ఈ వారం కథ: పుత్ర కామేష్టి | evaram katha funday | Sakshi
Sakshi News home page

ఈ వారం కథ: పుత్ర కామేష్టి

Mar 8 2026 12:13 PM | Updated on Mar 8 2026 12:38 PM

evaram katha funday

‘‘శేఖర్‌ గారూ! మీ ఆవిడకు ఎంబ్రియోస్‌ ట్రాన్స్‌ఫర్‌ సర్జరీ చాలా బాగా జరిగిందండీ! ఐవీఎఫ్‌ ప్రాసెస్‌లోని ప్రధానాంకం ముగిసింది. సక్సెస్‌ అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. తనను ఓ ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్‌లో అబ్జర్వేషన్‌లో ఉంచి, ఇంటికి పంపిస్తాము. ఇచ్చిన మెడిసిన్స్‌ జాగ్రత్తగా వాడుకుంటూ, పదిహేను రోజుల తరువాత బ్లడ్‌ టెస్ట్‌కి రావాల్సి ఉంటుంది. ఓకేనా?’’ చెపుతున్న డాక్టర్‌ మాటలను శ్రద్ధగా ఆలకిస్తూ, సరేనన్నట్లు తలాడించి, ‘‘థాంక్స్‌ డాక్టర్‌గారూ..!’’ అన్నాను.‘‘ఇంకా రెండుసార్లు వాడుకునేందుకు మీ ఎంబ్రియోస్‌ ఉన్నప్పటికీ మీకా అవసరం రాకపోవచ్చు లెండి. ఆల్‌ ది బెస్ట్‌! ఆమెను జాగ్రత్తగా చూసుకోండి!...’’ అంటూ ముందుకు కదిలింది డాక్టర్‌.‘ఇప్పుడు సక్సెస్‌ అయితే అయినట్లు. లేదంటే, నేరుగా ఎడాప్షన్‌ కు వెళ్ళిపోవడమే. గత నాలుగైదేళ్ళ నుంచి పడినపాట్లు చాలు. ఇంకా శ్రావ్యను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు...’ అనుకుంటూ, మగతగా పడుకున్న తనను కదిలించకుండా, బ్రేక్‌ఫాస్ట్‌ చేసి వద్దామని బయటకు నడిచాను. అలవాటుగా సుబ్బన్న బడ్డీ హోటల్‌ దాపుకు చేరుకున్నాయి నా కాళ్ళు. 

అక్కడి అనూహ్య దృశ్యాన్ని చూసి, నా చిన్నకళ్ళు పెద్దవయ్యాయి. ఆకలిని రెట్టింపు చేసే దోసెలను, అలసటను ఆవిరి జేసే ఇడ్లీలను, నోరును ఊట బావిగా మార్చేసే పూరీలను కొసరి కొసరి వడ్డిస్తూ, ఆ పదార్థాలంత కమ్మగా పలకరిస్తూ, పైరగాలి వీచినంత ఒడుపుగా పొట్లాలు కడుతూ నిత్యం పారే ఏరల్లే కనిపించే సుబ్బన్న– సముద్రుడిలా గంభీరంగా వంట సామాగ్రినంతా గోతాలకు సర్దేస్తున్నాడెందుకో!రాములవారి వెంట సీతమ్మలా, ఆదిశివుడిలో సగమైన గౌరమ్మలా సుబ్బన్న చేతి ఒడుపుకనుగుణంగా సైనికురాలిలా వెంట ఉంటూ, ముప్పొద్దులా వండి అందించే అతని ఇల్లాలేది, ఎక్కడా కనబడదే...!? తినడానికి వచ్చిన జనాలు పిలుస్తున్నా వినబడనట్లు అలా మిన్నకున్నాడేంటి ఈ సుబ్బన్న. ఏం జరిగుంటుంది? తెలుసుకోమని మనసు రొద పెడుతుంటే, అతనికి దగ్గరగా వెళ్ళి నిలబడి, ‘‘ఏంటి సుబ్బన్నగారూ.. ఏమయింది..?’’ అన్నాను. 

