చండీగఢ్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంజాబ్ రాజధాని చండీగఢ్‌ను లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంచలన ఆరోపణలు చేశారు. పంజాబ్, హర్యానా ఉమ్మడి రాజధాని చండీగఢ్ (Chandigarh)లో చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతి పరిధిలోకి తీసుకొచ్చేలా రాజ్యాంగ అధికరణం 131 సవరణ బిల్లును కేంద్రం తేవడం చర్చకు దారి తీసింది. ఇక, ఈ బిల్లును పంజాబ్‌లోని అన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పంజాబ్, హర్యానా ఉమ్మడి రాజధాని చండీగఢ్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించే ఆదేశాలు, చట్టాలను నేరుగా చేసే అధికారాలను రాష్ట్రపతికి కల్పించిన రాజ్యాంగ అధికరణం 240 పరిధిలోకి చండీగఢ్‌ను కూడా తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదించింది. ఇందుకు గానూ రాజ్యాంగంలోని అధికరణం 131ను సవరిస్తూ బిల్లు తీసుకురానుంది. త్వరలో ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లు పార్లమెంటు ముందుకు రానుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే చండీగఢ్ ఆర్టికల్ 240 పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయంపై పంజాబ్‌లోని పార్టీలు మండిపడుతున్నాయి. ఈ బిల్లును ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), కాంగ్రెస్ (Congress), అకాలీదళ్ (Akali Dal) తీవ్రంగా వ్యతిరేకించాయి.
భగవంత్ మాన్ ఆగ్రహం..
ఈ బిల్లుపై తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ..‘చండీగఢ్‌తో పంజాబ్‌కు విడదీయరాని బంధం ఉంది. పంజాబ్‌కు దానిపై హక్కు కూడా ఉంది. చండీగఢ్ నగరాన్ని నిర్మించేందుకు పంజాబ్‌లోని పలు గ్రామాలను నాశనం చేశారు. అభివృద్ధి కోసం ఎంతో చేశారు. చండీగఢ్ నగరాన్ని ఏ మాత్రం వదులుకునే ప్రసక్తే లేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంజాబ్ రాజధానిని లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకొంటాం’ అని హెచ్చరించారు.
240 పరిధిలోనే మిగతా ప్రాంతాలు..
మరోవైపు.. ఆప్ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ కూడా పంజాబ్ గుర్తింపుపై కేంద్రం దాడి చేస్తోందని అభివర్ణించారు. నియంతృత్వం ఎదుట పంజాబ్ ఏనాడు తలవంచలేదని చరిత్ర చెబుతోందని పేర్కొన్నారు. మరోవైపు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా స్పందిస్తూ.. చండీగఢ్ పంజాబ్‌కు చెందినదేనని.. దానిని లాక్కోవడానికి చేసే ప్రయత్నాలకు తీవ్ర ప్రతికూల పరిణామాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇక, చట్టసభల్లేని కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్-నికోబార్ దీవులు, దాద్రా-నగర్ హవేలీ, లక్షద్వీప్, డామున్-డయ్యూ ప్రస్తుతం అధికరణం 240 పరిధిలోనే ఉన్నాయి.


