రిఫ్ఫా (బహ్రెయిన్): ఆసియా యూత్ గేమ్స్‌లో భారత్‌కు చెందిన శ్రియా మిలింద్ రజత పతకంతో మెరిసింది. మహిళల 50 కేజీల మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎమ్‌ఎమ్‌ఏ) కేటగిరీలో శ్రియా రజత పతకం కైవసం చేసుకుంది. దీంతో ఈ టోర్నీలో భారత పతకాల సంఖ్య 16 (2 స్వర్ణాలు, 6 రజతాలు, 8 కాంస్యాలు)కు చేరింది. శనివారం జరిగిన ఫైనల్లో కజకిస్తాన్‌కు చెందిన అమెలినా బకియేవా చేతిలో శ్రియా పరాజయం పాలైంది.
అంతకుముందు శ్రియా యూఏఈ, కిర్గిస్తాన్ ప్లేయర్లపై గెలిచి గ్రూప్ టాపర్‌గా ముందంజ వేసింది. ఈ టోర్నమెంట్‌లో ఎమ్‌ఎమ్‌ఏ విభాగంలో భారత్‌కు ఇది రెండో పతకం. శుక్రవారం పురుషుల 80 కేజీల విభాగంలో వీర్ కాంస్యం గెలుచుకోగా... తాజాగా శ్రియా రజతం నెగ్గింది. కబడ్డీలో పురుషుల, మహిళల విభాగాల్లో భారత్ స్వర్ణాలు గెలిచింది.
తైక్వాండోలో పురుషుల వ్యక్తిగత విభాగంలో దేబాశీశ్ దాస్, మిక్స్‌డ్ డబుల్స్‌లో యశ్విని సింగ్–శివాన్షు పటేల్ కాంస్యాలు గెలుచుకున్నారు. అథ్లెటిక్స్‌లో భారత్ 4 పతకాలు నెగ్గింది. శౌర్య అవినాశ్ (మహిళల 100 మీటర్ల హర్డిల్స్), ఎడ్విన్ జాసన్ (మహిళల 400 మీటర్లు), రాన్‌జానా యాదవ్ (మహిళల 5000 మీటర్ల నడక), ఓషిని (మహిళల డిస్కస్ త్రో) వెండి వెలుగులు విరజిమ్మారు.
పలాశ్ మండల్ (పురుషుల 5000 మీటర్ల నడక), జుబిన్ (పురుషుల హైజంప్), జాస్మీన్ కౌర్ (మహిళల షాట్‌పుట్) కాంస్య పతకాలు గెలుచుకున్నారు. కురాశ్‌లో భారత్‌కు మూడు పతకాలు దక్కాయి. 14 ఏళ్ల కనిష్క బిధూరి రజతం... అరవింద్, ఖుషీ కాంస్యాలు సొంతం చేసుకున్నారు.


