నేటి నుంచి ముస్తాక్ అలీ దేశవాళీ టి20 టోర్నీ
ఐపీఎల్ జట్ల దృష్టిలో పడేందుకు కుర్రాళ్ల తహతహ
ఫిట్‌నెస్ నిరూపించుకునే పనిలో హార్దిక్ పాండ్యా
సత్తా చాటుకోవాలనే లక్ష్యంతో పృథ్వీ షా
డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి ముంబై
హైదరాబాద్: క్రికెట్ ప్రపంచం మొత్తం కన్నేసే ఐపీఎల్‌లో ఫ్రాంచైజీల కంట... వేలం పంట పండించుకునేందుకు యువ ఆటగాళ్లకు చక్కని అవకాశమిది. నేటి నుంచి జరిగే దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మెరుపులు మెరిపించేందుకు భారత కుర్రాళ్లు సై అంటున్నారు. కుర్రాళ్లతో పోటీ పడేందుకు, తిరిగి టీమిండియా తరఫున పునరాగమనం చేసేందుకు భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా సన్నద్ధమవుతున్నాడు.
ఇతనొక్కడే కాదు... మరో 74 రోజుల్లోనే ఐసీసీ టి20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, సంజూ సామ్సన్, శార్దుల్ ఠాకూర్‌లతో పాటు తెరమరుగైన పృథ్వీ షా కూడా ముస్తాక్ అలీ టోర్నీ బరిలోకి దిగుతున్నాడు.
బరోడా బలం పాండ్యా
హార్దిక్ పాండ్యా ఆసియా కప్ సందర్భంగా కండరాల గాయానికి గురయ్యాడు. దీంతో టైటిల్ గెలిచిన సూర్యకుమార్ జట్టులో లేడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్న ఈ ఆల్‌రౌండర్ ఫామ్‌పై ఎవరికి ఏ అనుమానాలు లేకపోయినా... భారత్, శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యమివ్వబోయే టి20 మెగా ఈవెంట్‌కు మధ్యలో ఉన్నది ఒకే ఒక్క టి20 సిరీస్ దక్షిణాఫ్రికాతో డిసెంబర్ 9న మొదలవుతుంది.
దీంతో ఫిట్‌నెస్ నిరూపించుకునేందుకు హార్దిక్‌కు ఈ టోర్నీ కీలకంగా మారింది. అతనింకా బరోడా జట్టుతో చేరకపోయినప్పటికీ ఎక్కువ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధంగానే ఉన్నట్లు కోచ్ ముకుంద్ పర్మార్ వెల్లడించారు. ముంబై తరఫున సూర్యకుమార్ గ్రూప్ దశ మ్యాచ్‌లన్నీ ఆడేందుకు ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది.
సహచరుడు శివమ్ దూబే సైతం ముంబైకి సై అంటున్నాడు. అయితే డిఫెండింగ్ చాంపియన్ ముంబైకి శార్దుల్ ఠాకూర్ సారథ్యం వహిస్తున్నాడు. ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి తమిళనాడు కెప్టెన్‌గా, సంజూ సామ్సన్ కేరళ కెప్టెన్‌గా తమ జట్లను నడిపించనున్నారు.
ఐపీఎల్‌పైనే వృథ్వీ ఆశలు
ఐపీఎల్ సహా టీమిండియా తరఫున ఆడిన పృథ్వీ షా చాన్నాళ్లుగా ఫామ్ లేమి, ఫిట్‌నెస్, ప్రవర్తన సరళి బాగోలేక జాతీయ జట్టుతో పాటు సొంత ముంబై జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు మహారాష్ట్ర తరఫున రంజీలాడుతున్న పృథ్వీ... టీమిండియా బెర్త్ సంగతి దేవుడెరుగు ముందు ఐపీఎల్ ఫ్రాంచైజీల కంటపడితే చాలనే ఆశతో ముస్తాక్ అలీ టోర్నీలో మెరిపించేందుకు తెగ కష్టపడుతున్నాడు. నేటి నుంచి హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతా, లక్నో వేదికల్లో ఈ దేశవాళీ టి20 టోర్నీ జరుగుతుంది.
ఏ గ్రూప్‌లో ఎవరున్నారంటే...
గ్రూప్ ‘ఎ’ (8): ఆంధ్ర, అస్సాం, ఛత్తీస్‌గఢ్, కేరళ, ముంబై, ఒడిశా, రైల్వేస్, విదర్భ.
గ్రూప్ ‘బి’ (8): హైదరాబాద్, బిహార్, చండీగఢ్, గోవా, జమ్మూ కశీ్మర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర,
ఉత్తరప్రదేశ్.
గ్రూప్ ‘సి’ (8): బరోడా, బెంగాల్, గుజరాత్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, పుదుచ్చేరి, పంజాబ్, సర్వీసెస్.
గ్రూప్ ‘డి’ (8): ఢిల్లీ, జార్ఖండ్, కర్ణాటక, రాజస్తాన్, సౌరాష్ట్ర, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్.
టోర్నీ జరిగేదిలా...
మొత్తం 32 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో 8 జట్లకు చోటు కల్పించారు. గ్రూప్‌లోని ఒక జట్టు మిగతా ఏడు జట్లతో ఒక్కోసారి తలపడుతుంది. గ్రూప్ దశ మ్యాచ్‌లు ముగిశాక... నాలుగు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు (8) ‘సూపర్ లీగ్’ దశకు అర్హత సాధిస్తాయి.
సూపర్ లీగ్‌కు అర్హత పొందిన 8 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. గ్రూప్ ‘ఎ’లో 4 జట్లు... గ్రూప్ ‘బి’లో 4 జట్లు ఉంటాయి. ‘సూపర్ లీగ్’ మ్యాచ్‌లు ముగిశాక గ్రూప్ ‘ఎ’ విజేత... గ్రూప్ ‘బి’ విజేత ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
మ్యాచ్‌లు ఎక్కడంటే...
గ్రూప్ దశ లీగ్ మ్యాచ్‌లు దేశంలోని నాలుగు వేదికల్లో జరుగుతాయి. గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లను లక్నోలో... గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లను కోల్‌కతాలో... గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లను హైదరా బాద్‌లో... గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లను అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేశారు.
‘సూపర్ లీగ్’ మ్యాచ్‌లకు, ఫైనల్ మ్యాచ్‌కు ఇండోర్ ఆతిథ్యమిస్తుంది. గ్రూప్ దశ లీగ్ మ్యాచ్‌లు డిసెంబర్ 10వ తేదీ వరకు జరుగుతాయి. ‘సూపర్ లీగ్’ మ్యాచ్‌లు డిసెంబర్ 12 నుంచి 16 వరకు నిర్వహిస్తారు. ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 18న జరుగుతుంది.


