breaking news
Lala Amarnath
-
సెంచరీ చేసిన తొలి భారత ప్లేయర్ ఎవరో తెలుసా?
ప్రస్తుత టీ20 క్రికెట్ యుగంలో సెంచరీలు చేయడం సర్వసాధారణం అయిపోయింది. కానీ ఒకప్పుడు క్రికెట్ మైదానంలో సెంచరీ సాధించడం ఒక అరుదైన ఘనత. సచిన్ టెండూల్కర్ నుంచి విరాట్ కోహ్లి వరకు ఎంతో కష్టపడి ఒక్కో శతకాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. అందుకే అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా సచిన్ కొనసాగుతున్నాడు. అందుకే అతడిని గాడ్ ఆఫ్ క్రికెట్‌గా పిలుస్తారు. అయితే ఈ సెంచరీల ప్రవాహానికి బీజం పడింది ఎప్పుడో తెలుసా? భారత తరపున తొలి అంతర్జాతీయ సెంచరీ చేసింది ఎవరో తెలుసా? తెలియకపోతే ఈ కథనం చదవాల్సిందే.డిసెంబర్ 15, 1933.. భారత క్రికెట్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభమైంది. అదే రోజున భారత క్రికెట్ జట్టు స్వదేశంలో తమ తొలి టెస్టు మ్యాచ్ ఆడింది. డగ్లస్ జార్డైన్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు భారత పర్యటనకు వచ్చింది. తొలి టెస్టు మ్యాచ్‌కు ముంబైలోని బాంబే జింఖానా మైదానం వేదికైంది. ఈ చారిత్రత్మక మ్యాచ్‌లో భారత జట్టుకు సి.కె. నాయుడు నాయకత్వం వహించారు.తొలి సెంచరీ..ఈ మ్యాచ్‌లో భారత క్రికెట్ దిగ్గజాలు విజయ్ మర్చంట్, లక్ష్మిదాస్ జైలతో పాటు 22 ఏళ్ల పంజాబ్ కుర్రాడు అరంగేట్రం చేశాడు. ఆ 22 ఏళ్ల కుర్రాడు తన పేరును భారత క్రికెట్ చరిత్రలో లిఖించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగులు చేసి సత్తాచాటిన ఆ యువ సంచలనం.. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగాడు. అతడే లెజెండరీ లాలా అమర్నాథ్. అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా, అరంగేట్రం టెస్టులోనే శతకం బాదిన మొదటి ఇండియన్‌గా అమర్నాథ్ రికార్డు సృష్టించాడు.అమర్నాథ్ విధ్వంసం..219 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ కేవలం 21 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ఆ కుర్రాడు.. కెప్టెన్ సి.కె. నాయుడుతో కలిసి ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడిని ఆపడం ఇంగ్లీష్ బౌలర్ల తరం కాలేదు. కేవలం రెండు గంటల వ్యవధిలోనే 21 ఫోర్ల సాయంతో 118 పరుగులు సాధించాడు.అప్పటిలో బంతులు కాకుండా నిమిషాలను పరిగణలోకి తీసుకునేవారు. అమర్నాథ్ సెంచరీ పూర్తి చేయగానే మైదానంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆ వార్త బయటకు వెళ్లడంతో జనం స్టేడియానికి పోటెత్తారు. అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చి ఆయనకు పూలమాలలు వేశారు.మహిళా గ్యాలరీలోని కొందరు అభిమానులు ఆయనపై నగలు, నగదును కురిపించడం ఆ రోజుల్లో ఒక సంచలనంగా మారింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైనప్పటికి.. ఆ ఓటమి అమర్నాథ్ సెంచరీ ముందు చిన్నబోయింది. నేడు భారత్ ప్రపంచ క్రికెట్లో అగ్రగామిగా ఉండటానికి.. బ్యాటింగ్ పవర్‌హౌస్‌గా పేరుగాంచడానికి పునాది అమర్నాథ్ సెంచరీతోనే పడింది. భారత క్రికెట్లో ఎన్ని సెంచరీలు నమోదైనా.. అమర్నాథ్ బ్యాట్ నుంచి వచ్చిన సెంచరీ చరిత్రలో నిలిచిపోతుంది.అమర్నాథ్ తన కెరీర్లో 24 మ్యాచ్‌లు ఆడి 878 పరుగులు చేశాడు. ఆయన పేరిట 45 వికెట్లు కూడా ఉన్నాయి. ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అయితే అమర్నాథ్కు ఘనమైన రికార్డు ఉంది. 10426 పరుగులతో పాటు 463 వికెట్లు పడగొట్టారు. 2000 సంవతర్సంలో ఆయన అనారోగ్యం కారణాల వల్ల తుది శ్వాస విడిచారు. ఆయన తనయుడు సురీందర్ అమర్నాథ్ సైతం భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. -
స్వాతంత్య్రం వచ్చాక టీమిండియా తొలి కెప్టెన్‌గా.. ఆయన కొడుకులు సైతం!
