హోరాహోరీ పోరులో పంజాబ్ ఓటమి
సత్తా చాటిన అన్షుల్ కంబోజ్
విదర్భపై ముంబై ఘనవిజయం
సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హరియాణా జట్టు ‘సూపర్ ఓవర్’లో పంజాబ్‌పై విజయం సాధించింది. టీమిండియా బ్యాటర్ అభిషేక్ శర్మను విజయవంతంగా అడ్డుకున్న హరియాణా జట్టు ఈ టోర్నీలో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా సికింద్రాబాద్ జింఖానా మైదానంలో శుక్రవారం జరిగిన ‘సూపర్ ఓవర్’లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టును హరియాణా పేస్ బౌలర్ అన్షుల్ కంబోజ్ హడలెత్తించాడు.
మూడు బంతుల్లో ఒక పరుగు మాత్రమే ఇచ్చి అభిషేక్ శర్మ (0), సాన్‌వీర్ సింగ్ (0)లను అవుట్ చేశాడు. దీంతో రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హరియాణా తొలి బంతికే నిషాంత్ (4 నాటౌట్) ఫోర్ కొట్టడంతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన హరియాణా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.
కెప్టెన్ అంకిత్ కుమార్ (26 బంతుల్లో 51; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), నిశాంత్ (32 బంతుల్లో 61; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఆఖర్లో సుమిత్ కుమార్ (14 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడాడు. పంజాబ్ బౌలర్లలో అశ్వని కుమార్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి సరిగ్గా 207 పరుగులు చేసింది.
విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ (6) విఫలం కాగా... అన్‌మోల్‌ప్రీత్ సింగ్ (37 బంతుల్లో 81; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సాన్‌వీర్ సింగ్ (16 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (10 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్స్‌లు), సలీల్ అరోరా (22; 2 ఫోర్లు, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు. హరియాణా బౌలర్లలో అన్షుల్ కంబోజ్, యుజువేంద్ర చహల్, సామంత్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
రెండుసార్లు అభిషేక్‌ను అవుట్ చేయడంతో పాటు పరుగులు కట్టడి చేసిన హరియాణా పేసర్ అన్షుల్ కంబోజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇదే గ్రూప్‌లో జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో పుదుచ్చేరి జట్టు 17 పరుగుల తేడాతో బరోడాపై, హిమాచల్ ప్రదేశ్ జట్టు 83 పరుగుల తేడాతో సరీ్వసెస్‌పై, బెంగాల్ జట్టు మూడు వికెట్ల తేడాతో గుజరాత్‌పై విజయాలు సాధించాయి.


