రంగారెడ్డి జిల్లా: తాగిన మైకంలో స్పృహ లేకుండా పడి ఉన్న ఓ వ్యక్తి గొంతును కుక్కలు పీక్కుతిన్న సంఘటన శంషాబాద్ సర్కిల్‌లోని మధురానగర్ కాలనీలో చోటు చేసుకుంది. ఆర్‌జీఐఏ పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం వేలూరు అక్కలాయక్కన్‌పట్టి గ్రామానికి చెందిన చిన్నారసు (36) ఇటీవల విమానాశ్రయంలో ఉద్యోగం చేయడానికి శంషాబాద్ వచ్చాడు. అక్కడ మరికొందరితో కలిసి ఓ గదిలో నివాసముంటున్నాడు. శుక్రవారం రాత్రి బాగా మద్యం తాగిన అతడు మధురానగర్ కాలనీ సంతోషిమాతా ఆలయం వీధి మూలమలుపుపై పడిపోయాడు.
రాత్రి 9.30 గంటల సమయంలో రోడ్డుపై పడి ఉన్న అతడిని స్థానికులు కొందరు పక్కకు తీసుకెళ్లి పడుకోబెట్టారు. ఇదిలా ఉండగా శనివారం ఉదయం 6 గంటల సమయంలో అతను శవమై కనిపించాడు. పారిశుద్ధ్య సిబ్బంది చిన్నారసు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. తొలుత హత్యగా భావించినప్పటికీ చిన్నారసు గొంతు భాగం పూర్తిగా కొరికేసినట్లుగా ఉండటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గొంతుభాగంలో ఎక్కువగా మాంసం కోల్పోయి ఉండటంతో కుక్కలు పీక్కుతిన్నట్లు అనుమానించారు.
ఆ దిశగా సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా.. స్పృహలేకుండా పడి ఉన్న చిన్నారసును మధ్యరాత్రి సమయంలో కుక్కలు చుట్టుముట్టినట్లు గుర్తించారు. అయితే కుక్కల కన్నా ముందే అతడి గొంతును పందికొక్కులు లేదా పందులు కొరికి ఉండవచ్చని, ఆ తర్వాత కుక్కలు పీక్కుతిని ఉండవచ్చని వైద్యుల పరిశీలనలో తేలినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.


