ఇషాన్ కిషన్ అసాధారణ పునరాగమనం
క్రమశిక్షణారాహిత్యంతో కోల్పోయిన స్థానం
రెండేళ్ల తర్వాత టీమిండియాలోకి
భారత క్రికెట్ జట్టులో ఒక్కసారి స్థానం కోల్పోయిన తర్వాత పునరాగమనం చేయడం అంత సులువు కాదు. పైగా కేవలం ప్రదర్శన బాగా లేక చోటు దక్కకపోతే దేశవాళీలో పరుగుల వరద పారించైనా తిరిగి రావచ్చు. కానీ ప్రవర్తన బాగా లేదనే పేరు వస్తే మాత్రం అందరి దృష్టిలో అతనికి నెగెటివ్ మార్కులు పడినట్లే.
రాహుల్ ద్రవిడ్‌లాంటి సౌమ్యుడికి కూడా తన క్రమశిక్షణారాహిత్యంతో కోపం తెప్పించాడంటే ఆ ఆటగాడు శాశ్వతంగా చెడ్డ పేరు సంపాదించుకున్నట్లే. అయితే ఇషాన్ వీటన్నింటిని అధిగమించాడు. జట్టులో స్థానం కోల్పోయి, ఆపై బీసీసీఐ కాంట్రాక్ట్ కోల్పోయి అన్ని అవకాశాలు కోల్పోయాడని అనిపించిన దశలో మళ్లీ పైకి లేచాడు. క్రికెట్ మైదానంలోనే సత్తా చాటి అనూహ్యంగా ప్రపంచ కప్‌లో పాల్గొనే భారత టి20 టీమ్‌లో స్థానం సంపాదించుకున్నాడు.
సాక్షి క్రీడా విభాగం
‘వ్యక్తిగత కారణాలతో’ భారత జట్టుకు దూరమైన తర్వాత 2024 ఐపీఎల్‌లో ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగి రాణించాడు. ఆ సమయంలో 2024 టి20 వరల్డ్ కప్ కోసం జట్టు ఎంపిక జరగాల్సి ఉంది. తన అవకాశాలపై స్పందిస్తూ... ‘నేను అసలు ఇప్పుడు వరల్డ్ కప్ గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు. దేనినీ సీరియస్‌గా తీసుకోకుండా ప్రశాంతంగా ఉన్నాను. ఒక్కసారి ఆట నుంచి విరామం తీసుకుంటే జనం మన గురించి చాలా తప్పుడు మాటలు మాట్లాడతారు.
అయితే ప్రతీది ఆటగాళ్ల చేతుల్లో ఉండదనే విషయం వారికి అర్థం కాదు’... అని అతను వ్యాఖ్యానించాడు. అప్పటికి రెండు నెలల క్రితమే బీసీసీఐ కూడా తమ కాంట్రాక్ట్ జాబితా నుంచి కిషన్ పేరును తొలగించింది. గత కొంత కాలంగా జరిగిన పరిణామాలతో ఆవేదన చెందిన అతను తన అసంతృప్తిని ఈ రకంగా వ్యక్తపర్చినట్లుంది. అయితే ఇంతటి తీవ్ర నిరాశ మధ్య అతను ఆగిపోలేదు. తనకు తెలిసిన బ్యాటింగ్‌తోనే తనను తాను నిరూపించుకోవాలని భావించిన ఇషాన్ దేశవాళీ క్రికెట్‌పై దృష్టి పెట్టాడు.
గతి తప్పినట్లు కనిపించిన కెరీర్‌ను సరైన దిశలో మార్చుకున్నాడు. ఇషాన్ కిషన్ కెరీర్ ఆరంభం నుంచి సంచలనాలతో సాగింది. భారీ హిట్టింగ్ సామర్థ్యం ఉన్న ఎడంచేతి వాటం వికెట్ కీపర్, అదీ ఓపెనర్‌గా ఉండటం అంటే అరుదైన కాంబినేషన్‌గా చెప్పవచ్చు. అలాంటి అరుదైన ప్రతిభతోనే ఈ జార్ఖండ్ కుర్రాడు మొదటి నుంచి అందరి దృష్టిలో పడ్డాడు.
16 ఏళ్లకే రంజీ ట్రోఫీ బరిలోకి దిగిన అతను అండర్–19 వరల్డ్ కప్‌లో పంత్, సర్ఫరాజ్, సుందర్ సభ్యులుగా ఉన్న జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించాడు. భారత జట్టు తరఫున ప్రదర్శనకంటే ఐపీఎల్ ద్వారా ముందుగా గుర్తింపు తెచ్చుకున్న ఆటగాళ్లలో ఒకడైన ఇషాన్ కిషన్ ముంబై తరఫున కీలక విజయాలలో భాగమై ఏడు సీజన్ల పాటు ఆడాడు. 23 ఏళ్ల వయసులో టీమిండియా తరఫున అరంగేట్రం చేసి మూడు ఫార్మాట్‌లలోనూ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో ఇషాన్ కిషన్ పేరు కూడా చేరింది.
క్రమశిక్షణ తప్పి...
2023 దక్షిణాఫ్రికా పర్యటన సమయంలో ఇషాన్ కిషన్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ‘మానసిక సమస్యల’ కారణంగా సిరీస్ మధ్యలోనే తప్పుకున్న అతను కొంత కాలం పాటు ఆటకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అయితే క్రమశిక్షణ తప్పడంతో టీమ్ మేనేజ్‌మెంటే అతడిని తప్పించినట్లు వార్తలు వచ్చాయి.
స్వదేశంలో ఫిట్‌గా మారిన తర్వాత కూడా దేశవాళీ క్రికెట్‌ను పట్టించుకోకుండా ప్రయివేట్ టోర్నీ డీవై పాటిల్‌లో ఆడటం కూడా బోర్డుకు ఆగ్రహం కలిగించింది. దాంతో 2024 ఫిబ్రవరిలో అతడి కాంట్రాక్ట్ రద్దయింది. అప్పటి నుంచి కిషన్‌ను ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. పంత్ కోలుకొని రావడం, ధ్రువ్ జురేల్ టెస్టుల్లో నిరూపించుకోవడంతో పాటు వన్డేల్లో కేఎల్ రాహుల్ కీపింగ్ చేయడం, టి20ల్లో సంజూ సామ్సన్, జితేశ్ శర్మ అందుబాటులో ఉండటంతో ఇప్పట్లో కిషన్ తిరిగి వచ్చే అవకాశాలు కనిపించలేదు. కానీ 27 ఏళ్ల ఈ జార్ఖండ్ కుర్రాడు పోరాడేందుకు సిద్ధమయ్యాడు.
దేశవాళీలో చెలరేగి...
ముందుగా 2024–25 సీజన్ దేశవాళీ క్రికెట్‌లో బరిలోకి దిగడం తప్పనిసరి అనే విషయాన్ని కిషన్ గుర్తించాడు. గత ఏడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత జార్ఖండ్ తరఫున రంజీ ట్రోఫీలో బరిలోకి దిగాడు. ఆ తర్వాత ఎక్కడ అవకాశం లభించినా దానిని వదులుకోకుండా ప్రతీ మ్యాచ్‌లో బరిలోకి దిగేందుకు ప్రయతి్నంచాడు. దులీప్ ట్రోఫీ, చాలెంజర్ టోరీ్నలలో కూడా సత్తా చాటాడు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ తరఫున తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో అదరగొట్టి తనేంటో చూపించాడు. అక్కడితో ఆగిపోకుండా అసలు లక్ష్యం ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం సిద్ధమయ్యాడు. అంచనాలకు అనుగుణంగా చెలరేగుతూ ఏకంగా 197 స్ట్రయిక్ రేట్‌తో 517 పరుగులు సాధించడమే కాదు... కెపె్టన్‌గా జార్ఖండ్‌ను తొలిసారి విజేతగా నిలిపాడు. ‘గీతాపఠనం’ ద్వారా మానసికంగా మరింత దృఢంగా మారి పరిణతి చెందిన ఆటగాడిగా తనను తాను మలచుకున్నాడు. 2025 ఏప్రిల్‌లో ప్రకటించిన బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్‌లో మళ్లీ చోటు లభించింది. ఇప్పుడు అనూహ్యంగా భారత జట్టులో తిరిగి అవకాశం దక్కడం అతని అరంగేట్రంకంటే గొప్ప ఘనత అనడంలో సందేహం లేదు.


