కంటెంట్ క్రియేటర్లకు మొబైల్ ఫోనే ఆధారం
ప్రణాళిక, షూటింగ్, ఎడిటింగ్, పబ్లిషింగ్ సైతం
ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృత వినియోగం
సామాజిక మాధ్యమాలు ప్రాచుర్యంలోకి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా కంటెంట్ క్రియేటర్లు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చారు. టెక్ట్స్, ఇమేజ్, వీడియో, ఆడియో.. కంటెంట్ రూపం ఏదైనా క్రియేటర్లలో అత్యధికులకు సోషల్ మీడియానే జీవనాధారం. అయితే మొబైల్ ఫోన్ సాయంతో వీరు తమ క్రియేటివిటీని ‘తెర’మీదకు తెస్తున్నారు. భారత్‌లో అయితే క్రియేటివ్ స్టూడియోలుగా ఈ చిన్న ఉపకరణం అవతరించడం విశేషం. పైగా వ్యాపారం, ఫాలోవర్లను పెంచుకునే లక్ష్యంగా కృత్రిమ మేధను సాధనంగా మలుచుకుంటున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్
ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టా్రగామ్, వాట్సాప్.. ప్రపంచవ్యాప్తంగా ఈ సామాజిక మాధ్యమాల్లో 560 కోట్ల మంది విహరిస్తున్నారు. ఇక కంటెంట్ క్రియేటర్లు సుమారు 30 కోట్ల మంది ఉన్నట్టు అంచనా. వీరిలో మన దేశం నుంచి 10 కోట్ల మంది ఉంటారు. తద్వారా ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ క్రియేటర్లతో భారత్ టాప్‌లో నిలిచింది. ఫొటోలు, వీడియోలు తీయడానికే స్మార్ట్‌ఫోన్లను వీరు ఉపయోగిస్తారనుకుంటే పొరపడ్డట్టే. ప్రణాళిక, షూటింగ్, ఎడిటింగ్, పబ్లిషింగ్ సైతం ఫోన్లోనే కానిచ్చేస్తున్నారు.
మన దేశంలో 80 శాతానికిపైగా క్రియేటర్లు పూర్తిగా స్మార్ట్‌ఫోన్ కేంద్రంగా తమ సృజనాత్మకతను ప్రపంచం ముందుకు తెస్తున్నారు. మొబైల్ ఫోన్లలోని ఫీచర్స్ మరింత శక్తివంతంగా, సహజంగా మారుతున్నాయి. దాదాపు 90 శాతం మంది రాబోయే కాలంలో మొబైల్ ఆధారిత కంటెంట్ పెంచాలని భావిస్తున్నారని సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎడోబ్ నివేదిక వెల్లడించింది.
వేగంగా పనులు..
వృద్ధి, సృజనాత్మకత, విస్తరణకు కీలక సాధనంగా జనరేటివ్ ఏఐ అవతరించింది. భారత్, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, యూరప్ సహా ప్రధాన మార్కెట్లకు చెందిన 16,000 మందికిపైగా క్రియేటర్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించింది. క్రియేటివ్ ఏఐని వేగంగా స్వీకరించే దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. జనరేటివ్ ఏఐ ఉత్పాదకత సాధనంగా మాత్రమే కాకుండా ఆదాయాన్ని పునరి్నరి్మంచే శక్తిగా భారతీయ క్రియేటర్లు భావిస్తున్నారు. పనులు వేగంగా పూర్తి చేస్తున్నట్టు చెబుతున్నారు.
అసాధ్యం సుసాధ్యం..
ప్రయోగ సాధనంగా మొదలై ప్రస్తుతం రోజువారీ కార్యాచరణగా జనరేటివ్ ఏఐ మారింది. సర్వేలో పాలుపంచుకున్న భారతీయ క్రియేటర్లు కంటెంట్ రూపకల్పనలో ఏదో ఒక రూపంలో జనరేటివ్ ఏఐని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. తమ వ్యాపారం, ఫాలోవర్ల సంఖ్య వృద్ధిని వేగవంతం చేయడంలో కృత్రిమ మేధ సహాయపడిందని 95% మంది వెల్లడించారు. ఇది అసాధ్యంగా ఉండే కంటెంట్‌ను సృష్టించడానికి వీలు కల్పిస్తుందని 85% మంది నమ్ముతున్నారు. ఆదాయం పెరుగుదల విషయంలో ఈ సాంకేతికత సానుకూల ప్రభావాన్ని చూపిందని 97% మంది భావిస్తున్నారు. కంటెంట్ రూపకల్పనలో తమదే తుది నిర్ణయమని, ఏఐ ఒక సహాయకారిగా మాత్రమే ఉంటుందన్నది వారి మాట.
విభిన్న ఏఐ టూల్స్
ఎడిటింగ్, నాణ్యత, కంటెంట్ మెరుగుదలకై అత్యంత సాధారణ వినియోగ సాధనంగా ఏఐ అవతరించింది. ఆలోచనల మెరుగు, మరింత విజువల్ ఎఫెక్ట్స్ కోసమూ వీటిని వాడుతున్నారు. ఒకే ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడటానికి బదులుగా కంటెంట్ క్రియేటర్లు విభిన్న జనరేటివ్ ఏఐ టూల్స్ ఉపయోగిస్తున్నారు. పదిలో తొమ్మిది మంది ఇటువంటి వారి జాబితాలో ఉండడం విశేషం. తమ సమ్మతి లేకుండా ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి వారి కంటెంట్ ఉపయోగించే అవకాశం ఉందని దేశీయ క్రియేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖర్చు, అస్థిరమైన అవుట్‌పుట్ నాణ్యత, ఏఐ మోడల్స్ ఎలా శిక్షణ పొందుతాయనే అంశంపై స్పష్టత లేకపోవడం విస్తృతస్థాయిలో ఏఐ స్వీకరణకు అతిపెద్ద అడ్డంకులుగా క్రియేటర్లు భావిస్తున్నారు.


