, రోగులకు టెలిమెడిసిన్, రైతులకు ఈ-గవర్నెన్స్ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయి.

విపత్తు సమయాల్లో..
ఎక్కడైనా వరదలు, భూకంపాలు లేదా తుఫానులు సంభవించినప్పుడు భూమిపై ఉండే మొబైల్ టవర్లు కూలిపోవడం చూస్తుంటాం. అటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆయా ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి, రెస్క్యూ ఆపరేషన్లు అసాధ్యమవుతుంటాయి. అయితే ‘బ్లూబర్డ్ బ్లాక్-2’ అటువంటి సమయాల్లో ఆపద్బాంధవునిలా పనిచేస్తుంది. భూ నెట్‌వర్క్‌లతో సంబంధం లేకుండా నేరుగా ఉపగ్రహం నుండి సిగ్నల్స్‌ను అందిస్తుంది. తద్వారా సహాయక చర్యలు వేగవంతం అవుతాయి. బాధితుల ప్రాణాలను కాపాడటానికి అవకాశం మొరుగుపడుతుంది.

‘నో సిగ్నల్ లాస్’..
మనం ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా అడవుల గుండా వెళ్తున్నప్పుడు తరచుగా కాల్ డ్రాప్స్ లేదా డేటా సిగ్నల్  కోల్పోతుంటాం. అయితే ‘బ్లూబర్డ్ బ్లాక్-2’ ప్రవేశపెడుతున్న ‘నో సిగ్నల్ లాస్’ ఫీచర్ దీనికి శాశ్వత పరిష్కారం చూపిస్తుంది. మనం ఎక్కడ ఉన్నా, ఏ వాతావరణ పరిస్థితుల్లో ఉన్నా స్థిరమైన, హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుతుంది. ఫలితంగా డెడ్ జోన్‌లు అనే మాటే ఉండదు. నిరంతరాయంగా డేటా ప్రసారం అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం.

గ్లోబల్ స్పేస్ మార్కెట్‌లో.. 
ఈ మిషన్ అంతరిక్ష రంగంలో భారతదేశ శక్తిని ప్రపంచానికి చాటి చెబుతుంది.  బ్లూబర్డ్ ఉపగ్రహాలను ఇస్రో తన బాహుబలి రాకెట్ LVM3 ద్వారా ప్రయోగించడం ద్వారా, అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్‌లో భారత్ తిరుగులేని శక్తిగా ఎదగనుంది. ఇది న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్‌) వంటి సంస్థలకు మరిన్ని విదేశీ ప్రాజెక్టులను దక్కించుకునేందుకు, దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి దోహదపడుతుంది.

భవిష్యత్ డిజిటల్ విప్లవానికి పునాది
బ్లూబర్డ్ బ్లాక్-2 ప్రయోగం రాబోయే రోజుల్లో 'కనెక్టెడ్ వరల్డ్' కలలను నిజం చేయనుంది. ప్రతి ఒక్కరికీ, ప్రతి చోటా ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. ఇది కేవలం సాంకేతిక మార్పు మాత్రమే కాదు.. సామాజిక, ఆర్థిక విప్లవం. ప్రపంచ డిజిటల్ మ్యాప్‌లో భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో నిలపనుంది. అలాగే దేశంలోని సామాన్యుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఈ ఉపగ్రహం కీలక పాత్ర పోషించనుంది.

ఇది కూడా చదవండి: నింగిలోకి ఎల్‌వీఎం3- ఎం6

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement