సాక్షి, విజయవాడ: ఆవకాయ అమరావతి కార్యక్రమానికి షాక్ తగిలింది. పున్నమి ఘాట్‌లో జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఆవకాయ అమరావతి కార్యక్రమం నిర్వహించడానికి సిద్ధమవ్వగా.. పున్నమి ఘాట్‌లోని ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ అడ్డం తిరిగారు. తమను సంప్రదించకుండా తమ ప్రైవేట్ భూముల్లో ఏ విధంగా కార్యక్రమం పెడతారంటూ యజమానులు మీడియా సమావేశం నిర్వహించారు. ఎగ్జిబిషన్‌కు నోటీసులు ఇవ్వకుండా పడగొట్టడంపై మండిపడ్డారు.
భవానీపురం పున్నమి ఘాట్ భూమి యజమానుల సంఘం నేతలు మాట్లాడుతూ.. పున్నమి ఘాట్‌లోని మా భూముల్లో ఎవరెవరో చొరబడుతున్నారు. పున్నమిఘాట్‌లో 20 ఎకరాల వరకు ప్రైవేటు పట్టా ల్యాండ్ ఉంది. మా భూమిని కాపాడుకోవడానికి గోడలు కట్టుకుంటున్నా కానీ కూల్చివేస్తున్నారు. మా భూములకు రక్షణ అవసరం. పుష్కరాలు సమయం నుంచి భూమిలిచ్చి ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరిస్తున్నాం. మా భూములను ఇప్పటివరకు కాపాడుకుంటూ వచ్చాం. అయినా మా సహనాన్ని పరీక్షిస్తున్నారు
..మా హద్దులు వేసుకొని మా భూములను కాపాడుకుంటాం. ప్రభుత్వం కూడా సహకరించాలని కోరుతున్నాం. ఎగ్జిబిషన్‌కు అన్ని అనుమతులు ఉన్నాయి. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పడగొట్టేస్తారా?. ఏమైనా అంటే కలెక్టర్ ఆదేశాలంటున్నారు. ప్రైవేట్ స్థలాల్లో కూల్చివేతలకు ముందస్తు నోటీసులు ఇవ్వరా?. ఎవరికో మేలు చేసేలా రౌడీల్లా వ్యవహరిస్తే సహించం.
కలెక్టర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. మా స్థలాలను వాడుకుంటున్నారు మాకు పరిష్కారం చూపించడం లేదు. 20 ఏళ్లుగా వాడుకుంటూ మాకు రూపాయి బిళ్ల ఇవ్వడం లేదు. ప్రైవేట్ ల్యాండ్స్ కార్యక్రమాలు పెడితే ఎలా?. ప్రభుత్వ కార్యక్రమాలకు సపోర్ట్ చేస్తున్నాం కదా అని మా భూముల నుంచి మమ్మల్నే పంపేస్తారా?. ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం.. మాకు సహకరించకుంటే మేం సహకరించం. న్యాయపరంగా ఎదుర్కొంటాం.. మా భూముల పరిరక్షణకోసం అందరం ఏకమయ్యాం’’ అని ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ పేర్కొన్నారు.