భారత క్రికెట్ తొలితరం క్రీడాకారుల్లో లాలా అమర్నాథ్ భరద్వాజ్ అగ్రగణ్యుడు. టెస్ట్ క్రికెట్లో సెంచరీ సాధించిన తొలి భారతీయుడిగా 1933లోనే ఆయన చరిత్ర సృష్టించారు. రెండో ప్రపంచయుద్ధ కాలంలో భారత్ అధికారికంగా ఎలాంటి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌లలోనూ పాల్గొనలేదు. అదేకాలంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు సహా వివిధ జట్లతో జరిగిన ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో ఆడిన లాలా అమర్నాథ్ ఆ మూడేళ్ల వ్యవధిలోనే ముప్పయి సెంచరీలు సహా పదివేల పరుగుల మైలురాయిని అధిగమించారు. స్వాతంత్య్రం వచ్చాక భారత క్రికెట్ జట్టుకు తొలి కెప్టెన్‌గా సారథ్యం వహించారు. బ్యాట్స్‌మన్‌గానే కాకుండా బౌలర్‌గానూ అద్భుతంగా రాణించారు. అప్పటి ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాట్స్‌మన్ డాన్ బ్రాడ్‌మాన్‌ను తన బౌలింగ్‌లో హిట్ వికెట్‌గా ఔట్‌చేసిన ఏకైక బౌలర్‌గా చరిత్ర సృష్టించారు. క్రీడారంగంలో వారసులు నిలదొక్కుకోవడం చాలా కష్టం. అలాంటిది లాలా అమర్నాథ్ కొడుకులు– సురీందర్ అమర్నాథ్, మోహీందర్ అమర్నాథ్ తండ్రి అడుగుజాడల్లోనే క్రికెట్ క్రీడాకారులుగా అంతర్జాతీయంగా రాణించారు. మొహీందర్ అమర్నాథ్ 1983 ప్రపంచకప్ సాధించిన జట్టు వైస్‌కెప్టెన్‌గా కీలక పాత్ర పోషించాడు. లాలా అమర్నాథ్ చిన్న కొడుకు రాజీందర్ అమర్నాథ్ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకపోయినా, ఫస్ట్‌క్లాస్ క్రికెటర్‌గా రాణించాడు. రాజీందర్ తన తండ్రి జీవిత చరిత్రను ‘లాలా అమర్నాథ్: లైఫ్ అండ్ టైమ్స్– ది మేకింగ్ ఆఫ్ ఎ లెజెండ్’ పేరుతో రాశాడు. తండ్రి స్ఫూర్తితోనే తమ సోదరులు ముగ్గురమూ క్రికెట్లోకి అడుగు పెట్టామని రాజీందర్ చెబుతాడు. భారత క్రికెట్లో తండ్రీకొడుకులు ►వినోద్ మన్కడ్- అశోక్ మన్కడ్ ►నయన్ మోంగియా- మోహిత్ మోంగియా ►యోగ్రాజ్ సింగ్- యువరాజ్ సింగ్ ►రోజర్ బిన్నీ- స్టువర్ట్ బిన్నీ ►సునిల్ గావస్కర్- రోహన్ గావస్కర్ ►హేమంత్ కనిత్కర్- హ్రిషికేశ్ కనిత్కర్ ►విజయ్ మంజ్రేకర్- సంజయ్ మంజ్రేకర్ ►పంకజ్ రాయ్- ప్రణబ్ రాయ్ చదవండి: ఖ్వాజా వీరోచిత సెంచరీ.. బ్యాట్ కిందకు విసిరి! వీడియో వైరల్ ఇండియాలో మ్యాచ్‌లంటే అంతే! వాళ్లు మాపై ఒత్తిడి పెంచి: నితిన్ మీనన్ సంచలన వ్యాఖ్యలు -
లాలా అమర్ నాథ్ భార్య మృతి
న్యూఢిల్లీ: దివంగత మాజీ భారత క్రికెటర్ లాలా అమర్ నాథ్ భార్య కైలాష్ కుమారి(92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం తుదిశ్వాసం విడిచారు. కైలాష్ కుమారి మృతి చెందే సమయంలో ఆమె కుమారులు సురీందర్ అమర్ నాథ్, మొహిందర్ అమర్ నాథ్, రాజిందర్ అమర్ నాథ్ లు ఇంటి వద్దే ఉన్నారు. భారత క్రికెట్ లో ఓ లెజెండ్ క్రికెటర్ గా పేరు గాంచిన లాలా అమర్ నాథ్ పదిహేనేళ్ల కిందట మరణించిన విషయం తెలిసిందే. ఆయన 2000వ సంవత్సరంలో మృతిచెందారు. అప్పటికి ఆయన వయసు 88 సంవత్సరాలు. భారత టెస్టు క్రికెట్ లో తొలి సెంచరీ నమోదు చేసిన ఘనతను లాలా అమర్ నాథ్ తన పేరిట లిఖించుకున్నారు. అటు తరువాత వీరి కుమారులు సురీందర్ అమర్ నాథ్, మొహిందర్ అమర్ నాథ్ లు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. కాగా, మూడో కుమారుడు రాజిందర్ అమర్ నాథ్ మాత్రం తన క్రికెట్ కెరీర్ ను ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లతో ముగించారు.


