
‘అమ్మవారి తొమ్మిది అలంకారాలు, కృతులు స్త్రీ శక్తి గురించి తెలియజేసేవే. మనలోని శక్తిని ఎలా జాగృతం చేస్తామో అదే మనం’ అంటూ నవరాత్రుల సందర్భంగా చేస్తున్న సాధన, అమ్మవారి కృపతో మొదలైన తన ప్రయాణం గురించి తెలియజేశారు గాయని భమిడి పాటి శ్రీలలిత. విజయవాడ వాసి, గాయని, అమ్మవారి పాటలకు ప్రత్యేకంగా నిలిచిన శ్రీలలిత చెప్పిన విశేషాలు నవశక్తిలో.
‘‘నవరాత్రి సిరీస్ ఆరేళ్లుగా చేస్తున్నాను. బెజవాడ కనకదుర్గమ్మ అలంకరణ ఎలా ఉంటుందో అలాంటి అలంకరణల సెట్ వేసి, షూట్ చేసి, వీడియో ద్వారా చూపించాం. ఈ నవరాత్రుల్లో కనకదుర్గమ్మను నేరుగా దర్శించుకోలేనివారు సోషల్ మీడియాలో తొమ్మిది పాటలుగా విడుదల చేసిన వీడియోలు చూడవచ్చు. అమ్మవారి ప్రతి అలంకరణకు తగ్గట్టుగా పాట ఎంపిక, విజువల్స్ డిజైన్ చేశాం. ప్రతియేటా కొత్తదనం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాం. అమ్మవారి కృతులు అందరిళ్లలో పాడుకునే విధంగా ఆడియోను తీసుకువచ్చాం. పరంపరంగా వచ్చిన కృతులనే తీసుకున్నాం. ఈసారి మాత్రం రెండు భజనలు కూడా వీడియోలో ఉండేలా ప్లాన్ చేశాం. ఈ నవరాత్రి వీడియోకు నెల రోజుల టైమ్ పట్టింది. రోజుకు మూడు అలంకారాల చొప్పున షూట్ చేశాం.
కృతులను నేర్చుకుంటూ ..
చిన్నప్పటి నుంచి ఇంట్లో భక్తి గీతాలు వింటూ ఉండేదాన్ని. మా ఇంట్లో అందరూ అమ్మవారి ఆరాధకులే. అమ్మవారి దీక్ష చేసేవారు. ఇంట్లో అందరూ ఆమె కృతులను పాడుతుంటారు. ఆ విధంగా అమ్మవారి కృతులు వినడం, నేర్చుకోవడం ప్రారంభించాను. మా అత్తింట్లోనూ అమ్మవారి ఆరాధకులే. మా మామగారు నలభై ఏళ్లుగా దుర్గమ్మవారి ఉత్సవాలు జరుపుతున్నారు. దీంతో నేనూ ఆ ఉత్సవాల్లో పాల్గొంటూ, ప్రదర్శన ఇస్తూ వస్తున్నాను. అన్ని పుణ్యక్షేత్రాలూ దర్శించి, అక్కడ ప్రదర్శనలో పాడే అవకాశమూ లభించింది.
పరీక్షలను తట్టుకుంటూ...
అమ్మవారి ఉత్సవాలు, గ్రామదేవతా ఉత్సవాలు, మొన్న జరిగిన తిరుపతి బ్రహ్మోత్సవాల్లోనూ పాల్గొన్నాను. పాట ఎంపిక నుంచి అమ్మవారే ఈ కార్యక్రమం నా చేత చేయిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ కృతులు పాడుతున్నా, వింటున్నా ఒక ఆధ్యాత్మిక భావనకు లోనవుతుంటాను. ఉదాహరణకు.. ఒక కృతిలో 13 చరణాలు ఉంటే.. 9 లేదా 11 చరణాలు పాడుదాం, అంత సమయం ఉండడదు కదా అని ముందు అనుకుంటాను. కానీ, ప్రదర్శనలో నాకు తెలియకుండానే 13 చరణాలనూ పూర్తి చేస్తాను. ఇటువంటి అనుభూతులెన్నో.
సినిమాలోనూ...
ఇటీవలే ఒక సినిమాకు పాటలు పాడాను. ఆరేళ్ల వయసు నుంచి 20 వరకు రియాలిటీ షోలలో పాల్గొన్నాను. బయట మూడు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. మన దేశంలోనే కాకుండా విదేశాలలోనూ ప్రదర్శనలు ఇవ్వడం నిజంగా అదృష్టం. సంగీత కళానిధులైన బాలసుబ్రహ్మమణ్యం, చిత్ర, కోటి, ఉషా ఉతుప్.. వంటి పెద్దవారిని కలిశాను. వారితో కలిసి పాడుతూ, ప్రయాణించాను. ఒకసారి రియాలిటీ షో ఫైనల్స్‌లో పాడుతున్నప్పుడు బాలు గారు ‘నీ వెనక ఏదో దైవశక్తి ఉంది...’ అన్నారు. అదంతా అమ్మవారి ఆశీర్వాదంగా భావిస్తుంటాను.
వదలని సాధన...
ఈ సీరీస్‌లో నాకు చాలా ఇష్టమైనది మహాకవి కాళిదాసు ‘దేవీ అశ్వధాటి’ స్తోత్రం. ప్రవాహంలా సాగే ఆ స్తోత్రాన్ని అమ్మవారి మీద రాశారు. అశ్వధాటి అంటే.. ఒక గుర్రం పరుగెడుతూ ఉంటే ఆ వేగం, శబ్దం ఎలా ఉంటుందో .. ఆ స్తోత్రం కూడా అలాగే ఉంటుంది. 13 చరణాలు ఉండే ఆ స్తోత్రం పాడటం చాలా కష్టం. కానీ, నాకు అది చాలా ఇష్టమైనది. ఏదైనా స్తోత్రం మొదలుపెట్టినప్పుడు దోషాలు లేకుండా జాగ్రత్త పడుతూ, ప్రజల ముందుకు తీసుకువస్తాను. కరెక్ట్‌గా వచ్చేంతవరకు సాధన చేస్తూ ఉంటాను.
మహిళలు జన్మతః శక్తిమంతుఉ కాబటి వారు ఎక్కడినుంచో స్ఫూర్తి పొందడం ఏమీ ఉండదు. మనలోని శక్తి ఏ రూపంలో ఉందో దానిని వెలికి తీసి, ప్రయత్నించడమే. నా కార్యక్రమాలన్నింటా మా అమ్మానాన్నలు, అన్నయ్య, అత్తమామలు, మా వారు.. ఇలా అందరి సపోర్ట్ ఉంది. ఆడియో, వీడియో టీమ్ సంగతి సరే సరి! ’ అంటూ వివరించారు ఈ శాస్త్రీయ సంగీతకారిణి.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి