ప్రస్తుత టీ20 క్రికెట్ యుగంలో సెంచరీలు చేయడం సర్వసాధారణం అయిపోయింది. కానీ ఒకప్పుడు క్రికెట్ మైదానంలో సెంచరీ సాధించడం ఒక అరుదైన ఘనత. సచిన్ టెండూల్కర్ నుంచి విరాట్ కోహ్లి వరకు ఎంతో కష్టపడి ఒక్కో శతకాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు.
అందుకే అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా సచిన్ కొనసాగుతున్నాడు. అందుకే అతడిని గాడ్ ఆఫ్ క్రికెట్‌గా పిలుస్తారు. అయితే ఈ సెంచరీల ప్రవాహానికి బీజం పడింది ఎప్పుడో తెలుసా? భారత తరపున తొలి అంతర్జాతీయ సెంచరీ చేసింది ఎవరో తెలుసా? తెలియకపోతే ఈ కథనం చదవాల్సిందే.
డిసెంబర్ 15, 1933.. భారత క్రికెట్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభమైంది. అదే రోజున భారత క్రికెట్ జట్టు స్వదేశంలో తమ తొలి టెస్టు మ్యాచ్ ఆడింది. డగ్లస్ జార్డైన్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు భారత పర్యటనకు వచ్చింది. తొలి టెస్టు మ్యాచ్‌కు ముంబైలోని బాంబే జింఖానా మైదానం వేదికైంది. ఈ చారిత్రత్మక మ్యాచ్‌లో భారత జట్టుకు సి.కె. నాయుడు నాయకత్వం వహించారు.
తొలి సెంచరీ..
ఈ మ్యాచ్‌లో భారత క్రికెట్ దిగ్గజాలు విజయ్ మర్చంట్, లక్ష్మిదాస్ జైలతో పాటు 22 ఏళ్ల పంజాబ్ కుర్రాడు అరంగేట్రం చేశాడు. ఆ 22 ఏళ్ల కుర్రాడు తన పేరును భారత క్రికెట్ చరిత్రలో లిఖించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగులు చేసి సత్తాచాటిన ఆ యువ సంచలనం.. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగాడు. అతడే లెజెండరీ లాలా అమర్‌నాథ్. అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా, అరంగేట్రం టెస్టులోనే శతకం బాదిన మొదటి ఇండియన్‌గా అమర్‌నాథ్ రికార్డు సృష్టించాడు.
అమర్‌నాథ్ విధ్వంసం..
219 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ కేవలం 21 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ఆ కుర్రాడు.. కెప్టెన్ సి.కె. నాయుడుతో కలిసి ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడిని ఆపడం ఇంగ్లీష్ బౌలర్ల తరం కాలేదు. కేవలం రెండు గంటల వ్యవధిలోనే 21 ఫోర్ల సాయంతో 118 పరుగులు సాధించాడు.
అప్పటిలో బంతులు కాకుండా నిమిషాలను పరిగణలోకి తీసుకునేవారు. అమర్‌నాథ్ సెంచరీ పూర్తి చేయగానే మైదానంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆ వార్త బయటకు వెళ్లడంతో జనం స్టేడియానికి పోటెత్తారు. అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చి ఆయనకు పూలమాలలు వేశారు.
మహిళా గ్యాలరీలోని కొందరు అభిమానులు ఆయనపై నగలు, నగదును కురిపించడం ఆ రోజుల్లో ఒక సంచలనంగా మారింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైనప్పటికి.. ఆ ఓటమి అమర్‌నాథ్ సెంచరీ ముందు చిన్నబోయింది. నేడు భారత్ ప్రపంచ క్రికెట్‌లో అగ్రగామిగా ఉండటానికి.. బ్యాటింగ్ పవర్‌హౌస్‌గా పేరుగాంచడానికి పునాది అమర్‌నాథ్ సెంచరీతోనే పడింది. భారత క్రికెట్‌లో ఎన్ని సెంచరీలు నమోదైనా.. అమర్‌నాథ్ బ్యాట్ నుంచి వచ్చిన సెంచరీ చరిత్రలో నిలిచిపోతుంది.
అమర్‌నాథ్ తన కెరీర్‌లో 24 మ్యాచ్‌లు ఆడి 878 పరుగులు చేశాడు. ఆయన పేరిట 45 వికెట్లు కూడా ఉన్నాయి. ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అయితే అమర్‌నాథ్‌కు ఘనమైన రికార్డు ఉంది. 10426 పరుగులతో పాటు 463 వికెట్లు పడగొట్టారు. 2000 సంవతర్సంలో ఆయన అనారోగ్యం కారణాల వల్ల తుది శ్వాస విడిచారు. ఆయన తనయుడు సురీందర్ అమర్‌నాథ్ సైతం భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించారు.