అతనేం మాట్లాడకపోయే సరికి మళ్లీ రెట్టించాను. తలెత్తకుండానే, ‘‘ఈ ఊరొదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం సార్‌..!’’ అన్నాడు. ‘‘అరెరే... ఏమయింది?...’’ అని మొదలెట్టి, కొనసాగింపుగా ఓ పది ప్రశ్నలు వేశాను. దేనికీ జవాబు చెప్పలేదు కానీ, ‘‘ఇప్పుడేమీ అడగొద్దు సార్‌..!’’ అంటున్నప్పుడు అతని గొంతులో జీర నా చెవులను దాటిపోలేదు. ఏదో తీరని వేదనలో ఉన్నట్లున్నాడు. ముఖం కూడా చూపించలేక పోతున్నాడు. ఇంకా అక్కడే ఉండి, అతన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకనిపించి, వేరేచోటకు వెళ్ళి తినేసి, శ్రావ్యకు పార్సిల్‌ కట్టించుకుని హాస్పిటల్‌కు చేరుకున్నాను.తనను ఎక్కువగా మాట్లాడించడమంత మంచిది కాదనిపించి, తన పనులన్నీ చూచి, పక్క బెడ్‌పై కూర్చున్నాను. తలపుల గూడులోకి సుబ్బన్న ప్రవేశించాడు. 

దాదాపు ఐదేళ్ళక్రితం.., ఈ హాస్పిటల్‌కు వచ్చిన మొదటిరోజు ఓపీ వ్రాయించి, ఏదైనా తిందామని మేమిద్దరమూ బయలుదేరాము. అక్కడికి దగ్గరలో ఓ ప్రభుత్వ భవనపు ప్రహరీగోడ మూల మీద నాలుగు రేకులు వేసి, వాటికింద నాలుగు అరుగులు కట్టి ఉన్నాయి. సుబ్బన్న దంపతులు వండి, అందిస్తుంటే... జనాలు కూర్చుని తింటున్నారు.‘‘ఇక్కడ తినేసి వెళదామా..?’’ అంది శ్రావ్య. ‘‘ఆ అరుగుల వెనక చూడు... అంతా బురద... పైగా పందులు, కుక్కలు పొర్లుతున్నాయి ఛండాలంగా... ఇక్కడెలా తింటాము?’’ అన్నాను. ‘‘ఒక్కసారి తిని చూడండి... వదిలిపెట్టరు...’’ అక్కడ తిని వెళుతున్న ఒక వ్యక్తి అన్నాడు. ఇక చేసేదిలేక, అప్పటికంత కన్నా దూరం వెళ్ళలేక అక్కడే తినడానికి కూర్చున్నాము. మా ఇంట్లో చేసుకున్నంత రుచిగా, శుచిగా అనిపించాయి దోసె, ఇడ్లీ... ధర కూడా చాలా సాధారణంగా అనిపించింది. డబ్బులు ఇచ్చేటప్పుడు మంచీ చెడ్డా మాట్లాడుతూ, అతని వివరాలు కనుక్కొని, ‘‘ఆ వెనక పందులవీ తిరగకుండా శుభ్రం చేయించకూడదా సుబ్బన్నగారూ?’’ అన్నాను నవ్వుతూ.

‘‘చేయిద్దామనే అనుకుంటున్నాను సార్‌... ఏ నెలకానెల మా అబ్బాయి ఫీజులకనీ, పుస్తకాలకనీ వచ్చిన డబ్బు కాస్తా అయిపోతా ఉంది. వచ్చే నెల సెలవులు వస్తున్నాయిగా, కాస్తన్నా మిగుల్చుకుని గోడ పెట్టిచ్చేస్తా’’ అన్నాడతను. ‘‘ఏం చదువుతున్నాడు మీ అబ్బాయి..? ఎందరు పిల్లలు మీకు?’’ అడిగాను. ‘‘ఒక్కడే అబ్బాయండి... ఆరోక్లాసయి పోయి, ఏడుకొస్తాడింక... మామూలు గవర్నమెంటు బడికి పంపుదామంటే, ఈ మనిషి వినకుండా పెద్దపెద్దోళ్ళ పిల్లలు చదివే బడిలో చేర్చాడు. ఆ ఖర్చులు పెరుగుతూనే వున్నాయి. తట్టుకోలేక పోతున్నాము’’ అంటున్న భార్యను వారించి, ‘‘మనం ముప్పొద్దులా తిప్పలు పడేదెందుకు... వాడికోసం కాదూ..?’’ అన్నాడు. ‘‘ఏంటో ఈ మనిషి పిచ్చి... ఆ కొడుకే లోకం. వాడిమీద ఈగ వాలనివ్వడు కదా..! పాతికేళ్ళ నుంచి చేయి కాల్చుకుంటున్నా గాని, తలదాచుకునేందుకు చిన్నపాక గూడా వేసుకోలేకపోయాము’’ అందామె.

వాళ్ళిద్దరికీ నలభై ఏళ్ళపైనే ఉంటుంది వయస్సు. అతనేమో ఇనుపకడ్డీలాగ నల్లగా, పొడవుగా ఉన్నాడు. ఆమేమో, బంగారపు ముద్దలాగా తెల్లగా, బొద్దుగా ఉంది. ఇద్దరికీ కొడుకంటే పంచప్రాణాలు కాబోలు. అయినా పిల్లలు పుడితే అంతేనేమో! వాళ్ళకోసం సర్వ సుఖాలను ఒడ్డి, పోరాటం చేయాలనిపిస్తుందేమో..! త్వరగా మేము కూడా తల్లిదండ్రులమైతే ఎంత బాగుంటుంది..!? ఇద్దరం మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వచ్చేశాము. ఓ రెండునెలల తరువాత, మళ్ళీ హాస్పిటల్‌కు వెళ్ళినపుడు, సుబ్బన్న హోటల్‌కే వెళ్ళాము తినడానికి. ఆ వెనుక వైపంతా చదును చేయించి, నాపరాళ్ళు పరిపించి ఓ పరదా కట్టాడు. ‘‘ఇప్పుడు చాలా శుభ్రంగా ఉంది సుబ్బన్నగారూ..!’’ అన్నాను దోసె తింటూ. ‘‘గోడ పెడదామంటే, డబ్బులు చాల్లేదు సార్‌!’’ నొచ్చుకుంటున్నట్లు అన్నాడు. ‘‘పోన్లెండి, ఆ పందులవీ లేకుండా ప్రశాంతంగా ఉంది..’’ అన్నాను.

‘‘అవి మురికి జీవాలు సార్‌... మిగిలిపోయినవి, మురిగిపోయినవి అక్కడ పారబోస్తే తిని, ఆ బురదలోనే పొర్లుతుండేవి. ఈ బండలు పరిచిన తరువాత, మేమేది పడేసినా తినడానికి కూడా రావట్లేదు. ఏ మురుగులో బతుకీడుస్తున్నాయో పాపం..!’’ అన్నాడు జాలిగా ముఖంపెట్టి. ‘‘పోన్లెండి... అవి పంకిల ప్రేమికులు కదా, నచ్చిన గూటికి చేరుంటాయి’’ అన్నాను అతన్ని నవ్విద్దామని. ‘‘డాడీ... అర్జెంట్‌గా ఓ తౌజెండ్‌ రూపీస్‌ కావాలి... రేపు మా స్కూల్‌ పిల్లలమంతా ఎక్స్‌కర్షన్‌కు వెళుతున్నాం’’ అంటూ సుబ్బన్న చెంతకు చేరుకున్నాడొక పిల్లవాడు. పదకొండేళ్ళు ఉంటాయేమో, చాలా తెల్లగా, బొద్దుగా ఉండి... భలే ముద్దొస్తున్నాడు. ‘‘మీ బాబు, వాళ్ళమ్మ పోలికట్లుందండి... చాలా బాగున్నాడు’’ అన్నాను. అతను గుంభనంగా నవ్వుకుంటూ, కొడుకుకు డబ్బులిచ్చి, జాగ్రత్తలు చెప్పి పంపించాక, ‘‘మీకు కూడా మా మనీష్‌ లాంటి మంచి బాబు పుడతాడు లెండి సార్‌!’’ అన్నాడు చిరునవ్వుతో.‘‘థాంక్సండి!’’ అంటూ డబ్బిచ్చి వచ్చేశాము.
 
