విజయవాడ ధర్నా చౌక్‌లో ఆత్మగౌరవ దీక్ష
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమగ్రశిక్ష క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్లు (సీఆర్‌ఎంటీ) కదం తొక్కారు. స్కూల్ అసిస్టెంట్ అర్హతలతో విద్యాశాఖలో పనిచేస్తున్న వారంతా ఏపీ సీఆర్‌ఎం టీచర్స్ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్‌లో సోమవారం ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. తొలుత సీఆర్‌ఎం టీచర్లు ఏలూరు లాకుల సెంటర్ నుంచి ధర్నా చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వేతనాలు పెంచాలని, మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వాలని, డీఎస్సీలో వెయిటేజ్ ఇవ్వాలనే డిమాండ్లతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
అనంతరం చేపట్టిన దీక్షలో ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి రమణ, ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయిశ్రీనివాస్, ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చిరంజీవి, ఎస్టీయూ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్, పీఆర్‌టీయూ అసోసియేట్ అధ్యక్షుడు మర్రి ప్రభాకర్ పాల్గొని మద్దతు ప్రకటించారు. దీక్షను ఉద్దేశించి సీఆర్‌ఎం టీచర్స్ యునైటెడ్ ఫోరం ప్రతినిధులు ఎం.కాశి, బి.నారాయణమూర్తి, పోలినాయుడు, రాంజీప్రసాద్, యు.సాయికుమార్ మాట్లాడుతూ.. డిగ్రీ, బీఈడీ, టెట్ అర్హతలు కలిగిన తాము అతి తక్కువ వేతనానికి 14 ఏళ్లుగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్నామన్నారు. అర్హతకు తగిన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
స్కూల్ కాంప్లెక్సులను ఏ, బీ క్లస్టర్ ప్రతిపాదిత విధానాన్ని విరమించాలని డిమాండ్ చేశారు. తొమ్మిదేళ్లుగా వేతన పెంపు లేకుండా పనిచేస్తున్నామన్నారు. అన్ని అర్హతలు ఉన్న సీఆర్‌ఎంటీలకు డీఎస్సీలో వెయిటేజ్ ఇవ్వాలని, ట్రావెలింగ్ అలవెన్సు పునరుద్ధరించాలని, సీఆర్‌ఎంటీలలో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించి అందరికీ ఒకే విధమైన హోదాను, పనిని అప్పగించాలని డిమాండ్ చేశారు. కొన్ని జిల్లాల్లో ఖాళీ పోస్టుల్లో 50–100కిలో మీటర్ల దూరం ఉన్న వారిని మ్యాపింగ్ చేసే ప్రక్రియను విరమించాలన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులకు నూతన నియామకాలు చేపట్టి సీఆర్‌ఎంటీలపై అదనపు పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. సీఆర్‌ఎంటీలకు నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ప్రకటించాలన్నారు. సీఆర్‌ఎంటీలను విద్యాశాఖలో విలీనం చేసి, రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.


