జైపూర్: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ (కేఐయూజీ)లో తెలంగాణ ఆర్చర్ తానిపర్తి చికిత రజత పతకంతో మెరిసింది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో చికిత ద్వితీయ స్థానం దక్కించుకుంది. ఈ క్రీడల్లో చికిత లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ తరఫున బరిలోకి దిగింది. టోర్నీ ఆసాంతం రాణించిన తెలంగాణ ఆర్చర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ అదితి గోపీచంద్ స్వామి (శివాజీ యూనివర్సిటీ) చేతిలో ఓడి రజత పతకం కైవసం చేసుకుంది.
శుక్రవారం జరిగిన ఫైనల్లో చికిత 143–147తో అదితి చేతిలో పోరాడి ఓడింది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో పసిడి నెగ్గిన అదితి... ఇక్కడ కూడా అదే జోరు కనబర్చింది. మధుర (కరమ్‌వీర్ పాటిల్ యూనివర్సిటీ)కు కాంస్య పతకం దక్కింది. కాంపౌండ్ టీమ్ విభాగంలో చికిత ప్రాతినిధ్యం వహించిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి స్వర్ణ పతకం దక్కగా... గురు కాశీ యూనివర్సిటీ రజతం, పంజాబ్ యూనివర్సిటీ కాంస్యం గెలుచుకున్నాయి.
స్విమ్మింగ్‌లో ఒలింపియన్ శ్రీహరి నటరాజన్ తొమ్మిది పసిడి పతకాలతో సత్తాచాటాడు. రాజస్తాన్‌లోని పలు నగరాల్లో జరుగుతున్న ఈ క్రీడల్లో 222 యూనివర్సిటీలకు చెందిన 4448 మంది అథ్లెట్లు 23 క్రీడాంశాల్లో పోటీపడుతున్నారు. ఐదో రోజు పోటీలు ముగిసేసరికి జైన్ యూనివర్సిటీ 45 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. స్విమ్మింగ్‌లోనే 27 స్వర్ణాలు, 9 రజతాలు, 9 కాంస్యాలు సాధించింది. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ 22 స్వర్ణాలతో రెండో స్థానంలో ఉంది.