అలా డాక్టర్‌ రమ్మన్నప్పుడల్లా హాస్పిటల్‌కు, అటునుండి సుబ్బన్న హోటల్‌కు ఐదేళ్ళుగా తిరుగుతున్నా గాని, శ్రావ్య కడుపు పండలేదు, అమ్మానాన్నలు కావాలనే మా కాంక్ష తీరలేదు. కాని, సుబ్బన్నతో, అతని కుటుంబంతో మంచి స్నేహం ఏర్పడింది. ఈ ఊరు వచ్చినప్పుడల్లా అక్కడే తినడం, అతనితో పిచ్చాపాటీ మాట్లాడడం పరిపాటైపోయింది. జ్ఞాపకాల నుంచి బయటికొచ్చిన నాకు, ‘ఇప్పుడింత అర్ధాంతరంగా, మంచి ఆదాయాన్నిస్తున్న హోటల్‌ని ఎందుకు తీసేసుకుంటున్నట్లు? పుట్టి పెరిగిన ఊరునెందుకు వదిలి వెళుతున్నట్లు? ఏం కష్టమొచ్చిందో పాపం..! ఎలా అతని బాధ తెలుసుకోవడం..’ అనుకుంటూ లేచి కూర్చున్నాను. ‘‘శేఖర్‌..!’’ మెల్లిగా శ్రావ్య పిలుపు వినబడడంతో,తనకు చేరువగా వెళ్ళి, ‘‘ఏంటి శ్రావ్యా..!’’ అన్నాను.
 
‘‘ఈ పదిహేను రోజులు ఈ ఊళ్ళోనే ఉండనా... అదే మా వాణీ వాళ్ళింట్లో ఉండనా నేను? తననడిగితే, సంతోషంగా రమ్మంది. ఈ పరిస్థితిలో దూర ప్రయాణం అంత మంచిది కాదేమో కదా..!’’ ఆశగా అడిగింది. వాణి శ్రావ్య పెద్దమ్మ కూతురు. తనమాట తోసివేయలేక సరేనన్నాను. తరువాతి రోజు హాస్పిటల్‌ నుంచి వాణీ వాళ్ళింటికి చేరుకున్నాము. ప్రతిరోజూ బోలెడు మాత్రలు మింగడంతో పాటు, బొడ్డుకు ఇంజక్షన్లు కూడా చేయించవలసి రావడంతో, ఓ నర్సును మాట్లాడి, మిగతా ఏర్పాట్లన్నీ చూసి, వ్యాపార పనుల నిమిత్తమై నేను మా ఊరు వచ్చేశాను. కాల్‌ చేసినప్పుడల్లా, కన్సీవ్‌ అవుతుందో, లేదోనని ఆందోళన పడుతున్న శ్రావ్యకు ఒక దారి మూసుకు పోయినప్పుడు మరిన్ని దారులు తెరచుకుంటాయని, ఇది కాకపోతే దత్తతావకాశం ఉండనే ఉన్నదని, పాజిటివ్‌గా ఉండమని చెప్పి ధైర్యాన్ని అందించాను.

పదిహేనవ రోజు శ్రావ్య రక్తం తీసుకుని, హాస్పిటల్‌ ల్యాబ్‌లో ఇస్తే, సాయంత్రం ఐదుగంటలకు రమ్మన్నారు వాళ్ళు. ఎంత వద్దనుకున్నా, గుండెలో అలల్లా అలజడి. ఓ క్షణం పాజిటివ్‌ తీరానికి చేరుకుంటుంది.. మరుక్షణమే నెగెటివ్‌ అగాధానికి తీసుకెళుతుంది. ఇలాంటి అనిశ్చితమైన మనసుతో శ్రావ్య ఎదుట ఎందుకు లెమ్మని, లేని పని కలిగించుకుని... ఊళ్ళో బలాదూరు తిరుగుడు మొదలెట్టాను. అలవాటుగా సుబ్బన్న హోటల్‌ వైపుకు మళ్ళాయి కాళ్ళు. సుబ్బన్న స్థానంలో మరొకతను కనిపించాడు. పరదా బదులు గోడ, అరుగుల స్థానే ప్లాస్టిక్‌ కుర్చీలు కనిపించాయి. ‘లోపలికెళ్ళి, సుబ్బన్న వివరాలు అడిగితేనో..’ మెదడు తలపును, తడబాటునున్న మనసు తోసిపుచ్చేసింది. కళ్ళు ఆ వైపుకే చూస్తున్నా, కాళ్ళు మాత్రం ముందుకు కదిలాయి. అలా మూడు, నాలుగు వీధులు నడుచుకుంటూ వెళ్ళాక... రోడ్డు దాటబోతుంటే, చాట్‌ మసాలా, పానీపూరితో కూడిన తోపుడుబండి ఎదురొచ్చింది.

దాన్ని తప్పించుకునే క్రమంలో అప్రయత్నంగా బండిని తోసే వ్యక్తిని చూసి నిర్ఘాంతపోయి, నిలబడిపోయాను. నేను తేరుకుని, అతన్ని పిలిచేటప్పటికల్లా.., గబగబా బండిని తోసుకుంటూ వీధి మలుపు తిరిగేశాడు. వెంబడిద్దామనుకున్నాను కాని, తను ఉద్దేశపూర్వకంగా వెళ్ళినపుడు ఎందుకు లెమ్మని వాచ్‌ చూసుకుని హాస్పిటల్‌ వైపుకు మళ్ళాను. వెళ్ళేదారిలో యథాలాపంగా హోటల్‌ వైపుకు మళ్ళాయి నా కళ్ళు. ‘‘రండి సార్‌... వేడివేడి బజ్జీలు తిందురు గానీ..!’’ అన్నాడా కొత్త యజమాని. విషయం తెలుసుకోవాలనే ఉత్కంఠకు ఆ పిలుపును జోడించి కాళ్ళను హోటల్లోకి మళ్ళించాను. ‘‘సుబ్బన్న ఉన్నప్పుడు మీరు తరచు వస్తుండేవారు కదా సార్‌..! నేను చాలాసార్లు చూశాను’’ బజ్జీలు అందిస్తూ అన్నాడతడు. తీగ లాగడానికి మార్గం సుగమమయిందని తృప్తిపడుతూ, ‘‘అవును వచ్చేవాణ్ణి. సుబ్బన్నకు ఏమైందసలు..? వాళ్ళబ్బాయి పానీపూరి బండి దగ్గరున్నాడేంటీ..!?’’ అడిగేశాను.

అతను ఓ నిట్టూర్పు విడిచి, ‘‘ఏముంది సార్, ఆయనది చల్లటి గుండె కదా... రగిలిన మమతల మంటల్లో మండిపోయింది’’ అన్నాడు.
‘‘మమతలేంటీ.. మండటమేంటి..? అర్థమయ్యేట్లు చెప్పవయ్యా..!’’ అన్నాను. ‘‘పదహారేళ్ళు ప్రాణప్రదంగా పెంచుకున్న కొడుకు... ఆ తల్లిదండ్రుల మనసుల్లో మంటలు రాజేసి వెళ్ళిపోయాడు సార్‌!’’ మరుగుతున్న నూనెలో వడల పిండి వేస్తూ చెపుతున్నాడతడు.
‘‘పదహారేళ్ళ పసివాడు ఎక్కడికి వెళతాడు..? తల్లిదండ్రులను వదిలి ఎలా బతుకుతాడు..?’’ ఆవేశంగా అన్నాను.‘సుబ్బన్న దంపతులకు పెళ్ళయ్యాక పదిహేనేళ్ళు గడచినా బిడ్డలు కలగకపోతే, ఏడుగురు పిల్లలను సాకలేక తిప్పలు పడుతున్న వడ్డెర దంపతులతో మాట్లాడి, వాళ్ళకు కొంత పైకమిచ్చి, రెండు నెలల పసిగుడ్డయిన మనీషుని దత్తత తెచ్చుకున్నారంట! వాడు వీళ్ళ నీడన పెరుగుతూ.. చెడు స్నేహాలు పెంచుకుని, దురలవాట్లు నేర్చుకున్నాడు. 

