లక్నో: యువ ఓపెనర్ ఆయుశ్ మాత్రే (53 బంతుల్లో 110 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. ఫలితంగా ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో ముంబై జట్టు వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు 7 వికెట్ల తేడాతో విదర్భపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన విదర్భ 20 ఓవర్లలో 9 వికెట్లకు 192 పరుగులు చేసింది.
ఓపెనర్లు అథర్వ తైడె (36 బంతుల్లో 64; 9 ఫోర్లు, 1 సిక్స్), అమన్ (30 బంతుల్లో 61; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు అర్ధశతకాలు సాధించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 9.1 ఓవర్లలోనే 115 పరుగులు జోడించడంతో విదర్భకు గట్టి పునాది దక్కింది. అయితే ఆ తర్వాత తేరుకున్న ముంబై బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతూ విదర్భను మరింత భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు.
ధ్రువ్ షొరే (1), యశ్ రాథోడ్ (23), హర్‡్ష దూబే (10), వరుణ్ బిస్త్ (5), దర్శన్ నల్కండే (7) విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో శివమ్ దూబే, సాయిరాజ్ పాటిల్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో ముంబై 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఆయుశ్ మాత్రే అదరగొట్టగా... టీమిండియా టి20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (35; 4 ఫోర్లు, 1 సిక్స్), పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే (39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు.
ఇదే గ్రూప్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో రైల్వేస్ జట్టు 32 పరుగుల తేడాతో కేరళపై గెలిచింది. ఎలైట్ గ్రూప్ ‘బి’మ్యాచ్‌ల్లో ఉత్తరప్రదేశ్ జట్టు 109 పరుగుల తేడాతో జమ్మూకశీ్మర్‌పై, మధ్యప్రదేశ్ జట్టు 62 పరుగుల తేడాతో బిహార్‌పై విజయాలు సాధించాయి. ఎలైట్ గ్రూప్ ‘డి’లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో తమిళనాడుపై, రాజస్తాన్ 5 వికెట్ల తేడాతో త్రిపురపై, ఉత్తరాఖండ్ 6 వికెట్ల తేడాతో సౌరాష్ట్రపై నెగ్గాయి.
ఆయుశ్ అరుదైన రికార్డు
ముంబై ఓపెనర్ ఆయుశ్ మాత్రే అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన పిన్నవయసు్కడిగా అతడు రికార్డు సృష్టించాడు. ఇప్పటికే ఫస్ట్ క్లాస్ క్రికెట్, లిస్ట్ ‘ఎ’లో శతకాలు నమోదు చేసుకున్న మాత్రే... తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో విదర్భతో మ్యాచ్‌లో టి20 ఫార్మాట్‌లోనూ మూడంకెల స్కోరు చేశాడు. తద్వారా చిన్న వయసు (18 సంవత్సరాల 135 రోజులు)లో ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు.


