లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో కొత్త చరిత్రపై గురి
కాంస్యం కంటే మెరుగైన పతకం సాధించాలన్నదే లక్ష్యం
భారత మహిళల బాక్సింగ్ జట్టు కొత్త హెడ్ కోచ్ సాంటియాగో నియెవా వ్యాఖ్య
న్యూఢిల్లీ: వచ్చే ఒలింపిక్స్‌లో ఒకటి కంటే ఎక్కువ పతకాలు సాధించాలనే లక్ష్యంగా జట్టును తీర్చిదిద్దుతానని భారత మహిళల బాక్సింగ్ కొత్త హెడ్ కోచ్ సాంటియాగో నియెవా అన్నారు. 2028 లాస్ ఏంజెలిస్ విశ్వ క్రీడల్లో కాంస్యానికంటే మెరుగైన పతకంతో చరిత్ర సృష్టించాలనే పట్టుదలతో ఉన్నట్లు ఆయన చెప్పారు. నిజానికి నియెవా భారత బృందంతో పనిచేయడం ఇప్పుడే కొత్త కాదు. 2017 నుంచి 2022 వరకు ఆరేళ్ల పాటు పురుషుల బాక్సింగ్ జట్టుకు హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్‌గా పని చేశారు.
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అమిత్ పంఘాల్ రజతం గెలుపొందడంలో ఆయన కృషి ఉంది. తర్వాత ఆస్ట్రేలియా జట్టుకు సేవలందించేందుకు వెళ్లిన ఆయనను భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) ఈసారి అమ్మాయిల జట్టు కోసం తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న ఆయన వచ్చే నెలలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయనతో భారత మీడియా ముచ్చటించింది. నియెవా ప్రణాళికలెంటో ఆయన మాటల్లోనే...
పతకాలు గెలిచే సత్తా జట్టుకు ఉంది
భారత మహిళల జట్టు పటిష్టంగా ఉంది. పారిస్ ఒలింపిక్స్‌లో గెలవలేకపోయిన పతకాల్ని తర్వాత జరిగే ఒలింపిక్స్‌లో గెలుస్తారనే నమ్మకం నాకుంది. ప్రస్తుత జట్టులో ఒకరిద్దరు కాదు చాలామందే ప్రతిభావంతులు ఉన్నారు. తప్పకుండా వీరంతా లాస్ ఏంజెలిస్‌లో సత్తా చాటుతారు. ముందుగా నేను జట్టుతో కలుస్తాను. వారెలా సన్నద్ధమవుతున్నారో పరిశీలిస్తాను. వారి నమూనా ఏంటో... అదెలా పనిచేయగలదో విశ్లేషించాకే తదుపరి కార్యాచరణ అమలు చేస్తాను.
వచ్చే ఏడాది కీలకం
కీలకమైన 2026 సీజన్ మొదలవనుంది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లాంటి మెగా ఈవెంట్లున్నాయి. కాబట్టే ఒక్కో అంచెను విజయవంతంగా దాటేందుకు జట్టును సన్నద్ధపరచాల్సి ఉంటుంది. బీఎఫ్‌ఐ ఎంపిక చేసిన జట్టు నుంచే పతకాలు గెలిచే సత్తా ఉన్న అమ్మాయిల్ని సానబెట్టాలి. నిజానికి అంతర్జాతీయ బాక్సింగ్‌లో మేరీకోమ్, లవ్లీనా లాంటి వారు స్ఫూర్తిగా ఉన్నారు. వీరిలాగే మరికొందరిని నా శైలి కోచింగ్‌తో తీర్చిదిద్దేందుకు శ్రమిస్తాను.
ఏదైనా సరే దశల వారీగానే...
ముందు భారత్‌కు వెళ్లాలి. రెండు వారాలపాటు అక్కడి పరిస్థితుల్ని క్షుణ్నంగా పరిశీలించాకే ఏదైనా సరే దశల వారిగానే చేయాల్సి ఉంటుంది. ఒక్కసారిగా నా శైలి మార్పుల్ని అందరిపై ఒకేలా రుద్దలేం. ఎక్కడ మెరుగుపడాలో అక్కడే మార్పులుంటాయి. అవసరాన్ని బట్టే మార్గదర్శనం ఉంటుంది. కానీ అన్నీ కూడా ఒకేసారి ఉండవు.


