సాక్షి, విజయవాడ: శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వర్ల దేవస్థానానికి ఏపీసీపీడీసీఎల్ షాకిచ్చింది. కరెంటు బిల్లు చెల్లించలేదని ఆలయానికి విద్యుత్ సరఫరా నిలిపిసేసింది. దుర్గమ్మ ఆలయానికి రూ.3.08 కోట్ల బిల్లు బకాయి ఉందని పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఎన్నిసార్లు నోటిసులిచ్చినా అధికారులు పట్టించుకోలేదని అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో విసుగు చెందిన విద్యుత్ శాఖ అధికారులు హెచ్‌టీ లైన్ నుంచి పవర్ సరఫరా నిలిపేశారు. కరెంటు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆలయ సిబ్బంది జనరేటర్ సాయంతో విద్యుత్ సేవలు కొనసాగిస్తున్నారు. అయితే ఆలయానికి చెందిన సోలార్ ప్లాంట్ నుంచి దేవస్థానానికి విద్యుత్ సరఫరా అవుతుందని ఆలయ అధికారులు అంటున్నారు. అందుకే విద్యుత్ శాఖను పలుమార్లు నెట్ మీటరింగ్ ఏర్పాటు చేయాలని కోరామని తెలిపారు.
అయితే విద్యుత్ శాఖ సోలార్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను సాంకేతిక కారణాలతో నమోదు చేయడం లేదన్నారు. కరెంట్ సరఫరా నిలిపివేస్తామని నిన్న సాయంత్రమే ఈవోకు సమాచారమిచ్చి అధికారులు స్పందించేలోపే విద్యుత్ నిలిపివేసారని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మవారి దర్శనానికి పెద్దఎత్తున భక్తుల వస్తారని వారి మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను అభ్యర్థించారు.


