నేడు (ఆదివారం) మౌని అమావాస్య. హిందూ ధర్మంలో ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉత్తరాదిన దీనిని మాఘ అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజున పుణ్య స్నానం, దానధర్మాలు, పూర్వీకులకు పిండ ప్రదానాలు చేయడం ఎంతో ఉత్తమమని పండితులు చెబుతుంటారు. ఆధ్యాత్మిక, యోగ సాధకులు మౌని అమావాస్య నాడు నిశ్శబ్ద ఉపవాసం పాటిస్తారు. అంటే రోజంతా మౌనంగా ఉంటారు. ఎవరైనా సరే మౌనం వహించినప్పుడు లోపలికి దృష్టిని సారిస్తారు. నిశ్శబ్దం అనేది మనసును ప్రశాంతపరుస్తుంది. ఆలోచనలను శుద్ధి చేస్తుంది.
ఆధునిక జీవనశైలిలో..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనమంతా నిరంతరం శబ్ద కాలుష్యం మధ్య బతుకీడుస్తున్నాం. ట్రాఫిక్ రొద, మొబైల్ రింగ్‌టోన్లు, రోజంతా సాగే అనవసరపు సంభాషణలు మనల్ని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా విపరీతంగా అలసిపోయేలా చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ‘మౌన వ్రతం’ లేదా కాసేపు నిశ్శబ్దంగా ఉండటం అనేది మనకు ఒక వరంగా పరిణమిస్తుంది.
అశాంతికి, ఒత్తిడికి చెక్..
మౌనం అంటే కేవలం బయటి శబ్దాలకు దూరంగా ఉండటం కాదు. ఇది అంతర్గత స్వేచ్ఛకు, నిజమైన ఆనందానికి మార్గం. ఆయుర్వేదంలో పేర్కొన్న వివరాల ప్రకారం, అతిగా మాట్లాడటం వల్ల శరీరంలో ‘వాత దోషం’ పెరుగుతుంది. ఫలితంగా మనసు అశాంతికి గురికావడం, ఒత్తిడి పెరగడం, శక్తి క్షీణించడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. మౌనంగా ఉండటం వల్ల మనసులో సత్వగుణం పెరిగి, ఏకాగ్రత, ధ్యాన శక్తి మరింతగా మెరుగుపడుతుంది. భగవద్గీతలో కూడా మౌనాన్ని ఒక మానసిక తపస్సుగా అభివర్ణించారు. ఇది వాక్కుపై నియంత్రణను సాధించి, శరీరంలోని ఓజస్సును కాపాడుతూ, రక్తపోటు (బీపీ)BP)అదుపులో ఉంచుతూ, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
మౌనంపై సైన్స్ ఏమంటోంది?
మౌనం వల్ల కలిగే ప్రయోజనాలను ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా రుజువుచేసింది. శబ్ద కాలుష్యం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, ఒత్తిడిని పెంచి, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మరోవైపు, మౌనం మెదడుపై లోతైన ప్రభావాన్ని చూపుతుంది. ఒక ప్రముఖ అధ్యయనం ప్రకారం, రోజుకు కనీసం రెండు గంటల పాటు మౌనంగా ఉండటం వల్ల మెదడు కణాల (Brain Cells) అభివృద్ధి జరుగుతుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచి, భావోద్వేగాలను నియంత్రించడంలో, కొత్త విషయాలను నేర్చుకోవడంలో సానుకూల ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
మౌన వ్రతాన్ని ఆచరించడం వల్ల శరీరంలో ఒత్తిడిని పెంచే ‘స్ట్రెస్ హార్మోన్లు’ తగ్గుముఖం పడతాయి. తద్వారా మనసు ప్రశాంతంగా మారుతుంది. ప్రతిరోజూ కాసేపు మౌనంగా ఉండే వారికి నిద్రలేమి సమస్యలు దూరమై, గాఢ నిద్ర పడుతుంది. ప్రశాంతమైన వాతావరణంలో మెదడు మరింత సమర్థవంతంగా ఆలోచించగలుగుతుంది. దీనివల్ల ఏకాగ్రత, సృజనాత్మకత పెరుగుతాయి. అంతేకాకుండా చిన్న చిన్న విషయాలకే చికాకు పడటం, కోపం తెచ్చుకోవడం లాంటి భావోద్వేగ అస్థిరత నుంచి ఉపశమనం లభించి, ఎమోషనల్ బ్యాలెన్స్ సాధ్యమవుతుంది. విపత్కర పరిస్థితుల్లో హింసకు దారితీయకుండా, శాంతియుతంగా సమస్యలను పరిష్కరించే శక్తివంతమైన సాధనం ‘మౌనం’ అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.
ఇది కూడా చదవండి: మిషన్ డాల్ఫిన్: నదీ గర్భంలో భారీ ‘ఆపరేషన్’