అది తెలుసుకుని, సుబ్బన్న మందలిస్తుండేసరికి.., స్నేహితులు, చుట్టాల ద్వారా అసలు తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోయాడు. ఆ కుటుంబంలో తండ్రీ, తోబుట్టువులంతా తాగుడికి బానిసలయ్యారని, ఇల్లు గడిచే పరిస్థితి లేదని మనీష్‌ కన్నతల్లి వీడిని చదువు మానిపించేసి, పనిలో పెట్టిందట. ‘అదేమిట్రా..’ అని అడిగితే, ‘నన్ను కన్నోళ్ళు, నాకు తోడబుట్టినోళ్ళే నావాళ్ళు, వాళ్ళతోనే బతుకుతాను... బతకలేక పోతే చస్తాను..’ అని తెగేసి చెప్పాడట!’ సుబ్బన్న దంపతులు తట్టుకోలేక, ఊరొదిలి పెట్టి వెళ్ళిపోయారు. ఇన్నాళ్ళూ సుబ్బన్న దంపతుల కష్టంతో ఇంటర్నేషనల్‌ స్కూల్లో చదువుకున్న వాడు, పశువుల పాక వంటి మురికింట్లో పడుకుంటూ, పానీపూరీ అమ్ముకుంటున్నాడు.

 ‘‘ప్రేమ పెంచుకున్న కొడుకు దూరమవడం, పదిమందిలో పరువు పోవడం జీర్ణించుకోలేక, పెంచిన మమతను వదులుకోలేక ఈ హోటల్‌ను నాకు అమ్మేసి, వాళ్ళెటో వెళ్ళిపోయారు సార్‌! ఈ పిల్లవాడికి తెలివిలేకపోయింది సరే.. కనీసం ఏడుగుర్ని కన్న ఆ తల్లికైనా వీళ్ళమీద జాలి లేకపోయింది. ఎవరో తెలియని అనాథను చట్టబద్ధంగా దత్తత తీసుకుని ఉంటే, ఇవాళ సుబ్బన్నకింతటి కడుపుకోత ఉండేది కాదేమో..! ఇట్లా ఎన్నెన్నో అనుకుంటాం గాని, కడుపున పుట్టినోళ్ళతో సాటిరాగలరా సార్, ఈ సాకుడు పిల్లలు..!?’’ అతడింకా ఏదో చెపుతున్నాడు. ఆ గాథ అంతా వినేసరికి, నా మనసంతా మొద్దుబారిపోయింది. ‘నాది అనే భావన ముందు ఇంకేదీ నిలవదా? అమ్మో... బ్లడ్‌ టెస్ట్‌ రిపోర్ట్‌ ఎలా వస్తుందో..! మమతల విలువ తెలియని ఈ వ్యవస్థలో వేరెవరినైనా దత్తత తీసుకోవడమంటే, మరణంతో సమానమే కదా..! సుబ్బన్న వంటి దుస్థితిని ఎదుర్కోవడం మా వంటి సున్నిత మనస్కులకు సాధ్యమయ్యే పనేనా? ప్రస్తుతం ఫలితమెలా ఉన్నా..

మిగిలున్న ఎంబ్రియోలను వాడుకోవడం నయం కదూ..? నేను వెళుతున్న కృత్రిమ పద్ధతే రాళ్ళదారి అనుకుంటే, దత్తత ముళ్ళదారైతే... పిల్లలు కలగని మావంటి వారి పరిస్థితి ఏమిటి? చట్టపరమైన దత్తతకు చెట్టు ఆకులన్ని నిబంధనలు ఉండటం వలనేకదా... సుబ్బన్న దంపతుల వంటివారు అవస్థలకు లోనవుతున్నది? అనేక మార్గాలవెంట పయనించి, పాట్లు పడుతున్నది..! ఇటువంటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే, పెంపుడు తల్లిదండ్రులకు సమాజం నుంచి సవాళ్ళు ఎదురైతే, ఏ ఆదరణకూ నోచుకోని అనాథల గతేంకాను..? మమతలు పంచాలనుకునే మనస్సులెలా లభించేను!? మానవత్వపు చిరునామా ఎటుపోయేను..!?’ అనే సందిగ్ధ ఆలోచనలు, సంశయాల ఆందోళనల మధ్య హాస్పిటల్‌ మెట్లు ఎక్కాను.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement