‘ఆర్టికల్ 240’ పరిధిలోకి తేవడం ప్రతిపాదనే
ఇంకా తుది నిర్ణయమేమీ తీసుకోలేదన్న కేంద్రం
న్యూఢిల్లీ: పంజాబ్, హరియాణా రాష్ట్రాల ఉమ్మడి రాజధాని, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌ను పూర్తిస్థాయిలో తన అదీనంలోకి తీసుకునే అంశంపై మోదీ సర్కారు వెనక్కు తగ్గింది. విపక్షాల విమర్శల జడివాన, ఇంటాబయటా వెల్లువెత్తుతున్న వ్యతిరేకతకు తలొగ్గింది. చండీగఢ్‌ను ఆర్టికల్ 240 పరిధిలోకి తీసుకొచ్చే ఉద్దేశమేదీ లేదంటూ వివాదానికి తెరదించే ప్రయత్నం చేసింది.
‘‘అది కేవలం ప్రతిపాదన మాత్రమే. పంజాబ్‌లో చట్టాలు చేసే ప్రక్రియను మరింత సులభతరం చేయడం మాత్రమే దీని వెనక ఉన్న ఏకైక ఉద్దేశం. అప్పుడు కూడా పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు, వాటి రాజధాని హోదాలో చండీగఢ్‌కు ప్రస్తుతమున్న సాంప్రదాయిక ఒప్పందాలు, స్థితిగతుల్లో ఏ విధంగానూ మార్పుచేర్పులు చేసే ఆలోచన కేంద్రానికి ఎంతమాత్రమూ లేదు.
చండీగఢ్ పాలన, దాని తాలూకు ప్రస్తుత పాలనాపరమైన నిర్మాణం తదితరాల్లో వేలు పెట్టే ఉద్దేశం కూడా లేదు. అంతేగాక ఈ ప్రతిపాదన ఇంకా కేంద్రం పరిశీలనలో మాత్రమే ఉంది. అంతే తప్ప దీనిపై ఎలాంటి తుది నిర్ణయమూ తీసుకోలేదు’’ అని కేంద్ర హోం శాఖ ఆదివారం హడావుడిగా ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘రాజకీయ పారీ్టలతో పాటు అందరితోనూ అన్నివిధాలా విస్తృతంగా చర్చోపచర్చలు జరిపిన అనంతరమే ఈ విషయమై ఏ నిర్ణయమూ తీసుకోవడం జరుగుతుంది.
అది కూడా అందరికీ అంగీకారయోగ్యంగా, చండీగఢ్ ప్రయోజనాలను పూర్తిస్థాయిలో పరిరక్షించేదిగానే ఉంటుంది. ఈ విషయమై ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’అని చెప్పుకొచి్చంది. ఈ విషయమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లుపెట్టే ఆలోచన కూడా లేదని హోం శాఖ ప్రకటన స్పష్టం చేసింది. చండీగఢ్‌ను ఆర్టికల్ 240 పరిధిలోకి తేవాలని కేంద్రం యోచిస్తున్నట్టు లోక్‌సభ, రాజ్యసభ తమ బులెటిన్లలో పేర్కొనడం, దానిపై పంజాబ్‌లోని పాలక పక్షమైన ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు కాంగ్రెస్ తదితర విపక్షాలన్నీ భగ్గుమనడం తెలిసిందే.
గవర్నరే పాలకుడు
1984 నుంచి పంజాబ్ గవర్నరే చండీగఢ్ పాలకునిగా వ్యవహరిస్తున్నారు. గతంలో ప్రధాన కార్యదర్శే చండీగఢ్ పాలకునిగా ఉండేవారు. తిరిగి ఆ పద్ధతినే పునరుద్ధరించేందుకు 2016లో మోదీ సర్కారు ప్రయతి్నంచింది. ఉన్నతా« దికారిని పంజాబ్ పాలకునిగా నియమించింది. కానీ ఇప్పట్లాగే దానిపై రాజకీయంగా తీవ్ర విమర్శలు రేగడంతో వెనక్కి తగ్గింది.
బీజేపీకి అలవాటే: విపక్షాల ఎద్దేవా
తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, వ్యతిరేకత రాగానే వెనక్కు తగ్గడం బీజేపీకి అలవాటేనని విపక్షాలు ఎద్దేవా చేశాయి. చండీగఢ్ విషయంలో కేంద్రం ప్రమాదకరమైన ఎత్తుగడ వేసిందని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ దుయ్యబట్టారు. చండీగఢ్‌ను ఆర్టికల్ 240 పరిధిలో చేరిస్తే దానిపై పంజాబ్ సర్వహక్కులూ కోల్పోతుందని కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్ అన్నారు.


