భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ గెలువడంలో తెర వెనక కీలకపాత్ర పోషించిన హెడ్ కోచ్ అమోల్ మజుందార్ తమ ప్లేయర్ల ప్రదర్శన పట్ల గర్వం వ్యక్తం చేశాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ వారిని ప్రోత్సహించి బాగా ఆడేలా చేయడంలో తన అనుభవం ఉపయోగపడిందని అతను వ్యాఖ్యానించాడు. ‘గత రెండేళ్లు ఈ జట్టుతో అద్భుతంగా సాగాయి. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్లాం. ఇలాంటి ప్లేయర్లతో పని చేయడం గర్వంగా అనిపించింది.
నాకున్న అనుభవంతో టీమ్‌ను తీర్చి దిద్దేందుకు ప్రయత్నించాను. వారిలో స్ఫూర్తి నింపేందుకు నా అనుభవాన్ని వాడుకున్నా. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడినప్పుడు ఇది చాలా ఉపయోగపడింది. ఒక మ్యాచ్‌లో జెమీమాను తప్పించడం జట్టు ప్రయోజనాల కోసమే తీసుకున్న నిర్ణయం. ఈ గెలుపు క్రికెట్ నేర్చుకోవాలనుకునే అమ్మాయిలందరికీ స్ఫూర్తినివ్వడం ఖాయం. చివరి వికెట్ పడిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు నాకు ఏమీ కనిపించలేదు. ఏం జరిగిందో అర్థం చేసుకొని విజయాన్ని ఆస్వాదించేందుకు సమయం పట్టింది’ అని మజుందార్ అన్నాడు.


