
ఇస్లాం వెలుగు
హజ్రత్ అబ్దుల్ ఖాదర్ జీలానీ రహ్మతుల్లాహ్ అలైహ్ గొప్పదైవభక్తుడు. అనునిత్యం దైవధ్యానంలో నిమగ్నమై ఉంటూ, ప్రజలకు ధార్మికబోధ చేస్తూ ఉండేవారు. ఒకనాటి రాత్రి ఆయన యధాతథంగా దైవారాధనలో నిమగ్నమై ఉన్నారు. అంతలో ఒక మహోజ్వలమైన వెలుగు కనిపించింది . హజ్రత్ అబ్దుల్ ఖాదర్ జీలానీ రహ్మ బయటికి వెళ్ళి చూశారు. ఆకాశం వైపునుండి ఒక సింహాసనం జాజ్వల్యమానంగా వెలుగులు విరజిమ్ముతూ భూమ్మీదకు దూసుకువస్తోంది. అసలు అది ఏమిటో కూడా చూడలేనంత వెలుగు భూమండలంపై పరచుకుంటోంది. అంతలో ’అబ్దుల్ ఖాదర్ జీలానీ..! మేము నీ దైవభక్తిని, నీ ఆరాధనను మెచ్చుకున్నాము. ఇకనుండి ఇతరులకు ధర్మబద్దం కానివి నీకు ధర్మబద్ధం చేశాము. అంటే హరాం విషయాలను నీకు హలాల్ గా చేశాము.’అన్న అదృశ్యవాణి వినిపించింది.
అప్పుడు హజ్రత్ జీలానీ రహ్మ, హరామ్ వస్తువులు హలాల్ చేయడం ఎవరికిసాధ్యం? ఇదేమైనా షైతాన్ పన్నాగం కాదుకదా..?.. అని ఆలోచిస్తూ..,’ ఇంతకూ నువ్వు ఎవరివి? దైవానివా. సృష్టికర్తవా..?’అని ప్రశ్నించారు. ఈప్రశ్నకు అటువైపునుండి ఎటువంటి సమాధానమూ రాలేదు. నేను దేవుణ్ణి అని చెప్పేధైర్యం షైతాన్ కులేదు. వాడు నేనే దైవాన్ని అని చెప్పలేడు. మౌనమే సమాధానమైంది. వెంటనే ఆయన, ఇదంతా షైతాన్ కల్పించిన భ్రమ మాత్రమే.. అని పసిగట్టి,’ శాపగ్రస్తుడా.. దుర్మార్గుడా..దూరంగా పారిపో..’అంటూ.. అల్లాహ్ శరణు వేడుకున్నారు.
అప్పుడు షైతాన్ మరో పాచిక విసురుతూ..’జీలానీ ..నిన్నునీ జ్ఞానం కాపాడింది.’ అని పలికాడు. ’కాదు.. కాదు.. నా జ్ఞానం కాదు..నాప్రభువు కాపాడాడు.’ అన్నారు హజ్రత్ జీలానీ రహ్మ వెంటనే.. ఈ విధంగా షైతాన్ చివరి అస్త్రం కూడా పనిచేయకుండా పోయింది. దీనివల్ల మనకు అర్ధమయ్యేదేమిటంటే, మనమేదో దైవభక్తులమని, దానధర్మాలు చేస్తుంటామని, ఇతరసత్కార్యాలెన్నో చేస్తూ ఉంటామని, విద్యావిజ్ఞానాలు ఉన్నాయని, అందరికంటే నాలుగాకులు ఎక్కువే చదివామని ఎవ్వరూ భ్రమపడకూడదు. అంతా దైవానుగ్రహమని మాత్రమే భావించాలి తప్ప దైవభక్తిపరులమని ప్రత్యేకతలు ఆపాదించుకొని గర్వించకూడదు.
– మదీహా