10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్‌కు రెండు స్వర్ణాలు
సామ్రాట్, వరుణ్, శ్రవణ్ బృందానికి పసిడి పతకం
వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన సామ్రాట్ రాణా
వరుణ్ తోమర్ ఖాతాలో కాంస్య పతకం
కైరో: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మూడో రోజు భారత షూటర్లు అదరగొట్టారు. రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో కలిపి మొత్తం నాలుగు పతకాలు సాధించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్‌కు మొత్తం మూడు పతకాలు లభించాయి. ముందుగా టీమ్ విభాగంలో సామ్రాట్ రాణా, వరుణ్ తోమర్, శ్రవణ్ కుమార్‌లతో కూడిన భారత బృందం 1754 పాయింట్లతో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. క్వాలిఫయింగ్‌లో సామ్రాట్ రాణా 586 పాయింట్లు, వరుణ్ తోమర్ 586 పాయింట్లు, శ్రవణ్ 582 పాయింట్లు స్కోరు చేశారు.
10 పాయింట్ల షాట్‌లను వరుణ్‌తో (26) పోలిస్తే ఒక్క షాట్ ఎక్కువ కొట్టడంతో సామ్రాట్ (27)కు క్వాలిఫయింగ్‌లో టాప్ ర్యాంక్ దక్కింది. వరుణ్‌కు రెండో స్థానం లభించింది. వీరిద్దరితోపాటు మరో ఆరుగురు షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధించారు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సామ్రాట్ 243.7 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచి బంగారు పతకాన్ని గెలిచాడు. హు కాయ్ (చైనా; 243.3 పాయింట్లు) రజత పతకం సాధించగా... వరుణ్ తోమర్ (భారత్; 221.7 పాయింట్లు) కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.
ఇషా బృందానికి రజతం
మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్, పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన మనూ భాకర్, ప్రస్తుత ప్రపంచ నంబర్‌వన్ సురుచి సింగ్‌లతో కూడిన భారత జట్టు టీమ్ విభాగంలో 1740 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెల్చుకుంది. క్వాలిఫయింగ్‌లో ఇషా సింగ్ 583 పాయింట్లు, మనూ భాకర్ 580 పాయింట్లు, సురుచి 577 పాయింట్లు స్కోరు చేశారు.
క్వాలిఫయింగ్‌లో ఇషా నాలుగో స్థానంలో, మను ఆరో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరుకోగా... సురుచి 14వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు దూరమైంది. వ్యక్తిగత విభాగంలో మాత్రం ఇషా, మనూ భాకర్‌లకు నిరాశ ఎదురైంది. వీరిద్దరు పతకాలు నెగ్గలేకపోయారు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ఇషా 159.2 పాయింట్లతో ఆరో స్థానంలో, మనూ 139.5 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచి పతకానికి దూరమయ్యారు. మూడో రోజు పోటీలు ముగిశాక భారత్ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి 9 పతకాలతో రెండో స్థానంలో ఉంది.


