రాణించిన మిలింద్, రాహుల్, అర్ఫాజ్
ఆకట్టుకున్న రికీ భుయ్, సత్యనారాయణ రాజు
కోల్‌కతా: దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్, ఆంధ్ర జట్లు విజయంతో శుభారంభం చేశాయి. కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియంలో మధ్యప్రదేశ్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘బి’ తొలి లీగ్ మ్యాచ్‌లో సీవీ మిలింద్ సారథ్యంలోని హైదరాబాద్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. లక్నోలో ఎకానా స్టేడియంలో అస్సాం జట్టుతో జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో రికీ భుయ్ నాయకత్వంలోని ఆంధ్ర జట్టు 29 పరుగుల తేడాతో నెగ్గింది.
హైదరాబాద్‌తో జరిగిన పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మధ్యప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. శివాంగ్ కుమార్ (28 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వెంకటేశ్ అయ్యర్ (11) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. హైదరాబాద్ బౌలర్లలో సీవీ మిలింద్ 34 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... రక్షణ్ రెడ్డి 26 పరుగులిచ్చి 2 వికెట్లు, అర్ఫాజ్ అహ్మద్ 6 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నారు. అజయ్‌దేవ్ గౌడ్, ఆశిష్ శ్రీవాస్తవ్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.
అనంతరం హైదరాబాద్ 18.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 145 పరుగులు సాధించి గెలిచింది. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (6 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్స్), అమన్ రావు (13 బంతుల్లో 16; 2 ఫోర్లు), వన్‌డౌన్ బ్యాటర్ ప్రజ్ఞయ్ రెడ్డి (6 బంతుల్లో 9; 1 ఫోర్) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరుకున్నారు. ఈ దశలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రాహుల్ బుద్ధి (46 బంతుల్లో 59 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్), తనయ్ త్యాగరాజన్ (19 బంతుల్లో 18; 1 ఫోర్) నాలుగో వికెట్‌కు 59 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు.
తనయ్ అవుటయ్యాక వచ్చిన భవేశ్ సేథ్ (6 బంతుల్లో 9; 1 సిక్స్) ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. అయితే అర్ఫాజ్ (13 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) అండతో రాహుల్ హైదరాబాద్‌ను విజయతీరానికి చేర్చాడు. శుక్రవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో మహారాష్ట్రతో హైదరాబాద్ తలపడుతుంది.


