ఆ ఫొటోతో ఆచూకీ! | rowdy escapes jail mental drama | Sakshi
Sakshi News home page

ఆ ఫొటోతో ఆచూకీ!

Jan 25 2026 9:11 AM | Updated on Jan 25 2026 10:02 AM

rowdy escapes jail mental drama

ఆర్మ్‌ రెజ్లర్‌ నుంచి క్రిమినల్‌గా మారిన ఓ రౌడీషీటర్‌ ‘మెంటల్‌’ అవతారం ఎత్తాడు. జైలు నుంచి ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలకు షిఫ్ట్‌ అయ్యాడు. రెండో భార్య తనను కలవడానికి ఆస్పత్రి అధికారులు ఒప్పుకోలేదనే కారణంగా ‘నిప్పుపెట్టి’, అదను చూసుకుని మరికొందరితో కలిసి ఎస్కేప్‌ అయ్యాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అతగాడి ఆచూకీ చిక్కలేదు. ఓపక్క పోలీసులు ఈ ఎస్కేప్డ్‌ రౌడీషీటర్‌ కోసం నిద్రాహారాలు మాని గాలిస్తుండగా, సదరు నేరగాడు మాత్రం తన రెండో భార్యతో విహారయాత్రల్లో జల్సాలు సాగిస్తూ, ఆ ఫొటోలను వాట్సాప్‌ ద్వారా మొదటి భార్యకు షేర్‌ చేసి చిక్కాడు. 2013 డిసెంబర్‌లో ఈ వ్యవహారం చోటు చేసుకుంది. 

నాంపల్లి చాపెల్‌ రోడ్‌కు చెందిన ఖురేషీ గతంలో ఆర్మ్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌. 2006 వరకు దేశ వ్యాప్తంగా జరిగిన సీనియర్‌ ఆర్మ్‌ రెజ్లింగ్‌ పోటీల్లో పాల్గొని, నాలుగైదు మెడల్స్‌ కూడా సంపాదించాడు. ఇతడిపై అబిడ్స్, నాంపల్లి ఠాణాల్లో వరకట్న వేధింపుల కేసుతో పాటు మాదకద్రవ్యాల కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో అబిడ్స్‌ పోలీసులు ఇతడిపై రౌడీషీట్‌ తెరిచారు. ఓ డ్రగ్స్‌ కేసులో 2013 అక్టోబర్‌ 15న పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. తన మానసిక స్థి్థతి సరిగ్గా లేనట్లు జైలు అధికారులను నమ్మించిన ఖురేషీ ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలోని ప్రిజనర్స్‌ వార్డుకు చేరాడు. 

2013 డిసెంబర్‌ 2 రాత్రి 9.30 గంటల సమయంలో మీరాలం మండీ ప్రాంతానికి చెందిన ఖురేషీ రెండో భార్య అల్మాస్‌ అతడిని కలిసేందుకు ఆస్పత్రికి వచ్చింది. ఈ మేరకు సిబ్బందిని అనుమతి కోరగా, వారు డ్యూటీ ఆర్‌.ఎం.ఓకు విషయం చెప్పారు. ములాకత్‌కు అది సమయం కాకపోవడంతో ఆయన నిరాకరించారు. ఇదే విషయాన్ని వార్డు సిబ్బంది ఖురేషీకి తెలిపారు. దీంతో తన భార్యను ములాకత్‌కు ఎందుకు అనుమతించడం లేదంటూ చిందులేశాడు. వార్డు కబోర్డులో ఉన్న తోటి రోగుల కేస్‌షీట్స్‌ తీసుకుని అగ్గిపెట్టెతో వాటికి నిప్పుపెట్టాడు. దీంతో తీవ్రంగా పొగ రావడంతో ఆందోళన చెందిన సిబ్బంది వార్డులో ఉన్న 50 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు సమాయత్తమయ్యారు. అప్పటికే వార్డు మొత్తం పొగతో నిండిపోయి రోగులు, సిబ్బంది ఊపిరాడక ఇబ్బందిపడ్డారు. 

అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది ఎస్కార్టు పోలీసుల సహయంతో 50 మంది రోగులను పక్కవార్డుకు మార్చారు. సిబ్బంది రోగులను మార్చే ప్రయత్నంలో హడావిడిగా ఉన్నట్లు గుర్తించిన ఖురేషీ మరో పదిమంది ఖైదీల సహయంతో అక్కడే ఉన్న ఆక్సిజన్‌ సిలిండర్‌తో గది కిటికీ కింది భాగంలో గోడను ధ్వసం చేసి రంధ్రం చేశాడు. అందులో నుంచి మనిషి వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేసుకుని ఒక్కోక్కరుగా బయటకు వచ్చి పారిపోయారు. ప్రిజనల్‌ వార్డుకు అనుకుని ఉన్న క్వార్టర్స్‌లో మాజీ ఉద్యోగులు నివాసం ఉంటున్నారు. గది గోడను ధ్వంసం చేస్తున్నట్లు శబ్దం రావడంతో వారు బయటికి వచ్చారు. 

అప్పటికే రంధ్రంలో నుంచి ఖైదీలు బయటకు రావడాన్ని గమనించి దగ్గరికి వెళ్లి ఎవరు, ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. దీంతో వారి వద్దకు వచ్చిన ఖురేషీ ‘ఇక్కడి నుంచి వెళ్లండి లేదంటే కత్తితో పొడిచేస్తా’ అంటూ వారిని భయపెట్టాడు. దీంతో భయపడిన వారు ఇంట్లోకి వెళ్లి... గోకుల్‌ థియేటర్‌ వైపు ఉన్న మార్గం ద్వారా కొందరు ఖైదీలు బయటకు వెళ్లిపోయాక ఆస్పత్రి అధికారులకు సమాచారం అందించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. 

ఆస్పత్రి వద్ద నుంచి ఆటోలో తన రెండో భార్య అల్మాస్‌ వద్దకు వెళ్లిన ఖురేషీ ఆమెతో కలిసి టవేరా వాహనంలో ‘టూర్‌’ ప్రారంభించాడు. మొదటి భార్యతో ఐదుగురు పిల్లలు కలిగినప్పటికీ ఖురేషీ ఆ ఏడాది సెప్టెంబర్‌లో అల్మాస్‌ను వివాహం చేసుకున్నాడు. ఆమెతో కలిసి విహారయాత్ర ప్రారంభించిన ఖరేషీ వాహనాలతో పాటు విమానాలు, రైళ్లు వినియోగించారు. ఎక్కడా ఒక్క రోజు కంటే ఎక్కువ బస చేయకుండా గుల్బర్గా, బెంగళూరు, మైసూరు, ఊటీ, అజ్మీర్, ఢిల్లీ, ముంబై, మహాబలేశ్వర్, హరిద్వార్, కాశ్మీర్, గోవా, ఆగ్రా, సిమ్లా, కులూమనాలీ, శ్రీనగర్, పటాన్‌కోట్, లడక్, విజయవాడల్లో తిరిగాడు. వీరి కోసం గాలిస్తున్న పోలీసులు అన్నీ మర్చిపోయి తిరుగుతూనే ఉన్నారు. ఎక్కడకు వెళ్లాడో తెలియక అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

అతడి ఫోన్‌ నంబర్‌ కూడా కనిపెట్టలేక సతమతం అవుతున్నారు. ఇదిలా ఉండగా, తాను రెండో భార్యతో కలిసి జల్సా చేస్తున్న విషయాన్ని మొదటి భార్యకు తెలిపి, ఆమెను సతాయించాలని ఖురేషీ భావించాడు. దీంతో ఆగ్రాలో రెండో భార్యతో కలిసి దిగిన ఫొటోలను వాట్సాప్‌ ద్వారా మొదటి భార్యకు షేర్‌ చేశాడు. దీంతో ఆమె ఈ ఫొటోలతో పాటు అతడు వినియోగిస్తున్న నంబర్‌ను పోలీసులకు అందించింది. వెంటనే అప్రమత్తమై, సాంకేతిక నిఘా ఉంచిన పోలీసులు ఖురేషీని నగరానికి వచ్చాక అరెస్టు చేయాలని భావించారు. చివరకు 2013 డిసెంబర్‌ 24న విజయావాడ నుంచి టోలిచౌకి వచ్చిన ఖురేషీ ఆచూకీని సాంకేతికంగా గుర్తించిన పోలీసులు అతడిని పట్టుకున్నారు. రెండోభార్య అల్మాస్‌కు ఖురేషీ పరారైన ఖైదీ అని తెలిసీ అతడితో సంచరించడంతో ఆమెనూ నిందితురాలిగా చేశారు. 


∙ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement