జట్టులో ఏడెనిమిది మంది ఆల్‌రౌండర్లు ఉండాలి
టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఫిట్‌నెస్ స్థాయి పరంగా చూస్తే భారత జట్టు ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉందని, మన టీమ్ ఈ విషయంలో అత్యుత్తమ స్థాయిని అందుకోలేదని భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. ‘టి20 ప్రపంచకప్‌లో ఇది చాలా కీలకంగా మారుతుంది. మనం చాలా చురుగ్గా ఉండాలి, ఇదే విషయాన్ని ఆటగాళ్లతో చర్చించాం కూడా. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లంతా నిజాయితీగా తమ అభిప్రాయాలు చెప్పారు. ఎంత ఫిట్‌గా మానసికంగా అంతే చురుగ్గా
ఉంటాం. ఎందుకంటే తీవ్ర ఒత్తిడి ఉండే మ్యాచ్‌లో మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండేందుకు ఇది కూడా అవసరం.
వరల్డ్ కప్‌కు ముందు అలాంటి స్థాయిని అందుకునేందుకు మనకు ఇంకా మూడు నెలల సమయం ఉంది’ అని గంభీర్ అన్నాడు. ఆ్రస్టేలియా గడ్డపై టి20 సిరీస్ విజయం పట్ల కోచ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ తాము కొన్ని కొత్త తరహాలో ప్రణాళికలు రచిస్తే, అవన్నీ సఫలమయ్యాయని గంభీర్ అన్నాడు. పవర్‌ప్లేలోనే బుమ్రాతో మూడు ఓవర్లు వేయించడం కూడా అలాంటిదేనని అతను చెప్పాడు. ‘తొలి ఆరు ఓవర్లలో మూడు బుమ్రావే కావడం మంచి ప్రణాళిక. ఇది చాలా బాగా పని చేసింది. ఆరంభంలోనే మూడు మంచి ఓవర్లు పడితే ప్రత్యరి్థపై ఒత్తిడి పెరుగుతుంది. ఆ తర్వాత ఎలాగూ స్పిన్నర్లు వస్తారు’ అని కోచ్ విశ్లేషించాడు.
బౌలింగ్ విషయంలో మన జట్టుకు కనీసం 7–8 ప్రత్యామ్నాయాలు ఉంటే మంచిదన్నాడు. ‘దూబే, అక్షర్, సుందర్ లాంటి ఆల్‌రౌండర్లు టీమ్‌లో ఉండటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. గతంలో ఆరుకు మించి బౌలింగ్ ప్రత్యామ్నాయాలు ఉండకపోయేవి. ఇప్పుడు అంతకు మించి మనకు అవకాశం ఉంటోంది’ అని కోచ్ చెప్పాడు. మరో వైపు వ్యక్తిగత ప్రదర్శనలకంటే జట్టు విజయాలే తనకు ముఖ్యమని కోచ్ పునరుద్ఘాటించాడు. ‘మ్యాచ్ ఓడాక మన జట్టులో బాగా ఆడిన వారిని ప్రశంసించడంలో అర్థమే లేదు. నేను వ్యక్తిగత రికార్డులకంటే టీమ్ గెలవడం గురించే ఆలోచిస్తాను. ఎవరైనా బాగా ఆడితే మంచిదే కానీ జట్టు గెలిస్తేనే నాకు సంతోషం. అందుకే వన్డే సిరీస్‌లో ఓటమి నిరాశకు గురి చేసింది’ అని గంభీర్ అన్నాడు.


