క్రికెట్ చరిత్రలో చాలామంది అన్నదమ్ములున్నారు. వీరిలో అతి కొద్ది మంది మాత్రమే కవలలు ఉన్నారు. పురుషుల క్రికెట్‌లో కవలలు అనగానే ముందుగా గుర్తొచ్చేది వా బ్రదర్స్ (స్టీవ్-మార్క్). వీరిద్దరు ఆస్ట్రేలియా తరఫున కలిసి 108 టెస్ట్‌లు, 214 వన్డేలు ఆడారు. ఇందులో 35000కు పైగా పరుగులు చేశారు.

పురుషుల క్రికెట్‌లో మరో ట్విన్స్ జోడీ జేమ్స్ మరియు హేమిష్ మార్షల్. వీర్దిదరు న్యూజిలాండ్ తరఫున కొన్నేళ్ల పాటు టెస్ట్, వన్డే క్రికెట్ కలిసి ఆడారు. వీరిద్దరు కూడా వా సోదరుల మాదిరే కుడి చేతి వాటం బ్యాటర్లు. వీరిద్దరిలో తేడాను కనుక్కోవడం చాలా కష్టం.

ఇటీవలికాలంలో కనిపిస్తున్న మరో కవలల జోడీ ఓవర్టన్ బ్రదర్స్ (క్రెయిగ్-జేమీ). జేమీ మరియు క్రెయిగ్ ఓవర్టన్ కలిసి ఇంగ్లండ్ తరఫున టెస్ట్, వన్డే క్రికెట్ ఆడారు. వీరిద్దరు వా, మార్షల్ సోదరులలాగే ఒకే స్టయిల్ కలిగి ఉన్నారు. జేమీ, క్రెయిగ్ ఇద్దరూ ఫాస్ట్ బౌలింగ్ చేయడంతో పాటు లోయర్ ఆర్డర్‌లో ఉపయోగకరమైన బ్యాటర్లు. వీరిద్దరిలో తేడా కనిపెట్టడం చాలా కష్టం.

పురుషుల క్రికెట్ తొలినాళ్లలో మరో ట్విన్స్ జోడీ ఉండింది. వారి పేర్లు అలెక్, ఎరిక్ బెడ్సర్. ఈ ఇద్దరు కవలలు 1946-1955 మధ్యలో ఇంగ్లండ్‌లో వివిధ స్థాయిల పోటీల్లో పాల్గొన్నారు. అలెక్ ఇంగ్లండ్ జాతీయ జట్టుకు సైతం ఆడగా.. ఎరిక్ దేశవాలీ పోటీలకే పరిమితమయ్యాడు.
మహిళల క్రికెట్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ మరియు కేట్ బ్లాక్‌వెల్ కవలలు. ఈ ఇద్దరూ కలిసి ఆడారు. అలెక్స్ ఆసీస్ జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించింది.
మహిళల క్రికెట్‌లో మరో కవలల జోడీ ఉంది. ఈ జోడీ కూడా ఆస్ట్రేలియాకే చెందింది కావడం విశేషం. ఇక్కడ మరో విశేషమేమిటంటే వీరు ట్విన్స్ కాదు. ట్రిప్లెట్స్ (ముగ్గురు). ఫెర్నీ, ఇరేన్, ఎస్సీ షెవిల్ అనే ఈ ముగ్గురు 20వ శతాబ్దం ఆరంభంలో ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించారు.
ప్రస్తుతం క్రికెట్‌కు సంబంధించి ట్వన్స్ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. పురుషుల జింబాబ్వే అండర్-19 ప్రపంచకప్ జట్టుకు కవలలు ఎంపికయ్యారు. వీరిద్దరూ అదే దేశానికి చెందిన మాజీ ఆటగాడు ఆండీ బ్లిగ్నాట్ కుమారులు కావడం మరో విశేషం.
బ్లిగ్నాట్ 1999-2010 మధ్యలో జింబాబ్వే జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2003 ప్రపంచకప్‌లోనూ ఆడాడు. ఇతని పుత్రసంతానమే మైఖేల్-కియాన్ బ్లిగ్నాట్ జోడీ. ఈ ఇద్దరు త్వరలో జరుగబోయే అండర్-19 ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యారు. 17 ఏళ్ల మైఖేల్, కియాన్ బ్యాట్‌తో, బంతితో రాణించగల సమర్థులు. వీరిద్దరు తండ్రి అడుగుజాడల్లో నడవడానికి సిద్దంగా ఉన్నారు.

వీరి తండ్రి ఆండీ బ్లిగ్నాట్ కూడా ఆల్‌రౌండరే. ఆండీ బంతిని బలంగా బాదేవాడు. అలాగే వేగవంతమైన బౌలర్ కూడా. ఏ స్థాయిలో అయినా ప్రపంచకప్ ఆడిన అతి కొద్ది మంది తండ్రి కొడుకుల జోడీల్లో ఇదీ ఒకటి.


