 
													న్యూఢిల్లీ: 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనం చేస్తున్న నేపథ్యంలో... అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షురాలు క్రిస్టీ కొవెంట్రీతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్షుడు జై షా భేటీ అయ్యారు. లుసానేలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. 1900 పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో తొలిసారి క్రికెట్ పోటీలు నిర్వహించగా... ఆ తర్వాత మరెప్పుడూ విశ్వక్రీడల్లో క్రికెట్‌కు చోటు దక్కలేదు.
ఇప్పుడు 128 ఏళ్ల తర్వాత లాస్ ఏంజెలిస్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో తిరిగి క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. మహిళల, పురుషుల విభాగాల్లో ఆరేసి జట్లు ఒలింపిక్స్‌లో పాల్గొంటుండగా... టి20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ‘లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనం చేయనుండగా... దీనిపై ఐఓసీ అధ్యక్షురాలు క్రిస్టీ కోవెంట్రీని కలవడం ఆనందంగా ఉంది.
ఆ దిశగా ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధితో పాటు ఒలింపిక్ ఉద్యమంలో క్రికెట్ పాత్ర, దాని ప్రాధాన్యత గురించి చర్చించాం’ అని జై షా ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఇదే అంశంపై ఐఓసీ అధ్యక్షురాలితో ఈ ఏడాది ఆరంభంలోనూ జై షా సమావేశమయ్యారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
